close
బొప్పాయిలో సస్యరక్షణ చర్యలు

- న్యూస్‌టుడే, ఖమ్మం (వ్యవసాయం) 

బొప్పాయిని ప్రస్తుతం వివిధ రకాల తెగుళ్లు ఆశించి నష్టం కలిగిస్తున్నాయి. వీటిని సకాలంలో గుర్తించి, నివారణకు సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని భద్రాద్రి  కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ఉద్యాన శాస్త్రవేత్త బి.శివ, సమన్వయకర్త డాక్టర్‌ జి.వీరన్న తెలిపారు.


మొజాయిక్‌ వైరస్‌ : ఈ తెగులాశిస్తే ఆకుల పరిమాణం తగ్గుతుంది. ఆకులు ముడుచుకొని, ఆకారం కోల్పోతాయి. ఆకులపై చిన్న పొక్కులు, పసుపురంగు మచ్చలు ఏర్పడతాయి. ముదురాకులు పండుబారి రాలిపోతాయి. చివరి ఆకులు సన్నని తీగల్లా  మారుతాయి. కాయలపై ఉంగరాల ఆకారంలో నీటి మచ్చలు కన్పిస్తాయి. ఈ తెగులు సోకిన మొక్కల్లో.. కాయల నాణ్యత తగ్గి గిడసబారుతాయి. తెగులు ఉధృతంగా ఉంటే.. పంట మొత్తం దెబ్బతింటుంది.

 


వైరస్‌ తెగుళ్లు

ఆకుముడత : ఈ సమస్య బొప్పాయితో పాటు టమాటలోనూ కనిపిస్తుంది. దీంతో ఆకులు కిందకు ముడుచుకుపోయి, ఈనెలు మందంగా మారుతాయి. ఆకులు పెలుసుబారి, కాండాలు వంకర్లు తిరుగుతాయి. తెగులు ఉధృతంగా ఉంటే.. ఆకులు రాలిపోతాయి. పూత రాదు.


రింగ్‌ స్పాట్‌ : బొప్పాయితో పాటు దోసజాతి మొక్కల్లో ఈ తెగులు కనిపిస్తుంది. దీంతో ఆకులు పసుపుబారుతాయి. ఆకులపై రంధ్రాలు ఏర్పడతాయి. కాండంపై ఆయిల్‌ లేదా నీటి తడి మాదిరి చారలు ఏర్పడతాయి. కాయలపై కొన్నిసార్లు బొబ్బల వలె ఏర్పడి, బోరాన్‌ లోపం లక్షణం ఉన్న కాయలను పోలి ఉంటాయి. మొక్క గిడసబారి, కాయలపై ఉంగరాల మచ్చలు ఏర్పడతాయి. 


బూడిద తెగులు : ఆకులు, కాడలు, కొత్త చిగుర్లు, కాయలపై తెల్లటి బూడిద లాంటి శిలీంద్రం కనిపిస్తుంది.
నివారణకు.. నీటిలో కరిగే గంధకం (సల్ఫెక్స్‌, థయోవిట్‌) లీటరు నీటికి 3 గ్రా. లేదా 1 మి.లీ. డైనోక్యాప్‌ (కేరాథేన్‌) లేదా హెక్సాకొనజోల్‌ 2 మి.లీ. చొప్పున కలిపి చెట్లపై పిచికారీ చేయాలి.
ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు : డిసెంబరు-జనవరి నెలల్లో ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడుతాయి. ఈ ఆకులు క్రమంగా పసుపు రంగులోకి మారి రాలిపోతాయి. నివారణకు.. లీటరు నీటికి మ్యాంకోజెబ్‌ 2.5 గ్రా. లేదా క్లోరొథలోనిల్‌ 2 గ్రా. చొప్పున కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. 


సూక్ష్మధాతు లోపాలు

సూక్ష్మధాతువులైన ఇనుము (ఐరన్‌) లోపంవల్ల ఆకులు తెలుపు రంగుకు మారతాయి. మెగ్నీషియం లోపంవల్ల కింది ఆకులు పండుబారతాయి. జింకులోపం వల్ల ఆకులు కిందకు వంగుతాయి. నివారణకు.. లీటరు నీటికి 3 మి.లీ. చొప్పున ఫార్ములా-4 కలిపి పిచికారీ చేయాలి. 


బోరాన్‌ లోపం : ఈ లోపం ఉన్న ఆకులు పచ్చదనం కోల్పోయి, దళసరిగా మారుతాయి. పూత రాలుతుంది. కాయలపై ఉబ్బెత్తుగా బుడిపెలు ఏర్పడతాయి. కాయల పరిమాణం తగ్గి, ఆకారాన్ని కోల్పోతాయి. నివారణకు లీటరు నీటికి 5 గ్రా. బోరాక్స్‌ కలిపి మొక్కలు, పూత, కాయలు తడిచేలా పిచికారీ చేయాలి. 


నివారణ చర్యలు
* వైరస్‌ తెగుళ్లను రసంపీల్చే పురుగులైన తెల్లదోమ, పేనుబంకలు వ్యాప్తి చేస్తాయి.
* అంతర్వాహిక కీటక నాశనులను ఉపయోగించి ఈ తెగుళ్ల వ్యాప్తిని అరికట్టవచ్చు.
* ఆరోగ్యవంతంగా ఉన్న మొక్కలు కొంతవరకు ఈ తెగుళ్లను తట్టుకుంటాయి. ఇందుకోసం మొక్కలకు సూక్ష్మ, స్థూల పోషకాలను అందించాలి.
* తెగులు సోకిన తోటల నుంచి విత్తనాన్ని సేకరించకూడదు.
* ముందుజాగ్రత్త చర్యగా తప్పనిసరిగా విత్తనశుద్ధి చేయాలి.
* ప్రతి మొక్కకు 200 గ్రా. చొప్పున నత్రజని, భాస్వరం, పొటాష్‌లను 50 గ్రా. చొప్పున నాలుగు సార్లు అందించాలి.
* అంతర పంటగా మినుము, టమాట సాగు చేయకూడదు.
* నత్రజనిని మోతాదుకు మించి వాడకూడదు.
* తోటలో నీరు నిల్వ ఉండకూడదు.
* తెగులు సోకిన మొక్కలను గమనించిన వెంటనే పీకి కాల్చివేయాలి.
* తోట చుట్టూ అవిశ మొక్కలను పెంచాలి.
* అంతర్వాహిక పురుగు మందులను 15 రోజులకోసారి మొక్కల సుడిభాగం కూడా తడిసేలా పిచికారీ చేయాలి.
* తెగులు సోకిన తొలిదశలోనే లక్షణాలను గుర్తించి వ్యాప్తిని అరికడితే.. నష్టశాతం కొంతమేర తగ్గుతుంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.