close
మామిడిలో ఆలస్యంగా పూత!

న్యూస్‌టుడే, ఒంటిమిట్ట

ప్రస్తుత మామిడి సీజనులో పూత పూయడం బాగా ఆలస్యమవుతోంది. పూత బాగా పూస్తుందో లేదో అని అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. పూసిన పూత నుంచి పిందెలు ఏర్పడుతాయో లేదోనని, ఏర్పడిన పిందెలు రాలకుండా నిలుస్తాయో లేదోనని కర్షకులు కలత  చెందుతున్నారు. పూత వచ్చేందుకు, వచ్చిన పూమొగ్గల సంరక్షణకు చేపట్టాల్సిన చర్యలను ఉద్యానశాఖ సంయుక్త సంచాలకులు వేంపల్లి లక్ష్మిరెడ్డి సూచించారు.
పూతను ప్రభావితం చేసే అంశాలు
సముద్రానికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో పూత ఆలస్యంగా వస్తుంది. సముద్ర మట్టానికి ప్రతి 400 అడుగుల ఎత్తుకు 4 రోజులు ఆలస్యంగా పూత వస్తుంది. ఇవేగాకుండా వాతావరణ పరిస్థితులు ముఖ్యంగా ఉష్ణోగ్రత (చలి, వేడి), వర్షాలు, చెట్టులోని కొమ్మల్లో ఉండే పిండి పదార్థాలు, నత్రజని నిష్పత్తి (సీఎన్‌ నిష్పత్తి) కూడా పూత పూసే సమయాన్ని ప్రభావితం చేస్తాయి. చెట్ల కొమ్మల్లో పిండి పదార్థాలు ఎక్కువగా, నత్రజని తక్కువగా ఉంటే పూత వచ్చేందుకు, ఎక్కువగా రావడానికి దోహదపడుతుంది. ఈ పరిస్థితి చెట్టులో రావాలంటే అక్టోబరు, నవంబరు, డిసెంబరు మధ్య వరకు తోటలో నీటి తడులు ఇవ్వరాదు. ఈ మాసాల్లో వర్షాలు కురిస్తే.. నేలలో తేమ పెరిగి, చెట్లు బెట్టకు గురికావు. గతేడాది నవంబరు నెలాఖరు వరకు తరచూ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఫలితంగా చెట్లలో పెరుగుదల కొనసాగింది. దీంతో కొమ్మల్లో పిండి పదార్థాల నిల్వలు తగ్గి, పిండిపదార్థం, నత్రజని నిష్పత్తిలో మార్పు వచ్చి పూత ఆలస్యమవుతుంది. ఈ పరిస్థితి పూత తక్కువ, ఇగుర్లు ఎక్కువగా వచ్చేందుకు దోహదం చేస్తుంది. దీనికితోడు పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పూతకు వచ్చే సమయాన్ని నియంత్రిస్తాయి.
ప్రస్తుతం పూత పరిస్థితి : ఇప్పటివరకు 95 శాతం మామిడి చెట్లు పూమొగ్గ దశకు కూడా చేరుకోలేదు. తోటల్లోని చెట్లను పరిశీలిస్తే.. సంక్రాంతికి పచ్చి పూత దశకు చేరే అవకాశం కన్పిస్తోంది. అప్పటికి పెరిగే ఉష్ణోగ్రతలు.. పూత ఫలదీకరణ, పిందెలు ఏర్పడేందుకు కొంత అవరోధం కావచ్చు. పుట్టిన పిందెలు కూడా రాలే పరిస్థితి ఉండొచ్చు.

చేపట్టాల్సిన యాజమాన్యం

సాధారణంగా డిసెంబరు మధ్య పూత ప్రారంభం కావాలి. ప్రస్తుతం చాలా తోటల్లో పూమొగ్గ దశ ప్రారంభం అవుతోంది.  
రైతులు పొటాషియం నైట్రేట్‌(13:0:45)ను ఒక లీటరు నీటికి 10 గ్రాములు కలిపి చెట్లపై బాగా తడిచేలా పిచికారి చేయాలి.  
తేలికపాటి తడివ్వాలి. ఈ రెండు చర్యలు పూమొగ్గల్ని ఉత్తేజపరచి పూత తొందరగా, ఒకే సమయంలో రావడానికి దోహదడతాయి.
సస్యరక్షణ చర్యలను పూమొగ్గ దశ నుంచి ప్రారంభించాలి. ముఖ్యంగా ద్విలింగ పుష్పాలు, పిందెలు రాలకుండా ఒకసారి, పచ్చి పూత దశలో రెండోసారి, నల్లపూత దశలో మూడోసారి మందులు పిచికారి చేసేటప్పుడు.. 10 లీటర్ల నీటికి ప్లానోఫిక్స్‌ 2 మి.లీ. చొప్పున కలిపి పురుగు మందులతో కలిపి పిచికారి చేయాలి.  
పూలు విచ్చుకున్న దశలో అనగా తెల్లపూత దశలో పురుగు మందులను పిచికారి చేయరాదు. ఈ దశలో మందుల పిచికారి వల్ల పరపరాగ సంపర్కానికి దోహదపడే ఈగలు, తేనెటీగలు లాంటి పురుగులు చనిపోతాయి. మందుల వాసనలకు కీటకాలు పూల చెంతకు చాలా రోజుల వరకు రావు. దీనివల్ల ఫలదీకరణ జరగక పిందెలు ఏర్పడకుండానే ద్విలింగ పూలు రాలుతాయి.  
ఉష్ణోగ్రతలు పెరిగి ఫలదీకరణను వృద్ధి చేసేందుకు, పూత-పిందెలు రాలకుండా ఉండటానికి చెట్లకు నీరివ్వడం ప్రారంభించాలి. పిందెలు గోళీ పరిమాణంలో ఉన్నప్పుడు ఒక్కో చెట్టుకు ఒక కిలో యూరియా, ముప్పావుకిలో మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ చొప్పున వేసి నీరు పారిస్తే పోషక లోపాలు తలెత్తవు. పిందె రాలడం బాగా తగ్గుతుంది.  
నీటి వసతి లేని తోటలకు ఒక లీటరు నీటికి 10 గ్రాములు 19:19:19 కలిపి పిందె దశలో పిచికారి చేస్తే.. పోషక లోపాలు కొంతవరకు తగ్గుతాయి. కాయల వృద్ధికి ఉపయోగపడుతుంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.