close
తెల్లబోతున్న కొబ్బరి తోటలు!

తోటలను నష్టపరుస్తున్న తెల్లదోమలు
పురుగు మందుల వాడకం తగ్గించాలి
జీవ నియంత్రణ పద్ధతులే మేలు
న్యూస్‌టుడే, అంబాజీపేట

కొబ్బరి తోటలను సర్పిలాకార తెల్లదోమలు ఆశించి నష్టం కలిగిస్తున్నాయి. సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించటం ద్వారానే వీటిని అరికట్టవచ్చని అంబాజీపేట ఉద్యాన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ ఎన్‌బీవీ చలపతిరావు తెలిపారు. తీర ప్రాంతాల్లోని అనుకూలమైన వాతావరణం, పెద్ద సంఖ్యలో చెట్ల లభ్యత వంటి పరిస్థితులు తెల్లదోమలు విస్తృతంగా వ్యాప్తి చెందేందుకు దోహదం చేస్తున్నాయి.

తెల్లదోమలు ఆశించే పంటలు
కొబ్బరి, అరటి, మామిడి, సపోటా, జామ, జీడిమామిడి, మొక్కజొన్న, సీతాఫలం, ఆయిల్‌పాం, బాదం, పోక చెట్లు, పనస వంటి 30 రకాల పంటలను తెల్లదోమ ఆశిస్తుంది. ముఖ్యంగా కొబ్బరి, ఆయిల్‌పాం, అరటిని ఈ దోమ ఎక్కువగా ఆశిస్తుంది. వీటి పిల్ల, తల్లి పురుగులు ఆకుల కింద భాగంలో చేరి రసాన్ని పీలుస్తాయి. తల్లి పురుగులు తేనెలాంటి జిగురు పదార్థాన్ని ఆకులపై విసర్జించడం వల్ల కాప్నొడియం బూజు తెగులు నల్లని మసిలా ఏర్పడుతుంది. ఇది అంతరపంటల మీద కూడా వృద్ధి చెందుతుంది. ఆకులపై ఏర్పడిన మసి వల్ల కిరణజన్య సంయోగక్రియకు ఆటంకం కలుగుతుంది. దీంతో కాయల ఎదుగుదల తగ్గి, దిగుబడి క్షీణిస్తుంది.

పురుగు మందుల వైఫల్యం
ఈ దోమల అదుపునకు మందుల పిచికారీతో తాత్కాలిక ప్రయోజనాలు మాత్రమే లభిస్తాయి. పురుగు మందుల వాడకం వల్ల తెల్లదోమల నివారణ పూర్తి స్థాయిలో సాధ్యపడకపోగా, పంటలకు మేలుచేసే మిత్ర పురుగులు నశిస్తాయి. ఈ సమస్య పరిష్కారానికి.. తెల్లదోమలను భక్షించే పరాన్నజీవులను ఉపయోగించాలి. ఈ చర్య పర్యావరణానికి కూడా మేలు చేస్తుంది. 


అరికట్టే చర్యలు

* విభిన్న జాతులకు చెందిన మొక్కలు, చెట్లపై సర్పిలాకార తెల్లదోమ, వాటి భక్షక పరాన్నజీవుల ఉనికిని గమనిస్తుండాలి.
* తెల్లదోమ సోకిన కొబ్బరి, ఇతర అలంకార మొక్కలను వేరే ప్రాంతాలకు తరలించకూడదు.
* డైకోక్రైసా ఆస్టర్‌ పరాన్నజీవులకు చెందిన గుడ్లను హెక్టారుకు వెయ్యి చొప్పున నెలకు రెండుసార్లు తోటలో వదలాలి. ఈ గుడ్లు కార్డు రూపంలో కొబ్బరి పరిశోధన స్థానంలోని ప్రయోగశాలల్లో లభిస్తాయి. వెయ్యి గుడ్లుండే ఒక్కో కార్డు ధర రూ.150 ఉంటుంది.
* మిత్రపురుగైన ‘ఎన్‌కార్సియా గ్వడెలోపే’ బదనికలు కూడా తెల్లదోమను అదుపులో ఉంచుతాయి. ఈ మిత్ర పురుగులను ముదురు తోటల నుంచి సేకరించి, తెల్లదోమ ఆశించిన తోటల్లో వదలాలి. ఈ బదనికలను రైతులు సొంతంగా గుర్తించలేరు. ఇవి చాలా సూక్ష్మంగా ఉంటాయి. తోటల్లో తెల్లదోమ ఉనికిని గుర్తించిన రైతులు.. సంబంధిత శాస్త్రవేత్తలను సంప్రదిస్తే.. వారు తోటలను సందర్శించి నివారణ చర్యలను సూచిస్తారు.
* తోటల్లో పురుగు మందుల వాడకాన్ని తగ్గించి, మిత్ర పురుగుల సంఖ్య పెంచాలి.
* పురుగుల తీవ్రత అధికంగా ఉండి, మిత్ర పురుగులు తగినన్ని లేనప్పుడు.. లీటరు నీటికి 10 మి.లీ. వేపనూనె (ఒక శాతం) + అర మి.లీ. సాండోవిట్‌ కలిపి ఆకుల అడుగు భాగాలు తడిచేలా 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
* నీరు సమృద్ధిగా లభించే ప్రాంతాల్లో.. తెల్లదోమ ఆశించిన మొక్కలపై లీటరు నీటికి 10 గ్రా. సర్ఫ్‌ పొడి కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసి మేలైన ఫలితాలను పొందవచ్చు.
అంబాజీపేట ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలను సంప్రదించవలసిన చరవాణి నెంబర్‌ 08856 243847.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.