close
చెరకులో అంతర పంటలతో అదనపు లాభాలు!

ప్రస్తుతం రైతులు చెరకు నాట్లను  ప్రారంభించారు. ఇది దీర్ఘకాలిక  పంట కావడంతో నాటిన తొలి మూడు నెలల వరకు మొక్కలు చిన్నవిగానే ఉంటాయి. ఈ దశలో అంతర పంటలను సాగుచేస్తే ఆదాయంతో పాటు భూసారం పెరుగుతుందని విశాఖ జిల్లా అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం చెరకు ప్రధాన  శాస్త్రవేత్త డాక్టర్‌  ఎం. భరతలక్ష్మి  తెలిపారు.

న్యూస్‌టుడే, అనకాపల్లి

చెరకులో అంతర పంటలుగా విత్తేందుకు.. పెసర, మినుము, సోయాచిక్కుడు, వేరుశనగ, బెండ, ఉల్లి, బంగాళదుంప, గోరుచిక్కుడు, క్యాబేజి, ఆకుకూరలు అనుకూలం. ఈ పంటలు 75 నుంచి 90 రోజుల్లో కోతకు వస్తాయి. చెరకులో స్వల్పకాలిక రకాలు సైతం పది నెలల తర్వాతే పక్వానికి వస్తాయి. నాటిన 25 నుంచి 35 రోజుల్లో ముచ్చెల నుంచి మొలకలు వస్తాయి. పిలకలు రావటానికి మూడు నెలల పడుతుంది. ఈ దశ తర్వాతే తోటల్లో జడచుట్టడం, నీరు పెట్టడం వంటి పనులు ఉంటాయి. అంతవరకు పెడలపై తగినంత గాలి, సూర్యరశ్మి పుష్కలంగా లభిస్తాయి. అందువల్ల మూడు నెలల వరకు అంతర పంటలను సాగు చేసుకోవచ్చు. వీటి సాగువల్ల చెరకుకు నీటితడుల ఆదా అవుతాయి. కలుపు సమస్యతోపాటు పీకపురుగు ఉద్ధృతి కూడా తగ్గుతుంది. అంతర పంటల ద్వారా ఎకరానికి రూ.8-12 వేల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ఇది చెరకు సాగుకు పెట్టుబడిగా ఉపయోగపడుతుంది. అంతర పంటలుగా జీలుగ, జనుము పంటలను కూడా సాగు చేయవచ్చు. ఈ విత్తనాలను పెడలమీద చల్లి మొగ్గదశలో ఈ పంటలను తీసి, చెరకు మొదళ్లలో వేస్తే.. ఇవి క్రమంగా మట్టిలో కలిసిపోయి, సేంద్రియ పదార్థంగా మారి భూసారం పెంపునకు దోహదం చేస్తాయి.

మినుము, పెసరల సాగు మేలు
చెరకు పండించే తేలిక నేలల్లో పెసరను, సారవంతమైన భూముల్లో మినుమును విత్తడం మంచిది. అంతర పంటల ద్వారా ఎకరాకు మినుము లేదా పెసరల నుంచి సుమారు మూడు, నాలుగు క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అంతర పంటలుగా వీటి సాగుతో చెరకు దిగుబడి, రసనాణ్యతలో ఎలాంటి వ్యతిరేక ప్రభావం ఉండదు. రైతుకు అదనపు ఆదాయంతో పాటు భూసారం పెరుగుతుంది.

నేల తయారీ
తేమ నిల్వ ఉండి, మురుగు నీరు పోయే నేలలు ఈ పంటల సాగుకు అనుకూలం. నేలను 20 సెం.మీ. లోతు మేరకు బాగా దుక్కిచేయాలి. ఇలా చేస్తే అంతర పంటల్లో మొలకశాతం పెరుగుతుంది. పెడలను చదును చేయాలి. నీటి పారుదలకు అనువుగా అడ్డు సాళ్లు చేయాలి.

ఎరువుల వాడకం
చెరకు సాగు చేసే ప్రాంతాన్ని బట్టి ఎరువులు వేసుకోవాలి. చెరకుకు నత్రజనిని యూరియా రూపంలో మొక్కల దగ్గర ఐదు సెం.మీ. లోతులో చిన్న గోతి తీసి, అందులో ఎరువు వేసి మట్టితో కప్పాలి. నత్రజనితో పాటు భాస్వరం, పొటాష్‌ వేస్తే అధిక దిగుబడి, రసనాణ్యత పెరుగుతుంది. అంతర పంటగా పెసర, మినుము సాగు చేస్తే ఎకరాకు 6 కిలోలు నత్రజని, 16 కిలోలు భాస్వరం, 12 కిలోలు పొటాష్‌ పోషకాలను అందించే ఎరువులను విత్తేముందు పెడలపై వేసి నేలలో కలిసేలా చేయాలి.


విత్తే విధానం
డిసెంబరు నుంచి ఫిబ్రవరి రెండోవారం వరకు నాటే చెరకు తోటల్లో సోయాచిక్కుడు, జనవరి నుంచి మార్చి వరకు నాటే తోటల్లో మినుము, పెసరలను విత్తుకోవచ్చు. ఆకుకూరలను, కూరగాయలను చెరకులో అంతర పంటలుగా ఎప్పుడైనా విత్తుకోవచ్చు. సాళ్లలో చెరకు ముచ్చెలు నాటేముందు అంతర పంటను పెడలపై రెండు వరుసల్లో నాటాలి. పెసర, మినుము పంటలను వరుసల మధ్య 30 సెం.మీ, మొక్కల మధ్య 10 సెం.మీ. ఉండే విధంగా విత్తుకోవాలి. సోయాచిక్కుడు అయితే వరుసల మధ్య దూరం 20 సెం.మీ, మొక్కల మధ్య 5 సెం.మీ. ఎడం  ఉండేలా చూసుకోవాలి. మినుము, పెసరలను ఎకరాకు ఆరు కిలోలు, సోయాచిక్కుడు 20 కిలోలు విత్తనం సరిపోతుంది. అంతర పంటలను పెడలపై పొడిగా విత్తుకోవాలి. తర్వాత కాలువల్లో నీరు పెట్టి ముచ్చెలు నాటాలి. ఈ సమయంలో పెడలు పూర్తిగా నానేలా చూడాలి లేదా చెరకు నాటిన రెండు, మూడు రోజుల తరువాత పెడలపై తగినంత తేమ ఉన్నప్పుడు అంతర పంటలను విత్తుకోవచ్చు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.