close
మామిడి పూత, పిందె దశలో చర్యలు!

మామిడిలో డిసెంబరు, జనవరి నెలల్లో ఆశించే చీడపీడలు దిగుబడులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. రైతులు ఈ పంట సాగులో అధిక దిగుబడులు, మేలైన రాబడులు సాధించాలంటే.. పూత, పిందె దశలో జాగ్రత్తలు తీసుకోవాలి. పూమొగ్గలను ఉత్తేజపరిచి త్వరగా పూతను రప్పించేందుకు.. లీటరు నీటికి 10 గ్రా. మల్టీకే (13:00:45) కలిపి ప్రస్తుతం చెట్లపై పిచికారీ చేస్తే.. జనవరిలో పూమొగ్గలు వస్తాయి. డిసెంబరులో తేలికపాటి తడివ్వాలి. ఈ దశలో చీడపీడల నివారణకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.


తేనెమంచు పురుగులు

లేత గోధుమ రంగులో ఉన్న తల్లి పురుగులు చెట్ల ఇగుర్లు, పూమొగ్గలు, పూత కాడలపై 100-200 గుడ్లు పెడతాయి. ఈ గుడ్ల నుంచి వచ్చే పిల్ల, తల్లి పురుగులు లేతాకులు, కొమ్మలు, పూత కాడలు, పూలు, లేత పిందెల నుంచి రసాన్ని పీలుస్తాయి. ఈ పురుగులు లేతాకులకు సోకినప్పుడు ఆకుల చివర్లు, అంచులు మాడిపోతాయి. ఆకు సగభాగం వంగి, బింగి ఆకులుగా తయారవుతాయి. ఇగుర్ల సమయంలో వీటి బెడద ఎక్కువగా ఉంటుంది. ఇవి పూతను ఆశిస్తే.. పూత రాలిపోయి పిందెలు ఏర్పడవు. ఈ పురుగులు విసర్జించిన తేనె లాంటి పదార్థం ఆకులు, పిందెలపై పడి నల్లని మసి ఏర్పడుతుంది. ఫలితంగా ఆకుల్లో కిరణజన్య సంయోగక్రియ జరగదు. పూత, పిందె దశలో నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు వీటి బెడద అధికంగా ఉంటుంది. మిగిలిన సమయంలో ఇవి చెట్ల బెరడులో దాగి ఉంటాయి. వీటి తాకిడి వల్ల పంట దిగుబడి 25 నుంచి 60 శాతం వరకు తగ్గుతుంది.


తామర పురుగులు

ఈ పురుగు కొత్త చిగుర్లు పుట్టే దశలో లేతాకులను గోకి రసాన్ని పీల్చిడంతో ఆకులు చిన్నవిగా మారి రాలిపోతాయి. పిందెల చర్మాన్ని గోకి రసాన్ని పీలుస్తాయి. దీనివల్ల కాయలపై గరుకుగా రాతి మంగు ఏర్పడుతుంది. దీంతో కాయల నాణ్యత దెబ్బతింటుంది.
పూత చుట్టు పురుగు : ఇది పూల గుత్తుల్ని గూడుగా చేసుకొని పూతను తింటుంది. దీంతో ఆ గుత్తుల్లో పిందెలు ఏర్పడవు.


తెగుళ్లు

బూడిద తెగులు : లేత ఆకులు, పూలపై బూడిదరంగు పొడి ఏర్పడుతుంది. ఈ తెగులు పూల కాడల చివర్లో మొదలై క్రమంగా ఆకులకు వ్యాపిస్తుంది. తెగులు సోకిన పూల గుచ్ఛాలు ఫలదీకరణ చెందకుండానే రాలిపోతాయి. ఈ తెగులు సోకిన లేత పిందెలు కూడా రాలిపోతాయి. దీంతో పంట దిగుబడి 5-20 శాతం వరకు తగ్గుతుంది. పగలు ఎక్కువ ఎండ, రాత్రి అధిక చలి ఉండే వాతావరణం, మబ్బు, పొగమంచు ఉండే పరిస్థితులు ఈ తెగులు వ్యాప్తికి అనుకూలం.

పూత మాడు తెగులు: మంచు వాతావరణం, గాలిలో అధిక తేమ ఉండే పరిస్థితుల్లో పూల కాడలు, పూమొగ్గలపై నల్లని చిన్న మచ్చలు ఏర్పడతాయి. ఈ తెగులు మచ్చలు సోకిన భాగాలు పూర్తిగా లేదా పాక్షికంగా ఎండిపోతాయి.
హార్మోన్ల సమతుల్యత లోపించడం : పూత, పిందెలు రావటానికి, వచ్చినవి రాలకుండా ఉండేందుకు చెట్లలో హార్మోన్లు కీలకంగా వ్యవహరిస్తాయి. వీటి లోపం తలెత్తితే పూత, పిందె రాలిపోతుంది.

పూత, పిందె దశలో సస్యరక్షణ

పూమొగ్గ దశ : ముదిరిన కొమ్మల చివర ఉబ్బి పచ్చగా ఉంటాయి. ఈ దశలో లీటరు నీటికి 1.5 గ్రా. ఎసిఫేట్‌ కలిపి పిచికారీ చేయాలి. మొదట మొదళ్లకు, తరవాత కొమ్మలకు, చివరిగా ఆకులపై ఈ మందును పిచికారీ చేయాలి. ఆకులపై నేరుగా పిచికారీ చేస్తే తేనెమంచు పురుగు కొమ్మల బెరడు చీలికల్లోకి వెళ్లి మందు ప్రభావం నుంచి తప్పించుకుంటుంది.
పచ్చిపూత దశ : పూల కాడలు బయటకు సాగి, పక్క రెమ్మలు, పూలు ఏర్పడి విచ్చుకోకుండా ఉంటాయి. ఈ దశలో లీటరు నీటికి 1 మి.లీ. బుప్రోఫెజిన్‌ + 1.5 మి.లీ. హెక్సాకొనజోల్‌ చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
నల్ల పూత దశ : సన్నని పిందెలు ఏర్పడి, పూత మగ్గి నల్లగా కనబడుతుంది. ఈ దశలో లీటరు నీటికి 2 మి.లీ. ఫిప్రోనిల్‌ లేదా 2 మి.లీ. డైమిథోయేట్‌ + 1 గ్రా. థయోఫినేట్‌మిథైల్‌ కలిపి పిచికారీ చేయాలి.
* పూలు విచ్చుకునే తెల్ల పూత దశలో పై మందులు పిచికారీ చేయకూడదు. ఈ దశలో మందులను పిచికారీ చేస్తే.. పూత ఫలదీకరణకు తోడ్పడే తేనెటీగలు, ఇతర పురుగులు చనిపోతాయి. ఫలితంగా పిందెలు ఏర్పడవు.
* పూత చుట్టూ పురుగులు కనిపిస్తే పచ్చిపూత, నల్లపూత దశలో పిచికారీ చేసే మందులకు లీటరు నీటికి 1 మి.లీ. డైక్లోరోవాస్‌ కలిపి పిచికారీ చేయాలి.

- వేంపల్లి లక్ష్మిరెడ్డి, ఉద్యాన సంయుక్త సంచాలకులు (విశ్రాంత), కడప

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.