close
ఎకరాలో 19 పంటలు!

ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్న రైతు
మూడు నెలల్లో రూ. 1.40 లక్షల ఆదాయం

ఏకపంట సాగు లాభదాయకం కాదని అనుభవపూర్వకంగా తెలుసుకున్న యువరైతు రూపని లింగస్వామి మిశ్రమపంటల పద్ధతిని ఆచరిస్తూ మేలైన ఫలితాలు సాధిస్తున్నాడు. నల్గొండ జిల్లా, చిట్యాల మండలం పేరేపల్లిలో ఎకరా విస్తీర్ణంలో 19 రకాల పంటలు పండిస్తూ లాభాలు పొందుతున్నాడు. గతంలో రెండెకరాల్లో పత్తి సాగుచేసి గిట్టుబాటుకాక ఇబ్బందులకు గురయ్యాడు. అనంతరం ఏకపంటగా కాకర, బీరలను పండించాడు. తీరా దిగుబడులను మార్కెట్‌కు చేర్చే సమయంలో సరైన ధర లేక ఆశించిన స్థాయిలో ఆదాయం రాక నిరుత్సాహం చెందాడు. లాభదాయక వ్యవసాయ పద్ధతులను అన్వేషిస్తూ... వ్యవసాయ సదస్సులు, ప్రదర్శనలకు హాజరవుతూ మేలైన సాగు పద్ధతులపై అవగాహన పెంచుకున్నాడు.

- పాటి మోహన్‌రెడ్డి (న్యూస్‌టుడే, చిట్యాల)
 

 

లింగస్వామి ఈ ఏడాది సెప్టెంబరులో మిశ్రమ పంటల సాగును ప్రారంభించాడు. ఒక ఎకరాలోనే బీర, కాకర (తెలుపు, ఆకుపచ్చ) టమాట, సొర, పొట్లకాయ, బీన్స్‌, దొండ, వంగ (పొడవు రకం, గుత్తి రకం) దోస, పచ్చిమిర్చి, బెండ (సాధారణ రకం, ఎరుపు రకం), పాలకూర, కొత్తిమీర, పుచ్చ, బంతి పంటలను విత్తాడు. నల్గొండలోని శ్రీసేద్య రైతుసేవా సంస్థ నిర్వాహకులు రూపని రమేశ్‌ సూచనలతో ఒకే పొలంలో వివిధ రకాల కూరగాయలను పండిస్తున్నాడు. రసాయన మందులను కేవలం పది శాతమే ఉపయోగిస్తున్నాడు. సమగ్ర  సస్యరక్షణ పద్ధతులను పాటిస్తూ.. ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నాడు.

సమగ్ర సస్యరక్షణ పద్ధతులతో..
* వంగలో కాయతొలుచు, కాండం తొలుచు పురుగు, టమాటలో లీఫ్‌మైనర్‌ (పాముపొడ తెగులు) నివారణకు నీటి ఎరలు (వాటర్‌ ట్రాప్స్‌) వినియోగించాడు. మొక్కల మధ్య అక్కడక్కడ ఒక పీవీసీ పైపు పెట్టి దానిపై ఒక పాత్రను ఏర్పాటుచేసి అందులో నీరు పోస్తారు. పురుగు నివారణ కోసం పాత్ర మధ్యలో చిన్న బాక్సులో ‘ల్యూకోనిడస్‌’ అనే మాత్రను ఎరగా పెడతారు. టమాటలో చీడల నివారణకు ‘టుటా అబ్సోల్యూటా’ అనే మాత్రను ఎరగా పాత్ర మధ్యలో పెడతారు. ఈ ఎర మాత్రలకు ఆకర్షితమైన తల్లి రెక్కల పురుగులు నీటిలోపడి చనిపోతాయి.
* పంటలను ఆశించి రసంపీల్చి నష్టం కలిగించే పచ్చదోమ, తెల్లదోమ, నల్లి తదితరాల నివారణకు జిగురు పూసిన పసుపు, నీలం అట్ట ముక్కలను వెదురు బద్దలకు కట్టి మొక్కల మధ్య ఉంచి మేలైన ఫలితాలను రైతు సాధిస్తున్నాడు.


* పచ్చపురుగు, లద్దెపురుగుల నివారణకు.. చేలో లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేశారు. బీర, కాకరలో పండు ఈగల నివారణకు ‘ప్రూట్‌ఫ్లై ట్రాప్స్‌’ వాడుతున్నారు. సాయంత్రం పూట పంటను ఆశించే శత్రుపురుగుల నివారణ కోసం ‘లైట్‌ట్రాప్స్‌’తో పాటు పంటల చుట్టూ మంటలు వేస్తారు. వెలుతురుకు ఆకర్షితమైన పురుగులు మంటలో పడి చనిపోతాయి.

పంటలకు డ్రిప్‌, మల్చింగ్‌..
* అడుగు ఎత్తు, 3 అడుగుల వెడల్పుతో బోదెలు చేసి, దానిపై 4 అడుగుల వెడల్పుతో మల్చింగ్‌ షీట్‌ను పరిచాడు. దీని వాడకంతో కలుపు అదుపుతో పాటు మొక్కకు అందించే నీరు, ఎరువులు వృథా కాకుండా నివారిస్తున్నాడు.
* బిందు పద్ధతి ద్వారా నీరు నేరుగా మొక్కల వేర్ల భాగానికి అందుతోంది. ఎకరాలో వరి సాగుకు వాడేనీటితో 4 ఎకరాల్లో కూరగాయలను సాగు చేయవచ్చని రైతు తెలిపాడు.
* కాకర, బీర, సొర, దోస, టమాట, దొండ, పొట్లకాయ మొక్కలను పందిరి పద్ధతిలో, పాలకూర, కొత్తిమీరను మల్చింగ్‌ పద్ధతిలో సాగుచేసి మేలైన దిగుబడులు సాధిస్తున్నాడు.
ఉత్పత్తుల విక్రయం : దిగుబడులను చిట్యాల పరిసరాల్లోనే విక్రయిస్తున్నాడు. పెద్ద హోటళ్ల నిర్వాహకులు పొలం వద్దకే వచ్చి నేరుగా కొనుగోలు చేస్తున్నారు. మిగిలిన ఉత్పత్తులను గ్రామంలోనే విక్రయిస్తున్నాడు.


కుటుంబం అండగా..
రూపని లింగస్వామి, రైతు (చరవాణి నెం : 96768 48482)

అమ్మ, నాన్నతోపాటు నా భార్య సాగులో సాయం చేస్తున్నారు. పండిన పంటను దళారులకు కాకుండా డిమాండ్‌ ఆధారంగా విక్రయిస్తున్నాం. ఒక రకం పంటకు ధర తగ్గినా, మరో రకం పంటలో కలిసి వస్తోంది. 19 రకాల పంటలకు పెట్టుబడి రూ. 85 వేలు మాత్రమే. ఇప్పటి వరకు రూ.లక్షా 40 వేలు ఆదాయం వచ్చింది. మరో రూ.2 లక్షల వరకు ఆదాయం వస్తుందని ఆశిస్తున్నా. ఉద్యానాధికారులు సూచనలు, సలహాలు ఇచ్చి ప్రోత్సహించారు.


చిన్న రైతులకు అనుకూలం
రావుల విద్యాసాగర్‌, నకిరేకల్‌ క్లస్టర్‌ ఉద్యాన, పట్టు అధికారి, నల్గొండ జిల్లా

ఒకటి, రెండు ఎకరాల పొలం ఉన్న రైతులకు ఈ సాగు పద్ధతి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులూ పొలం పనులను చూసుకునే వెసులుబాటు ఉన్న రైతులు ఈ విధానంలో పలు రకాల పంటలను సాగుచేసి శ్రమకు తగ్గ ఫలితం పొందవచ్చు. వాట్సాప్‌ ద్వారా రైతు పంపే చీడపీడల ఫోటోల ను పరిశీలించి, అవసరమైన నివారణ చర్యలను ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నా.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.