close
‘కరవు సంసిద్ధత పథకం’.. రైతులకు కల్పతరువు!

రెండు వేల ఎకరాల్లో సజ్జ సాగు
వర్షాభావంలోనూ మేలైన దిగుబడి
సామూహిక సాగుతో లాభాలు
న్యూస్‌టుడే, రాయచోటి

రాయలసీమలోని నాలుగు జిల్లాలతోపాటు ప్రకాశం జిల్లాలోకి కొన్ని మండలాల్లో కరవు ప్రభావం అధికంగా ఉంది.  ఏటా వర్షాభావ పరిస్థితులతో ఇక్కడి భూములు బీళ్లుగా మారుతున్నాయి. ఫలితంగా వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాలకు చెందిన రైతులకు ఉపాధి కష్టతరమవుతోంది. ఈ పరిస్థితుల్లో రైతులకు ‘కరవు సంసిద్ధత పథకం’ చేదోడుగా ఉంటూ బహుళ ప్రయోజనాలను అందిస్తోంది.
కరవు మండలాలే లక్ష్యంగా..
కడప జిల్లాలోని రాయచోటి, సంబేపల్లె, చిన్నమండెం, వీరబల్లి మండలాల్లో సజ్జ సాగుకు అనువైన వాతావరణం, నేల ఉండటంతో.. అధికారులు ఆయా మండలాల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గత ఖరీఫ్‌లో రైతులతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడినిచ్చే సజ్జ పంటను సాగు చేయించారు. అవసరమైన విత్తనాలు, ఎరువులను అందించారు. పంట కీలక దశల్లో రెండు వానలు పడ్డాయి. 3 నెలల్లోనే పంట ఏపుగా పెరిగి, మంచి దిగుబడినిచ్చింది. పాలు పోసుకునే దశలో పురుగుల నివారణకు చర్యలు చేపట్టారు. సాధారణంగా రైతులకు సజ్జలో ఎకరాకు ఏడు క్వింటాళ్ల దిగుబడి వస్తే, ఇక్కడి రైతులు 13 క్వింటాళ్ల పైబడి దిగుబడి సాధించారు. ఎక్కువ మంది రైతులు ఈ పంటపైనే ఆసక్తిని చూపుతూ, అధిక దిగుబడులు సాధిస్తున్నారు. వలసలు వెళ్లడం మానేసి, బీడు భూములను సాగులోకి తెస్తున్నారు.

2 వేల ఎకరాల్లో.. 2600 టన్నుల దిగుబడి
250 మంది రైతులు సుమారు 2 వేల ఎకరాల్లో సజ్జను సామూహికంగా సాగు చేశారు. దీంతో పంటకు కాపలా సులభమైంది. సహజ ఎరువులతోనే పంట చేతికొచ్చింది. 2600 టన్నుల దిగుబడి సాధించారు. క్వింటా రూ.2300 చొప్పున విక్రయించారు. ఎకరాకు రూ.25-30 వేలు ఆదాయం రాగా, ఖర్చు రూ.4 వేలు మించలేదు. ఈ దిగుబడులను చూసిన వ్యవసాయ పరిశోధకులు, కరవు సంసిద్ధత పథక నిర్వాహకులు ఈ సాగును మరికొన్ని ప్రాంతాల్లో విస్తరిస్తామంటున్నారు.

సాగు ఇలా..
వర్షాధార మెట్ట భూములను తొలకరి వానకు దుక్కి చేశారు. ఎకరాకు అయిదు టన్నుల పశువుల ఎరువును దుక్కిలో వేసి దున్నారు. విత్తనశుద్ధి చేసిన విత్తనాన్ని ఎకరాకు 10-15 కిలోలు చొప్పున గొర్రుతో ఎదబెట్టారు. పంట 30 రోజుల దశలో సాళ్లమధ్య గుంటకతో దున్ని కలుపును నివారించారు. పంట ఎదిగే దశలో నీటి ఎద్దడి వల్ల వాడుముఖం పట్టింది. ఈ దశలో యూరియాను నీటిలో కలిపి పంటపై పిచికారీ చేశారు. కోతదశలో యంత్రాలను ఉపయోగించారు.
కరవులో అధిక దిగుబడి
డి.సుబ్బయ్య, రైతు, పాతగొల్లపల్లె

ఇక్కడ వర్షం పడితే తప్ప సాగు సాధ్యం కాదు. ఈ సమయంలో అధికారులు వచ్చి సజ్జ సాగు చేస్తే మంచి దిగుబడి వస్తుందని ధైర్యాన్నిచ్చారు. సాగుకు అవసరమైన సహాయం అందిస్తామన్నారు. గత ఆగస్టులో మా ఊరిలో రైతులందరం ఈ పంట విత్తాం. ఎకరాకు 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది.  
వేరుసెనగతో నష్టపోయాం
ఎం. వెంకటరమణ, సజ్జ రైతు, కేకలదొడ్డిపల్లె

ఖరీఫ్‌లో వర్షాధార పంటగా వేరుసెనగ సాగుతో నష్టాలే మిగిలేవి. సాగు దండగ అనుకుంటున్న సమయంలో ‘కరవు సంసిద్ధత పథకం’ ఆసరా అయ్యింది. వేరుసెనగ కన్నా సజ్జ పంట అన్ని విధాలా లాభసాటి. నీటి అవసరం తక్కువగా ఉండే సజ్జలాంటి స్వల్పకాలిక పంటలను సాగుచేస్తే రైతులు నష్టపోరు. ఈ పంటను అయిదెకరాల్లో సాగుచేసి 60 క్వింటాళ్ల దిగుబడి సాధించాను.
ప్రతి ఏటా సాగు చేస్తాం

ఆదిశేఖర్‌, రైతు, వానచారపల్లి
వర్షాలు లేక మా ప్రాంతంలో సాగు తగ్గింది. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి వచ్చే పంటల సాగుపై దృష్టి సారించాం. గతంలో అవగాహన లేమితో పంటలు సాగుచేసి తీవ్రంగా నష్టపోయాం. ఇప్పటి నుంచి ఏటా ఖరీఫ్‌లో సజ్జ, కంది, అలసంద, ఉలవ పంటలను సాగు చేయాలనుకుంటున్నాం. నాలుగు ఎకరాల్లో సజ్జను సాగుచేస్తే రూ.లక్ష ఆదాయం వచ్చింది. ఖర్చులు పోను రూ.75 వేలు మిగిలింది.
సాగుకు తోడ్పాటు

బి.వి.రత్నం, పథకం పర్యవేక్షకులు
కరవులోనూ రైతులకు మేలు కలిగేలా ప్రభుత్వం కరవు సంసిద్ధత పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా తక్కువ నీటి సదుపాయం ఉన్న భూముల్లో సాగుకు తోడ్పాటు అందిస్తున్నాం. వేరుసెనగ, కంది, ఆముదం, అలసంద, జొన్న పంటల సాగును ప్రోత్సహిస్తున్నాం.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.