close
కాసులు కురిపిస్తున్న కాకర!

పందిరి, మల్చింగ్‌ ద్వారా మేలైన దిగుబడులు
ఇప్పటి వరకు రూ. 8 లక్షల రాబడి
ఉద్యానాధికారుల సూచనలతో సత్ఫలితాలు
న్యూస్‌టుడే, నకిరేకల్‌

ల్గొండ జిల్లా నకిరేకల్‌ మండలం మర్రూరు గ్రామానికి చెందిన యువరైతు బరిశెట్టి బాలరాజు ఉన్నత విద్యాభ్యాసం చేసినప్పటికీ వ్యవసాయంపై మక్కువతో ఉద్యోగ ప్రయత్నం చేయకుండా సేద్యాన్నే ఉపాధి మార్గంగా ఎంచుకున్నారు. కాలానుగుణంగా వచ్చే మార్పులను అందిపుచ్చుకుంటూ రెండెకరాల్లో కాకరను సాగుచేస్తూ లాభాలను పొందుతున్నారు. వ్యవసాయ సదస్సులకు, సమావేశాలకు హాజరవుతూ మేలైన సాగు విధానాలపై అవగాహన పెంచుకున్నారు. బిందుసేద్యం, మల్చింగ్‌ విధానాలు అవలంబిస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అక్టోబరులో కాకర సాగు ప్రారంభించారు. ఉద్యానాధికారుల సలహాలు పాటిస్తూ, సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటిస్తున్నారు. ఇప్పటి వరకు రూ.8 లక్షల విలువైన పంటను పండించారు. మరో 25 రోజుల కాలానికి రూ.రెండు లక్షల విలువైన దిగుబడి వస్తుందని రైతు తెలిపారు.

పంటకు పందిరి.. మల్చింగ్‌
10 సెం.మీ. ఎత్తు బోదెలు చేసి వాటిపై డ్రిప్‌ పైపులను అమర్చి, మల్చింగ్‌ షీట్‌ను పరిచారు. బోదెల మధ్య నాలుగు అడుగుల వెడల్పు, మొక్కల మధ్య 55 సెం.మీ. దూరం ఉండేలా విత్తారు. మల్చింగ్‌ షీట్‌తో కలుపు నివారణతో పాటు నీరు, ఎరువులు సద్వినియోగమవుతున్నాయి. ఎకరానికి 185 స్తంభాలతో గతంలోనే ఏర్పాటు చేసిన పందిరిని కాకరకు వినియోగించారు. విత్తనం మొలకెత్తిన 12 రోజుల తర్వాత ఫెర్టిగేషన్‌ పద్ధతి (నీటితో పాటు రసాయన ఎరువులు పంపడం)లో ఎరువులను అందిస్తున్నారు.

ఆచరిస్తున్న పద్ధతులు

హైబ్రీడ్‌ ఎఫ్‌-2 పాలి, మాయ, ప్రాచీ రకాల కాకర విత్తనాలను విత్తారు. రెండెకరాల్లో 20 ప్యాకెట్లు (50 గ్రాముల) విత్తనాలను విత్తారు. మొక్కలు ఎదిగే దశలో స్థూల, సూక్ష్మపోషక ఎరువులను వినియోగిస్తున్నారు.
మొక్క పెరిగే దశలో పచ్చపురుగు, రబ్బరు పురుగు నివారణకు 10 లీటర్ల నీటికి కోరాజిన్‌ 3 మిల్లీలీటర్లు చొప్పున కలిపి పిచికారీ చేశారు.  
పంటను ఆశించే రసంపీల్చే తెల్లదోమ, పచ్చదోమల నివారణకు జిగురు పూసిన అట్టలను చేలో అక్కడక్కడ అమర్చారు.
పందిరిపై తీగలు పూర్తిగా అల్లుకున్న తరవాత కాండానికి ఇరువైపులా వచ్చిన ఆకులు, తీగలను కత్తిరించారు.
కాయలపై పురుగు ఉద్ధృతిని నివారించేందుకు ఎకరానికి సుమారు 30 లింగాకర్షక బుట్టలను వాడుతున్నారు.

దిగుబడి..
పంట విత్తిన 45 రోజుల నుంచి దిగుబడి మొదలైంది. కోత ప్రారంభంలో రోజుకు 3.5 నుంచి 4 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. ప్రస్తుతం 90 రోజుల పంట కాలంలో రోజుకు ఆరు క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోంది. కిలోకు రూ.23 నుంచి 32 వరకు ధర లభించింది. అధిక శాతం పంటను కిలో రూ.25 చొప్పున విక్రయించారు. ఇప్పటి వరకు 324 క్వింటాళ్ల దిగుబడి, రూ.8 లక్షల వరకు ఆదాయం వచ్చింది. వచ్చిన పంటను నల్గొండ, మిర్యాలగూడ, నకిరేకల్‌ మార్కెట్లలో విక్రయిస్తున్నారు. గతంలో ఈ రైతు సుగంధ ద్రవ్యాల తయారీకి ఉపయోగించే రూసా గడ్డి సాగు చేపట్టి, నూనెను తీసి బెంగళూరు ఎగుమతి చేశారు. పాలిహౌజ్‌లో కూరగాయల పెంపకం చేపట్టి, హైదరాబాద్‌లోని మాల్స్‌కు విక్రయించి లాభాలను ఆర్జించారు.
సాగును మరింత విస్తరిస్తా..
బాలరాజు, యువరైతు, మర్రూరు (చరవాణి నెం: 90100 45969)

పందిరి సాగు మంచి లాభదాయకంగా ఉంది. ప్రస్తుతం రెండెకరాల్లో చేపట్టిన కాకర మంచి లాభాలనిచ్చింది. ఈ పందిరిని గతంలోనే నిర్మించాను. భూమి చదును, విత్తనాలు, ఎరువులు, కూలీలు, పంట రవాణా కోసం రెండెకరాల్లో సుమారు రూ.లక్షా 60 వేలు ఖర్చయింది. కాకర సాగుకు ముందు ఇదే పందిరిపై బీరసాగు చేశాను. అప్పుడు ధర బాగుండటంతో మూడు నెలల్లోనే రూ.తొమ్మిది లక్షల ఆదాయం వచ్చింది. ప్రస్తుతం మరో ఆరు ఎకరాల్లో పందిర్లు నిర్మిస్తున్నాను.

పందిరి సాగు లాభదాయకం
రావుల విద్యాసాగర్‌, నకిరేకల్‌ ఉద్యానశాఖ క్లస్టర్‌ అధికారి, నల్గొండ జిల్లా

బాలరాజు సాగు చేసిన పంటను తరచూ పరిశీలిస్తూ సస్యరక్షణ చర్యలు సూచించాం. బిందుసేద్యం, మల్చింగ్‌ విధానాలు పాటిస్తే అధికాదాయం వస్తుంది. ఈ విధానంలో సాగు చేసే రైతులకు రాయితీలు ఇస్తున్నాం. ఒక రైతు హెక్టారు (రెండున్నర ఎకరాలు) వరకు పందిరికి రాయితీ పొందవచ్చు. పందిరి నిర్మాణానికి ఎకరానికి రూ.లక్ష, మల్చింగ్‌ షీట్‌కు ఐదు ఎకరాల వరకు రాయితీ వస్తుంది. బిందు సేద్యానికి 80-90 శాతం రాయితీ వస్తుంది. ఆసక్తి ఉన్న రైతులు ముందుగా తమశాఖ అనుమతి పొంది, సొంత ఖర్చుతో ఎకరానికి 185 స్తంభాలతో పందిరి నిర్మించుకున్న తర్వాతే రాయితీ వస్తుంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.