close
చీని, నిమ్మలో సూక్ష్మ పోషక లోపాలు

తీయ నారింజ (చీని) పండ్ల తోటల నుంచి రైతులకు ఆశించిన స్థాయిలో దిగుబడులు రావడం లేదు. ఎకరాకు సగటున ఆరు టన్నుల దిగుబడి మాత్రమే వస్తోంది. దీనికి ప్రధాన కారణం.. ఎరువుల వినియోగంలో రైతులకు సరైన అవగాహన లేకపోవడమే. తోటలకు అవసరమైన స్థూల, సూక్ష్మ ఎరువుల యాజమాన్యంలో రైతులు సమతుల్యత పాటించకపోవడం వల్ల దిగుబడులు తగ్గుతున్నాయి. సకాలంలో సరైన మోతాదులో సూక్ష్మ పోషకాలను అందిస్తే మంచి దిగుబడులు వస్తాయని ఉద్యానశాఖ విశ్రాంత సంయుక్త సంచాలకులు వేంపల్లి   లక్ష్మిరెడ్డి  తెలిపారు.

న్యూస్‌టుడే, ఒంటిమిట్ట


సవరణకు చేపట్టాల్సిన చర్యలు

ఈ పోషకాలు చెట్లకు తక్కువ మోతాదులోనే అవసరమవుతాయి. నత్రజని, భాస్వరం, పొటాష్‌ వంటి స్థూల పోషకాలను పూర్తిస్థాయిలో అందించినప్పటికీ.. మొక్కల్లో సూక్ష్మ పోషకాల లోపం ఉంటే, చెట్ల ఎదుగుదల, కాయల నాణ్యత, దిగుబడి తగ్గుతుంది. సూక్ష్మ పోషకాల లోపం వల్ల ఆకులు, కొమ్మలు గిడసబారి, చివర్లు ఎండుతాయి. సూక్ష్మ పోషకాలతో పాటు మెగ్నీషియం, యూరియా కలిపి చెట్లపై పిచికారి చేస్తే అధిక దిగుబడులతో పాటు కాయల సైజు, రస నాణ్యత పెరుగుతుంది.
జింకు : చీని, నిమ్మ తోటల్లో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. దీన్ని పల్లాకు తెగులు అంటారు. ఈ లోపం ఉన్న ఆకుల్లో ఈనెల మధ్యభాగం పసుపు రంగులోకి మారి రాలిపోతాయి. ఆకులపై అక్కడక్కడ ఆకుపచ్చ మచ్చలు ఏర్పడతాయి. కణుపుల మధ్య దూరం తగ్గి కుచ్చులా మారుతాయి. పూత, పిందె తగ్గుతుంది. పిందెలు రాలడంతో పాటు కాయలు పక్వానికి రాకముందే రాలుతాయి. రస నాణ్యత తగ్గుతుంది. కాయల దిగుబడితో పాటు నాణ్యత తగ్గిపోతుంది. సవరణకు.. లీటరు నీటికి 5 గ్రా. జింకు సల్ఫేట్‌ పిచికారి చేయాలి.

ఇనుము : భూమిలో సున్నం అధికంగా ఉన్న నేలల్లో ఈ లోపం కనిపిస్తుంది. దీంతో లేతాకులు లేత ఆకుపచ్చ లేదా పసుపు రంగుకు మారుతాయి. ఈనెలు ఆకుపచ్చ రంగులో ఉండి, ఆకంతా అల్లినట్లుంటాయి. ఈ లోపం ఎక్కువైతే ఆకులు తెల్లబడతాయి.
చెట్ల పెరుగుదల, కాపు తగ్గుతుంది. కాయలు చిన్నవిగా, గట్టిగా, తెల్లగా మారి నాణ్యత దెబ్బతింటుంది. సవరణకు.. లీటరు నీటికి 2 గ్రా. ఫెర్రస్‌ సల్ఫేట్‌ + 1 గ్రా. నిమ్మ ఉప్పు కలిపి పిచికారీ చేయాలి. నిమ్మ ఉప్పు బదులు 15 లీటర్ల మందు ద్రావణానికి ఒక నిమ్మకాయ రసాన్ని కూడా వాడవచ్చు.
మెగ్నీషియం : ఇది సూక్ష్మపోషకం కానప్పటికీ, మొక్కలు భాస్వరాన్ని గ్రహించడానికి, నియంత్రించడానికి ఇది అవసరం. చెట్లలో నత్రజని, పొటాషియం ఎక్కువైతే మెగ్నీషియం లోపిస్తుంది. ఈ లోపమున్న ఆకుల ఈనెలు పచ్చదనం కోల్పోతాయి. లోపం ఎక్కువైతే మధ్య ఈనె తప్ప మిగిలిన ఆకంతా కంచు రంగులోకి మారుతుంది. వేర్ల వృద్ధి మందగిస్తుంది. దిగుబడి, కాయల నాణ్యత తగ్గుతుంది. సవరణకు.. లీటరు నీటికి 2 గ్రా. మెగ్నీషియం సల్ఫేట్‌ పిచికారీ చేయాలి.

బోరాన్‌ : ఈ లోపం లేతాకులు, పెరిగే కాయల్లో ఎక్కువగా కనపడుతుంది. దీంతో ఆకులు మందంగా మారుతాయి. పచ్చదనం కోల్పోయి గోధుమ లేదా బూడిద రంగులోకి మారి జీవం లేకుండా ఉంటాయి. వంకర తిరుగుతాయి. పూత తగ్గుతుంది. పిందెలు, కాయలు ఎక్కువగా రాలుతాయి. కాయలు గట్టిపడి, తోలు మందంగా ఉంటుంది. కాయల్లో రసం తగ్గి, రుచి చప్పగా ఉంటుంది. కాయలకు పగుళ్లు వస్తాయి. సవరణకు.. లీటరు నీటికి 2 గ్రా. బోరాక్స్‌ పిచికారీ చేయాలి.

రాగి : ఈ పోషకం చెట్లు ఆహారం తయారు చేసుకోవడంలో కీలకమైనది. ఇది లోపిస్తే.. కొమ్మల పెరుగుదల తగ్గి, చివర్లు ఎండిపోతాయి. చివరి మొగ్గలు ఎక్కువగా రాలుతాయి. బెరడులో చీలికలు ఏర్పడుతాయి. కొమ్మలు చివర్ల నుంచి కిందికి ఎండుతాయి. చెట్ల కాండం ఉబ్బుతుంది. పసుపు రంగు మచ్చలు ఏర్పడి బంక కారుతుంది. సవరణకు.. 10 లీటర్ల నీటికి 25 గ్రా. కాపర్‌ సల్ఫేట్‌ చొప్పున కలిపి చెట్లపై పిచికారీ చేయాలి. 

మాంగనీసు : ఈ లోపం ప్రధానంగా లేతాకులు ఎదిగే దశలో కనిపిస్తుంది. దీంతో ఆకుల ఈనెల మధ్య భాగం పచ్చదనం కోల్పోతుంది. కానీ ఆకుల పరిమాణం తగ్గదు. ముదిరిన ఆకుల్లో ఈ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. మధ్య ఈనెల వెంబడి వెడల్పాటి పసుపుపచ్చ మచ్చలు ఏర్పడతాయి. మాంగనీసు, జింకు రెండూ లోపిస్తే.. ఎండు పుల్ల పడుతుంది. కాయల నాణ్యత తగ్గుతుంది. సవరణకు.. లీటరు నీటికి 2 గ్రా. మాంగనీసు సల్ఫేట్‌ పిచికారీ చేయాలి.


సూక్ష్మ పోషకాల మిశ్రమ వాడకం

పండ్ల తోటల్లో ఒకటి కంటే ఎక్కువ పోషక లోపాలున్నప్పుడు వాటిని గుర్తించడం కష్టం. ఈ సందర్భాల్లో.. సూక్ష్మ పోషకాల మిశ్రమం ఫార్ములా-4ను లీటరు నీటికి 5గ్రా. + 2 గ్రా. మెగ్నీషియం సల్ఫేట్‌ + అర మి.లీ. జిగురు కలిపి ఏటా నాలుగు సార్లు చెట్లపై పిచికారీ చేయాలి. ఫార్ములా-4లో మెగ్నీషియం ఉండదు కనుక లీటరు నీటికి 2 గ్రా. మెగ్నీషియం సల్ఫేట్‌ను విడిగా కలిపి పిచికారీ చేయాలి.

గమనిక : సూక్ష్మ పోషకాలను పిచికారి చేసేటప్పుడు.. ఆయా పోషకాలతోపాటు విధిగా లీటరు నీటికి 10 గ్రా. యూరియా + అర మి.లీ. జిగురు (అప్సా/శాండోవిట్‌/ధనువిట్‌) చొప్పున కలపాలి. ఈ ద్రావణాలను ఏటా నాలుగు సార్లు చెట్లపై పిచికారీ చేయాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.