close
పొలాల్లో పాములు రైతన్నా.. జాగ్రత్త!

న్యూస్‌టుడే, బొండపల్లి (విజయనగరం జిల్లా)

ఏపుగా పెరిగిన పంటల్లో పాములు చేరే అవకాశం ఉంటుంది. రైతులు పొలాల్లోకి వెళ్లేముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అప్రమత్తంగా ఉండటం ద్వారా ప్రమాదాల బారినుంచి బయటపడవచ్చు. పాముకాటు బారినపడిన రైతులను కాపాడేందుకు ఆచరించాల్సిన సంప్రదాయ పద్ధతులు, అందించాల్సిన చికిత్సల వివరాలు..
విషసర్పం కాటు లక్షణాలు
* కట్లపాము, తాచుపాము, రాచనాగు, రాటిల్‌పాము, సముద్ర సర్పం, రక్తపింజర వంటివి పాముల్లో అతి ప్రమాదకరమైనవి.  
* విషమున్న పాములు కాటేస్తే శరీరంపై రెండు గాట్లు స్పష్టంగా కనిపిస్తాయి. నొప్పి తీవ్రంగా ఉంటుంది. కాటు వేసిన ప్రాంతం నుంచి నొప్పి నెమ్మదిగా పైకి వ్యాపిస్తూ తిమ్మిరిగా అనిపిస్తుంది.  
* రెండుకన్నా ఎక్కువ గాట్లుంటే, అది సాధారణ పాముగా గుర్తించాలి.
* పాముల్లో రకాలున్నట్టే.. వాటి విష ప్రభావం లక్షణాలు బాధితుల్లో వేరుగా ఉంటాయి. తాచుపాము కన్నా నల్లతాచు విష ప్రభావం వెంటనే ఉంటుంది. కట్లపాము, రక్తపింజర విష ప్రభావం, లక్షణాలు వేర్వేరుగా ఉంటాయి.
* కాటుకు గురైన వ్యక్తి నాలుక మందమైనట్లు, గొంతు కండరాలు బిగుసుకున్నట్లు, గొంతులో ఏదీ దిగని పరిస్థితి తలెత్తవచ్చు. నోటి వెంట చొంగ కారుతూ, కళ్లు మగతగా, శరీరం మత్తుగా ఉండి స్పృహ కోల్పోవచ్చు. తక్షణ చికిత్స కోసం విషం విరుగుడు ఇంజక్షన్‌ (సూది మందు) రూపంలో ఇస్తే త్వరగా పనిచేస్తుంది.  
* పాము విషం విరుగుడుకు ‘యాంటిస్నేక్‌ వెనం’ ఇంజక్షన్‌ ఇస్తారు. ఇది అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంటుంది.
* చికిత్స అందడం ఆలస్యమై రైతు మరణిస్తే.. మెడికో లీగల్‌ కేసుగా నమోదుచేస్తారు. పేదలకు ఆపద్భందు పథకం కింద పరిహారం లభిస్తుంది.
పాము కరిస్తే .. తక్షణ చర్యలు
కాటు వేసిన భాగం నుంచి గుండెకు రక్తప్రసరణ జరగకుండా కాటుకు పైన, కింద తాడు లేదా వస్త్రంతో గట్టిగా కట్టాలి. కట్టును ప్రతి పది నిమిషాలకు వదులు చేయాలి. కాటుకు గురైన వ్యక్తిని నడిపించడం, పరుగెత్తించడం చేయకూడదు. విశ్రాంతినివ్వాలి. కరిచిన చోట పెద్దగా గాయం చేసి విషాన్ని నోటితో పీల్చి ఉమ్మేయడం వంటివి చేయకూడదు. దీని వల్ల గాయం మరింత పెద్దదై విషం చుట్టుపక్కల కణాలకు వ్యాపించి గుండెకు చేరుతుంది.
ఔషధ మొక్కలతో..
* పాముకాటుకు గురైన వ్యక్తికి.. తులసి ఆకుల నుంచి రసం తీసి అరగంటకు ఒకసారి చొప్పున 4-5 సార్లు తాగించాలి.
* గాడిద వేరును మెత్తగా నూరి, పాము కరిచిన చోట ఉంచి కట్టుకట్టాలి. దీంతో పాటు రెండు చెంచాల వేరు పొడిని ఆర గ్లాసు మంచినీటిలో కలిపి తాగించాలి.
* పచ్చిపొగాకు ఉంటే దాని రసం తీసి తాగించాలి. ఎండు పొగాకు ఉంటే దానిని నీటిలో నానబెట్టి సారం దిగేంత వరకూ బాగా కలిపి వడకట్టి తాగించాలి. ఇలా అరగంటకు ఒకసారి 4-5 సార్లు తాగించాలి. పొగాకును మెత్తగా నూరి కాటు వేసిన చోట ముద్దలా ఉంచి కట్టాలి. మారేడు ఆకుల రసం లేదా నేలవేము పూర్తి మొక్కను మెత్తగా నూరి రసాన్ని గ్లాసు నీటిలో కలిపి అరగంటకోసారి చొప్పున 4-5 సార్లు తాగించాలి. ఈ విధానాలను ఆచరిస్తూనే.. ఆలస్యం చేయకుండా బాధిత వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాలి.  
వంటింటి ఔషధాలతో..
* పసుపు కొమ్ముల్ని పొడిచేసి రెండు చెంచాల పొడిని అరగ్లాసు మంచి నీటిలో కలిపి అరగంటకోసారి చొప్పున 4-5 సార్లు తాగించాలి.
* తెల్ల మిరియాలు 100 గ్రా. పొడిగా చేసి కషాయం కాచి, వడపోసి 2-3 సార్లు తాగించాలి.
* 20 వెల్లుల్లి పాయల్ని నూరి పాలలో కలిపి తాగించాలి.
* నిమ్మకాయలోని 10-15 గింజల్ని మెత్తగా నూరి గ్లాసు నీటిలో కలిపి తాగించాలి. వీటిలో అందుబాటులో ఉన్న ఏదోఒక విధానాన్ని ఆచరిస్తే ఉపశమనం ఉంటుంది.
హోమియోపతి మందులతో.. : ‘వితిరితి-200’ మందు 5 మి.లీ. సీసా ఖరీదు రూ.10 మాత్రమే. ఈ మందును ముందస్తుగా కొని ఉంచుకోవడం మంచిది. పాము కరిచిన వ్యక్తి నాలుకపై పది నిముషాలకోసారి ఒక చుక్క చొప్పున 3 సార్లు వేస్తే త్వరగా కోలుకుంటాడు. తర్వాత వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లి చికిత్స చేయించాలి.

ఈ చర్యలతో ప్రయోజనం..
కె.మహరాజన్‌, ఏడీఏ, గజపతినగరం  

పొలాలకు వెళ్లేటప్పుడు రైతులు మోకాళ్ళ వరకు ఉండే గమ్‌బూట్లను వేసుకోవాలి. పాములు నేల ద్వారా వెలువడే శబ్దాలను గ్రహించి అప్రమత్తమవుతాయి. అందువల్ల శబ్దం చేసేలా అడుగులు వేయడం, కిర్రు చెప్పులు, కర్ర చప్పుళ్లు చేయడం వల్ల పాములు అప్రమత్తమై వెళ్లిపోతాయి. పాదం వరకు ఉండే ప్యాంట్లు, పంచెలు, లుంగీలు వేసుకొని వెళ్లడం మంచిది.  
రాత్రిపూట తప్పనిసరిగా టార్చిలైటు, కర్ర తీసుకువెళ్లాలి. మోటారు షెడ్‌లో స్టార్టర్‌ దగ్గర చీకటిగా, చల్లగా ఉండే గూడు లాంటి ప్రదేశాల్లో పాములు నక్కి ఉండే అవకాశం ఉంటుంది.

వెంటనే చికిత్స అందించాలి  
డాక్టర్‌ కె.సత్యనారాయణ, ప్రాథమిక వైద్యాధికారి, బొండపల్లి

పొలాల్లో ఉంటున్న రైతులు పాముకాటు, విషజంతువులు బారిన పడినప్పుడు తక్షణం ప్రథమ చికిత్స చేసినప్పటికీ, వెద్యుని వద్దకు తీసుకెళ్లాలి. అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పాముకాటుకు మందులు అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.