close
సాగులో సందేహాలకు.. చరవాణికి సందేశాలు!

‘అన్నపూర్ణ కృషి ప్రసార యోజన’ పథకం
కేవీకేల ద్వారా రైతులకు సేద్య సమాచారం
న్యూస్‌టుడే, ఉండి

స్మార్ట్‌ఫోన్‌లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని వివిధ రంగాలకు చెందిన వారు అనేక ప్రయోజనాలను పొందుతున్నారు. రైతులు సైతం స్మార్ట్‌ఫోన్‌ ఆధారంగా సాగులో మేలైన ఫలితాలను పొందే వీలుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ‘అన్నపూర్ణ కృషి ప్రసార యోజన’ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. రైతులు ఈ సేవలను పొందవచ్చు. ఇందుకోసం రైతులు తమ సమీపంలో ఉన్న కేవీకే లేదా ఏరువాక కేంద్రాల్లో పేరు, చరవాణి నెంబర్‌, గ్రామం, మండలం, పంట రకం, తదితర వివరాలను నమోదు చేసుకోవాలి. ఈ పథకంలో భాగంగా ఏర్పాటుచేసిన ఉచిత (టోల్‌ఫ్రీ) నెంబరు 1800 425 3141కు ఫోన్‌చేసి శాస్త్రవేత్తలతో మాట్లాడవచ్చు. దీనితో పాటు స్మార్ట్‌ఫోన్‌ ఉన్న రైతులు స్మార్ట్‌ఫోన్‌లో ‘గూగుల్‌ ప్లే స్టోర్‌’ నుంచి ‘ఉమాంగ్‌’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని, అందులో తమ వివరాలను నమోదు చేసి, కావలసిన వ్యవసాయ సమాచారాన్ని పొందవచ్చు.
ప్రయోజనాలు
ఈ పథకం కింద వివరాలు నమోదు చేసుకున్న రైతులు 1800 425 3141 నెంబరుకు ఫోన్‌ చేసి కేవీకే శాస్త్రవేత్తలతో మాట్లాడవచ్చు.
వ్యవసాయం, ఉద్యాన పంటలు, చేపలు, రొయ్యల పెంపకం, పాడిపోషణ తదితర అంశాలపై సలహాలు పొందవచ్చు.
ఉచిత ఫోన్‌కు కాల్‌ చేసిన సమయంలో శాస్త్రవేత్తలు అందుబాటులో లేని పక్షంలో.. రైతులు తమ సమస్యలను, సందేహాలను చెబితే, అవి రికార్డవుతాయి. తర్వాత నిపుణులు తిరిగి రైతుకు ఫోన్‌ చేయడం కానీ, సమాధానాలను సంక్షిప్త సందేశాల (మెసేజ్‌) రూపంలో పంపించడం గానీ చేస్తారు.
తుపాన్లు, అధిక వర్షాలు, ఇతరత్రా ప్రకృతి వైపరీత్యాలు వంటి పరిస్థితుల్లో.. శాస్త్రవేత్తలు రైతులకు అత్యవసర హెచ్చరిక సందేశాలు పంపుతారు.  
స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న రైతులు తమ పొలంలోని చీడపీడలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సేవా కేంద్రాలకు పంపి సలహాలు, సూచనలు పొందవచ్చు.
మేలైన ఫలితాలు సాధించిన రైతులు తమ అనుభవాలను ఉమాంగ్‌ యాప్‌ ద్వారా ఇతర రైతులతో పంచుకోవచ్చు.

రైతులంతా వినియోగించుకోవాలి
ఎంవీ కృష్ణాజీ, విస్తరణ శాస్త్రవేత్త, కేవీకే, ఉండి (77805 91943)

అన్నపూర్ణ కృషి ప్రసార సేవల కోసం రైతులు తమ వివరాలను ప్రతి జిల్లాలో ఉన్న కేవీకే లేదా ఏరువాక కేంద్రాల్లో నమోదు చేసుకోవాలి. 2017-18లో పశ్చిమగోదావరి జిల్లా ఉండి, కేవీకేలో అవగాహన సదస్సులు నిర్వహించాం. క్షేత్ర సందర్శనలు, విస్తరణ కార్యక్రమాలు, సమావేశాలు, కిసాన్‌ మేళాల్లో ఈ కార్యక్రమంపై అన్నదాతలకు అవగాహన కల్పిస్తున్నాం. ఈ అవకాశాలను రైతులంతా సద్వినియోగం చేసుకోవాలి.  
ప్రయోజనకరంగా ఉంది : చల్లారావు, రైతు, కుప్పనపూడి
2015లో అన్నపూర్ణ కృషి ప్రసార సేవల కోసం వివరాలను నమోదు చేసుకున్నాను. ఖరీఫ్‌లో పంటల్లో ఎదురవుతున్న సమస్యలను శాస్త్రవేత్తలకు తెలియజేశాను. వారి సూచనలు, సలహాలు పాటించాను. ప్రస్తుతం వారి సూచనల మేరకు చేపల పెంపకం చేపట్టాను.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.