close
రాళ్ల నేలలో రతనాల పంట!

బీరలో అధికాదాయం సాధిస్తున్న రైతు
ఐదెకరాల్లో సుమారు 80 టన్నుల పైగా దిగుబడి 
రూ. 15 లక్షల పైబడి లాభం వస్తుందని అంచనా

న్యూస్‌టుడే, లింగాల

తక్కువ పెట్టుబడితో అధికాదాయం సాధించేందుకు రైతులు వినూత్న పద్ధతులను అవలంబిస్తున్నారు. ఈ కోవకు చెందిన రైతే.. లింగాల మండలం కోమన్నూతలకు చెందిన సరిబాల ప్రతాప్‌రెడ్డి. ఈయన ఎర్ర గరప నేలలో బీర సాగుతో లాభాలు సాధిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

మల్చింగ్‌ పద్ధతిలో..
రెండు బోరు బావుల నీటితో ఈ రైతు గతంలో 9 ఎకరాల్లో సంప్రదాయ పంటలు సాగుచేసి పెట్టుబడులను కూడా రాబట్టుకోలేపోయారు. ఉద్యానాధికారుల సలహాతో ఈ ఏడాది అక్టోబరు 23న తొలుత ఐదెకరాల్లో బీర సాగు చేపట్టారు. విత్తిన 10 నుంచి 20 రోజుల్లో తీగలు పాకేందుకు కర్రలను ఊతంగా అమర్చి, పందిరిని ఏర్పాటు చేశారు. విత్తనాలు, సస్యరక్షణ మందులు, కర్రలు, కూలీల ఖర్చు, మల్చింగ్‌ ఏర్పాటుకు ఎకరాకు సుమారు రూ.40 వేలు వరకు పెట్టుబడి పెట్టారు.
రాయితీపై మల్చింగ్‌ షీట్‌ : 9 ఎకరాల్లో బీర సాగుకు మల్చింగ్‌ షీట్‌ ఏర్పాటుకు హెక్టారుకు (రెండున్నర ఎకరాలు) రూ.22 వేలు ఖర్చు కాగా, ఉద్యానశాఖ 50 శాతం రాయితీ అందించింది.
నేల తయారీ : పశువుల ఎరువుతో పాటు జీవన ఎరువు ఫాస్ఫోబ్యాక్టీరియా, జీవ శిలీంద్ర నాశకాలైన ట్రైకోడర్మా విరిడి, సుడోమోనాస్‌, అసిటో బ్యాక్టీరియా వంటి మిశ్రమాలను దుక్కిలో వేశారు.
సాగు ఇలా : ఈస్ట్‌-వెస్ట్‌ రకం విత్తనాన్ని ఎకరాకు అరకిలో చొప్పున విత్తారు. సాళ్ల మధ్య 6 అడుగులు, మొక్కల మధ్య అడుగున్నర ఎడం ఉండేలా విత్తారు.
సస్యరక్షణ : మండల ఉద్యానాధికారి సూచనలతో.. తెగుళ్ల నివారణకు నాటివో, ఎం-45, కవచ్‌ వంటి మందులను వినియోగించారు. రసంపీల్చే రెక్కల పురుగుల నివారణకు.. జిగురు పూసిన అట్టలను తోటలో అక్కడక్కడ అమర్చాడు.


​​​​​​​పాక్షిక సేంద్రియ పద్ధతిలో..

మొక్కల మొదళ్ల వద్ద మల్చింగ్‌ షీట్‌ పరిచి, బిందుసేద్య పద్ధతిలో నీరందిస్తూ సాగు చేపట్టారు. సేంద్రియ, రసాయన ఎరువులను రెండింటినీ సమపాళ్లలో ఉపయోగిస్తున్నారు. దీంతో బీరకాయలు రెండడుగుల మేర పొడవు పెరిగాయి. దళారులు పొలం వద్దకే వచ్చి టన్ను రూ.25 వేలు చొప్పున పంటను  కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. చెన్నై, హైదరాబాద్‌, విజయవాడ, బెంగళూరు తదితర మార్కెట్లకు తరలిస్తున్నారు.


తొలి ప్రయత్నంలోనే..

పంట విత్తిన 40 రోజులకు కోత ప్రారంభించారు. ప్రతి మూడు రోజులకోసారి కోత చేపడుతున్నారు. ఐదెకరాల్లో ఇప్పటివరకు 54 టన్నుల దిగుబడి రాగా, టన్ను రూ.20 నుంచి 26 వేలు చొప్పున విక్రయించగా సుమారు రూ.12 లక్షల ఆదాయం వచ్చింది. పెట్టుబడి రూ.రెండు లక్షలు పోను, రూ.10 లక్షలు లాభం వచ్చింది. మరో 30 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. టన్ను ధర కనిష్ఠంగా రూ.20 వేలు చొప్పున విక్రయించినా మరో రూ.6 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మరో నాలుగెకరాల్లో విత్తిన బీర తోటలో కొద్ది రోజుల్లో కోత ప్రారంభమవుతుందని రైతు తెలిపారు. ప్రస్తుతం రోజుకు 3 టన్నుల దిగుబడి వస్తోంది.

ఇంత ఆదాయాన్ని ఊహించలేదు
ప్రతాప్‌రెడ్డి, రైతు (చరవాణి: 96527 53077)

ఉద్యానాధికారుల సూచనలతో బీర సాగు చేశా. తక్కువ సమయంలో ఇంత ఆదాయం వస్తుందని ఊహించలేదు. ఈ పంటలో తెగుళ్లను అరికడితే మంచి లాభాలు వస్తాయి. నేల ద్వారా వ్యాప్తిచెందే తెగుళ్లకు అడ్డుకట్ట వేసేందుకు పంట తొలిదశ నుంచే చర్యలు చేపట్టాను. ఎరువుల వాడకంలోనూ జాగ్రత్తలు పాటించడంతో నాణ్యమైన దిగుబడులు వచ్చాయి.

తీగజాతి పంటల సాగుకు రాయితీ
గువ్వా రాఘవేంద్రారెడ్డి, ఉద్యానాధికారి, పులివెందుల (చరవాణి : 79950 86982)

తక్కువ సమయంలో అధికాదాయాన్నిచ్చే బీర పంటను అన్ని కాలాల్లో సాగు చేయవచ్చు. బూడిద తెగులు నివారణకు సకాలంలో చర్యలు చేపడితే దిగుబడి బాగుంటుంది. ఈ పంటల సాగులో ఆసక్తి ఉన్న రైతులు ముందుకు వస్తే శాశ్వత పందిరి, మల్చింగ్‌కు రాయితీలను అందిస్తాం.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.