close
అరటిలో తెగుళ్ల నివారణ

పనామా తెగులు

ముదురాకులు పండి తొడిమల వద్ద వాలిపోయి చెట్టుకు వేలాడతాయి. అరటి బొందలు(కాండం) నేలబారున పగుళ్లు కనపడతాయి. ఈ బొందలను అడ్డంగా నరికి చూస్తే కాండం మధ్యలో గోధుమ రంగులోకి మారి ఉంటుంది. ఇది మొక్క, పిలకల దశలోను రావచ్చు. నివారణకు.. తెగులు సోకని పిలకలను సాగుకు ఎంపిక చేయాలి. నీటి పారుదల సౌకర్యం లేని బరువు నేలల్లో అరటిని సాగు చేయకూడదు. కర్పూర, భూషావళి రకాలు ఈ తెగులును తట్టుకుంటాయి. జీవశిలీంద్ర నాశని ట్రైకోడెర్మా విరిడేను పశువుల ఎరువులో కలిపి మొక్కల మొదళ్ల వద్ద చేయాలి. ఆకుమచ్చ తెగులు నివారణకు సూచించిన మందులనే ఈ తెగులు నివారణకు పిచికారి చేయాలి. 


ఆకుమచ్చ తెగులు

ఈ తెగులు ఏ దశలోనైనా ఆశించే ప్రమాదం ఉంటుంది. ఇది ప్రధానంగా సిగటోక, కొర్డన, సేప్టోరియా ఆకుమచ్చ తెగుళ్లుగా వ్యాప్తి చెందుతుంది. దీంతో ఆకులపై నల్లని మచ్చలు ఏర్పడి, వాటి చుట్టూ కణజాలం పసుపు రంగులోకి మారుతుంది. క్రమంగా ఇది ఆకు మొత్తానికి వ్యాపించి ఆకు ఎండిపోతుంది. నివారణకు.. తెగులు సోకి ఎండిన ఆకులను తొలగించి కాల్చేయాలి. తోటలో నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలి. పిలకలు ఎక్కువగా ఉంటే తొలగించాలి. లీటరు నీటికి ప్రోపికొనజోల్‌ 1 మి.లీ. లేదా క్లోరోథాలోనిల్‌ 2 మి.లీ. చొప్పున కలిపి చెట్లపై పిచికారీ చేయాలి. 


ఆపిల్‌ తెగులు

ఈ తెగులు సోకిన మొక్క కాండం, పువ్వులపై గులాబీరంగు చారలు ఏర్పడతాయి. పువ్వు రేకులపై నూలుకండె ఆకారంలో చిన్న మచ్చలు ఏర్పడతాయి. ఈ తెగులును వ్యాప్తిచేసే పేనుబంక నివారణకు చర్యలు చేపట్టాలి.


వెర్రి లేదా గొడ్డు తెగులు

ఈ తెగులు సోకిన ఆకులు చిన్నవిగా మారి, దగ్గరగా కుచ్చులుగా అవుతాయి. ఆకులపై ఎగుడు, దిగుడు పద్ధతిలో చారలు కనిపిస్తాయి. ఈ తెగులు పేనుబంక ద్వారా వ్యాపిస్తుంది. నివారణకు.. పంటను నాటేటప్పుడే ఆరోగ్యవంతమైన పిలకలను తోట నుంచి సేకరించాలి. ఈ తెగులు సోకిన మొక్కలను, పిలకలను గుర్తించి దుంపలతో సహా తొలగించి కాల్చివేయాలి. తోటలో కలుపు లేకుండా చర్యలు చేపట్టాలి. పేనుబంక, పిండి పురుగుల ద్వారా వైరస్‌ వ్యాప్తి జరగకుండా ఉండేందుకు.. పది లీటర్ల నీటికి డైమిథోయేట్‌ 7 మి.లీ. చొప్పున కలిపి చెట్లపై పిచికారీ చేయాలి.


రాష్ట్రంలో ఈ ఏడాది 2.82 లక్షల ఎకరాల్లో అరటిని పండిస్తున్నారు. అరటిలో ప్రధానంగా కర్పూర, తెల్ల చక్కరకేళి, ఎర్ర చక్కరకేళి, బొంత, పచ్చ అరటి, భుషావళి రకాలను సాగు చేస్తారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు అరటిలో తెగుళ్ల వ్యాప్తికి అనుకూలంగా ఉన్నాయి.  మొక్కలను ఆశించే వైరస్‌ను మందులతో నివారించలేం. వైరస్‌ను వ్యాప్తిచేసే పురుగులను అదుపు చేయడం ద్వారా మాత్రమే ఈ తెగుళ్లను అరికట్టవచ్చని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఉద్యానశాఖాధికారి పి.బి.ఎస్‌. అమర్‌నాథ్‌ (చరవాణి : 79950 86848) తెలిపారు. రైతులు పాటించాల్సిన సస్యరక్షణ చర్యలను సూచించారు.

న్యూస్‌టుడే, రావులపాలెం (పట్టణం)

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.