close
మినుములో సమగ్ర సస్యరక్షణ

మినుములో సమగ్ర సస్యరక్షణ చర్యలను చేపట్టడం ద్వారా చీడపీడలను నిరోధించి అధిక దిగుబడులు సాధించవచ్చని బనవాసిఫారం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) సమన్వయకర్త జి.ప్రసాద్‌బాబు తెలిపారు.


తెగుళ్లు

సెర్కోస్పొరా ఆకుమచ్చ తెగులు : పంట 35-40 రోజుల దశలో ఆశిస్తుంది. దీంతో ఆకులపై గుండ్రని గోధుమరంగు మచ్చలు ఏర్పడి, పెద్దవై ఆకులు రాలుతాయి. నివారణకు లీటరు నీటికి 2.5 గ్రా. మాంకోజెబ్‌ లేదా 3 గ్రా. కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ లేదా 2 మి.లీ. హెక్సాకొనజోల్‌ లేదా ప్రొపికొనజోల్‌ 1 మి.లీ. చొప్పున కలిపి పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. ఎల్‌.బి.జి-648 రకం ఈ తెగులును తట్టుకుంటుంది. 


బూడిద తెగులు

ఇది పంట 45-50 రోజుల దశలో ఆశిస్తుంది. ఈ తెగులు నివారణకు లీటరు నీటికి 2.5 గ్రా. మాంకోజెబ్‌ + డైనోకాప్‌ 1 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం వల్ల ఈ తెగులు వ్యాప్తి చెందుతుంది. ఆకులు, కాండం, పిందెలు, కాయలపై తెల్లని పొర ఏర్పడి ఆకులు రాలిపోతాయి. నివారణకు లీటరు నీటికి  కార్బెండజిం 1 గ్రా. లేదా డైనోకాప్‌ 1 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి. 10-15 రోజుల వ్యవధిలో మరోసారి పిచికారీ చేయాలి.
* పై తెగుళ్లు రబీలో మాగాణి భూముల్లో సాగుచేసే పంటపై అధికంగా వస్తాయి. 


ఎండు తెగులు

1. భూమిలో ఉండే శిలీంద్రం మొక్కను ఆశించడం వల్ల మొక్క ఎండిపోతుంది. నివారణకు పైరుపై మందుల పిచికారీ లాభసాటి కాదు. పంట విత్తేముందు చేపట్టే ముందుజాగ్రత్త చర్యల వల్ల అధిక ఫలితం ఉంటుంది.

* బుట్ట మినుము ఎల్‌.బి.జి-402, ఎల్‌.బి.జి-611, ఎల్‌.బి.జి-22, ఎల్‌.బి.జి-648, ఎల్‌.బి.జి-685 రకాలు ఈ తెగులును తట్టుకుంటాయి.
* ఒకే భూమిలో ఎక్కువ కాలం ఒకే పంటను పండించకూడదు.
* పొలంలో నీరు నిల్వ ఉండకూడదు.
* వేసవిలో లోతు దుక్కి చేయాలి.
* విత్తే ముందు విత్తనశుద్ధి తప్పనిసరి. ఇందుకోసం.. కిలో విత్తనానికి 3 గ్రా. కార్బెండజిమ్‌ లేదా మాంకోజెబ్‌ కలిపి శుద్ధిచేసి విత్తాలి.
* ఎకరానికి 80 కిలోల చివికిన పశువుల ఎరువు + 20 కిలోల వేప పిండి, రెండు కిలోల ట్రైకోడెర్మా విరిడి జీవ శిలీంద్రాన్ని విత్తే సమయంలో పొలంలో వేసి కలియదున్నాలి.
పక్షి కన్ను తెగులు (ఆంత్రాక్నోస్‌) : ఆకులపై లేత పసుపులో గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. నివారణకు లీటరు నీటికి మాంకోజెబ్‌ 2.5 గ్రా. లేదా హెక్సాకొనజోల్‌ 2 మి.లీ. లేదా ప్రొపికొనజోల్‌ 1 మి.లీ. చొప్పున కలిపి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పైరుపై పిచికారీ చేయాలి.


పల్లాకు తెగులు (ఎల్లో మొజాయిక్‌)

ఇది వైరస్‌ తెగులు. తెల్లదోమలు దీన్ని వ్యాప్తి చేస్తాయి. ఈ తెగులు సోకిన ఆకులు, కాయలపై పసుపు మచ్చలు ఏర్పడతాయి. పంట 40-45 రోజుల్లో ఆశిస్తే కాయలు పసుపుబారి వంకరలు తిరుగుతాయి. నివారణకు.. లీటరు నీటికి ట్రైజోఫాస్‌ 1.5 మి.లీ. లేదా మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ. లేదా ఎసిఫేట్‌ 1 గ్రా. లేదా మెటాసిస్టాక్స్‌ 2 మి.లీ. లేదా ఎసిటామిప్రిడ్‌ 0.2 గ్రా. చొప్పున కలిపి పిచికారీ చేయాలి. అవసరమైతే పది రోజుల వ్యవధిలో మందులను మార్చి రెండోసారి పిచికారీ చేయాలి. తెగులు సోకిన మొక్కలను పీకి కాల్చివేయాలి. 


తుప్పు లేదా కుంకుమ తెగులు

ఇది పంట 60-65 రోజుల దశలో ఆశిస్తుంది. దీంతో పైరు పూత దశలో ఆకులపై లేత పసుపు రంగులో తుప్పు మాదిరిగా ఉండే గుండ్రని కుంకుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. నివారణకు లీటరు నీటికి 2.5 గ్రా. మాంకోజెబ్‌ + 1 మి.లీ. డైనోకాప్‌ లేదా 1 మి.లీ. ట్రైడిమార్ఫ్‌ లేదా బైలాటాన్‌ 1 గ్రా. చొప్పున కలిపి 10 రోజుల వ్యవధిలో పైరుపై రెండుసార్లు పిచికారీ చేయాలి. 


సీతాఫలం తెగులు

ఇది పేనుబంక ద్వారా వ్యాప్తి చెంది, ఆకులు ముడతలుగా ఏర్పడి మందంగా పెద్దగా పెరుగుతాయి. నివారణకు లీటరు నీటికి 2 మి.లీ. డైమిథోయేట్‌ లేదా 1.6 మి.లీ. మోనోక్రోటోఫాస్‌ లేదా ఎసిటామిప్రిడ్‌ 0.2 గ్రా. చొప్పున కలిపి పిచికారీ చేయాలి. 


పురుగులు

కాండం ఈగ : ఇది మొక్క కాండంపై పెట్టిన గుడ్ల నుంచి వెలువడిన లార్వా పురుగులు కాండంలోకి చేరి తినడం వల్ల మొక్క ఎండిపోతుంది. తొలకరిలో పైరుపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నివారణకు లీటరు నీటికి మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ. లేదా ఎసిఫేట్‌ 1 గ్రా. లేదా డైమిథోయేట్‌ 2 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.

మారుకా మచ్చల పురుగు : పైరు పూత, పిందె దశలో ఇది ఆశిస్తుంది. పూతను గూడుగా చేసి కాయల్లోని గింజలను తింటుంది. నివారణకు లీటరు నీటికి వేప గింజల కషాయం 50 మి.లీ. లేదా వేపనూనె 5 మి.లీ. + ఒక మి.లీ. సాండోవిట్‌ చొప్పున కలిపి పిచికారీ చేసి రెక్కల పురుగును గుడ్లు పెట్టకుండా నిరోధించవచ్చు.

* మొగ్గ, పూతల్లో పిల్ల పురుగులు ఉంటే.. నివారణకు లీటరు నీటికి క్లోరిపైరిఫాస్‌ 2.5 మి.లీ. లేదా థయోడికార్బ్‌ 1 గ్రా. లేదా ఎసిఫేట్‌ 1 గ్రా. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
* పంటలో గూళ్లు ఉంటే, నివారణకు.. లీటరు నీటికి ఎసిఫేట్‌ 1 గ్రా. లేదా క్వినాల్‌ఫాస్‌ 2 మి.లీ. లేదా క్లోరిఫైరిఫాస్‌ 2.5 మి.లీ. లేదా నొవాల్యురాన్‌ 1 మి.లీ., వీటిలో ఏదైనా ఒక మందుకు ఊదర స్వభావం ఉండే డైక్లోరోవాస్‌ వంటి మందును ఒక మి.లీ. కలిపి పిచికారీ చేయాలి. అవసరమైతే మందులను మార్చి పూత, కాయ దశలో 2-3 సార్లు పిచికారీ చేయాలి.
* పురుగు ఉధృతంగా ఉంటే.. నివారణకు 10 లీటర్ల నీటికి 3 మి.లీ. స్పైనోశాడ్‌ లేదా ఎమామెక్టిన్‌ బెంజోయేట్‌ 4 గ్రా. లేదా రైనాక్సిపిర్‌ 3 మి.లీ. లేదా ప్లుబెండమైడ్‌ 2 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.