close
బంతి తోట.. లాభాల బాట!

సేంద్రియ పద్ధతిలో సాగు
సొంతంగా నర్సరీ ఏర్పాటు
15 ఏళ్లుగా బంతి పంటే..

- దాసరి ఆళ్వారస్వామి, విజయవాడ (చరవాణి : 93938 18199)  

ఏటా పెరుగుతున్న సాగు ఖర్చులతో వ్యవసాయ రంగం కుంగుబాటుకు గురవుతోంది. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే రైతులు కొత్త ఆలోచనలు, నూతన విధానాలు అవలంబించాలి. గుంటూరు జిల్లా, చుండూరు గ్రామానికి చెందిన రైతు గుదేటి సుబ్బారెడ్డి సేంద్రియ విధానంలో బంతి పూల సాగు చేపట్టి అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. ఈ రైతు 15 ఏళ్లుగా కేవలం బంతిని మాత్రమే సాగు చేస్తూ అధికాదాయం పొందుతున్నారు. ఆ వివరాలు..
 

రసాయన సాగులో పెట్టుబడి అధికం
గతంలో పసుపు, అరటి వంటి పంటలను సాగు చేస్తున్నప్పుడు.. అధిక దిగుబడులు సాధించేందుకు ఇతర రైతులతో పోటీపడి రసాయన ఎరువులను ఎక్కువగా వాడారు. దిగుబడులు ఆశించిన స్థాయిలో వచ్చినప్పటికీ ఆదాయం అంతంత మాత్రంగానే ఉండేది. పెట్టుబడి కూడా రాని సందర్భాలు అనేకం ఉండేవి. ఈ నేపథ్యంలో.. విజయవాడలో జరిగిన పూల ప్రదర్శనలో ఈ రైతును బంతిపూలు బాగా ఆకర్షించాయి. వాటి సాగు లాభదాయకమని తెలుసుకున్నారు. అప్పటినుంచి బంతి సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పంటను నాలుగెకరాల్లో సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. పూలను విజయవాడలో విక్రయిస్తున్నారు. ప్రస్తుతం కిలోకు రూ.30-50 వరకు ధర పలుకుతోంది.
రైతు ఆచరిస్తున్న సేంద్రియ పద్ధతులు
దుక్కిలో ఎకరానికి 4 ట్రక్కుల పశువుల ఎరువు వేసి, బంతి మొక్కలను నాటారు. మొక్కలు నాటిన 15-20 రోజులకు పొలంలో 50 కిలోల పశువుల ఎరువుకు పది లీటర్ల వేప లేదా గానుగ నూనె కలిపి మొక్కల వద్ద చల్లారు.  
లీటరు నీటికి 5 మి.లీ. చొప్పున వేప లేదా గానుగ లేదా పొద్దుతిరుగుడు + అర మి.లీ. సబ్బు ద్రావణం కలిపి మొక్కలపై పిచికారీ చేశారు.  
పూలపై పురుగు ఉనికి కనిపిస్తే నివారణకు లీటరు నీటికి పొద్దుతిరుగుడు గింజల నూనె 2 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేశారు.

బియ్యం కడిగిన నీళ్లు + పాలు కలిపి పది రోజులపాటు నిల్వచేసిన మిశ్రమాన్ని లీటరు నీటికి 2 మి.లీ. చొప్పున కలిపి మొక్కలపై పిచికారీ చేశారు. ఈ ద్రావణంతో మొక్కల్లో ఎదుగుదల బాగుంటుందని, నేల గుల్లబారుతుందని పేర్కొన్నారు. లీటరు ద్రావణాన్ని 100 నుంచి 200 లీటర్ల నీటిలో కలిపి బిందుసేద్యం (ఫెర్టిగేషన్‌) ద్వారా మొక్కలకు అందిస్తున్నారు. దీంతో పూల నాణ్యత పెరిగి ఎక్కువ రోజులపాటు పూలు నిల్వ ఉంటాయన్నారు. పంటను చీడపీడలు ఆశించకుండా ఉండేందుకు.. ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ ప్రకృతి ఉత్పత్తులను తయారు చేసి, వినియోగించి రైతు సత్ఫలితాలను పొందుతున్నారు.  

పూల రకాలు - నర్సరీ ఏర్పాటు : సుబ్బారెడ్డి, రైతు (చరవాణి : 99632 93921)

బంతిలో ఆరంజి, ఎల్లో, రెడ్‌, రోజ్‌ వంటి రకాలకు మంచి గిరాకీ ఉంటుంది. రైతు ప్రసుత్తం రెండు రకాలను సాగు చేస్తున్నారు. గతంలో నాణ్యమైన నారు అందుబాటులో లేకపోవడం ఇబ్బందులను ఎదుర్కొన్నారు. దీంతో 2012లో సొంతంగా నర్సరీని ఏర్పాటు చేసుకున్నారు. ఏటా 40 నుంచి 50 లక్షల నారు మొక్కలను పెంచి రైతులకు విక్రయిస్తున్నారు. నారును ప్రత్యేకంగా నర్సరీలో పెంచడం వల్ల మొక్కల ఎదుగుదల బాగుంటోందని, ఎకరానికి సరాసరి 15 టన్నుల పూల దిగుబడి వస్తోందని తెలిపారు. రైతులు బంతిని ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేసి, విక్రయంలో ఇబ్బంది పడకుండా, తక్కువ మొత్తంలో సాగు చేయడం శ్రేయస్కరమని తెలిపారు. సాగులో మరిన్ని వివరాల కోసం రైతును సంప్రదించవచ్చు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.