close
తైవాన్‌ జామ.. యువ రైతుకు లాభాల ధీమా!

సేంద్రియ సాగువైపు యువ రైతుల్లో ఆసక్తి పెరుగుతోంది. చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం మిట్టఎంబాడి గ్రామానికి చెందిన యువరైతు లోకేష్‌రెడ్డి వ్యవసాయ కుటుంబంలో పుట్టి, ఎంబీఏలో గోల్డ్‌మెడల్‌ సైతం సాధించారు. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న సమయంలో.. ఒక రైతు సాగుచేస్తున్న తైవాన్‌ జామ తోట అమితంగా ఆకర్షించింది. ఆ రైతును సంప్రదించి, పంట వివరాలు తెలుసుకున్నారు. మరింత సమాచారం కోసం అంతర్జాలం, యూట్యూబ్‌లో శోధించారు. ఉద్యోగానికి స్వస్తి పలికి, సాగువైపు సాగారు. మూస పద్ధతులకు స్వస్తి పలికి, సేద్యంలో ఆధునిక విధానాలను ఆచరిస్తున్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందాలనే ఉద్దేశంతో.. సేంద్రియ విధానంలో సాగుకు సిద్ధమయ్యారు.

- న్యూస్‌టుడే, రామసముద్రం

 

సాగు ఇలా..
సింగంవారిపల్లెకు చెందిన తన బావ పొలంలో మూడెకరాల్లో తైవాన్‌ హైబ్రిడ్‌ పింక్‌ (ఎరుపు) రకం జామను సాగుచేసి అధిక దిగుబడులు, లాభాలను పొందుతూ యువతరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వరుసల మధ్య పది అడుగులు, మొక్కల మధ్య ఆరు అడుగుల ఎడం ఉండేలా, అడుగులోతు గుంతలు తీశారు. ఈ గుంతల్లో 5 కిలోల మాగిన పశువుల ఎరువు, కిలో చొప్పున వేప, కానుగ పిండిలను గుంత నుంచి తీసిన మట్టికి కలిపి, తిరిగి గుంతలను నింపారు. గోతిలో ఎరువులు మాగిన తర్వాత వారం రోజులకు మొక్కలను నాటారు. ఎకరానికి 725 మొక్కలు చొప్పున నాటారు. బిందు (డ్రిప్‌) పద్ధతిలో మొక్కలకు నీరందిస్తున్నారు. మొక్కలు నాటేందుకు రూ.5 వేలు, బిందుసేద్యానికి రూ.50 వేలు, పొలం చుట్టూ పంట సంరక్షణకు సోలార్‌ కంచె నిర్మాణానికి రూ.40 వేలు వ్యయం చేశారు.

మొక్కల కొనుగోలు : తొలుత 200 మొక్కలను (మొక్క రూ.36 చొప్పున) రాజమండ్రి నుంచి తెప్పించారు. తర్వాత అవసరమైన మిగతా మొక్కలన్నింటినీ అశ్వారావుపేట నుంచి (మొక్క రూ.26 చొప్పున) కొనుగోలు చేశారు. ఇవన్నీ క్లోనింగ్‌ పద్ధతిలో పెంచిన మొక్కలు. ఇవి ఏడాదిలో ఎక్కువ రోజులు కాపునిస్తాయని రైతు పేర్కొన్నారు. ఒక్కో కాయ గరిష్ఠంగా 700 గ్రా. కనిష్ఠంగా 300-400 గ్రా. బరువుంటాయన్నారు. తైవాన్‌ తెలుపు రకాల కన్నా వీటి రుచి బాగుంటుందన్నారు.
 

దిగుబడి : మొక్కలు నాటిన తొమ్మిది నెలలకే పంట చేతికొచ్చింది. తొలుత ప్రతి మొక్క నుంచి 4-5 కిలోల చొప్పున దిగుబడి మొదలైంది. ప్రస్తుతం 8-10 కిలోల వరకు దిగుబడి వస్తోంది.

మార్కెటింగ్‌ : పండించిన పంటను హైదరాబాద్‌లో అపార్ట్‌మెంట్లలో ఉండే వారికి ఆన్‌లైన్‌లో ఆర్డర్లను స్వీకరించి సొంతంగా విక్రస్తున్నారు. ప్రతి వారం పంట కోత చేపట్టి వినియోగదార్లకు సరఫరా చేస్తున్నారు. కిలో జామ కాయలకు రూ.120 వరకు ధర లభిస్తోందని తెలిపారు.

 


సస్యరక్షణ
* సేంద్రియ పదార్థాలతో తయారు చేసిన కషాయాలను ఉపయోగిస్తూ చీడపీడలను నివారిస్తున్నారు. 200 లీటర్ల నీటిలో.. ‘వేస్ట్‌ డీకంపోసర్‌’ 20 మి.లీ. (ధర రూ.20) + రెండు కిలోల నల్లబెల్లం కలిపిన మిశ్రమాన్ని వారం రోజులు పులియబెట్టాలి. 25 లీటర్ల ఈ మిశ్రమాన్ని 75 లీటర్ల నీటికి కలిపి వారానికి ఒకసారి చెట్లపై పిచికారీ చేస్తున్నారు.
* వర్షాలు పడే సమయంలో పురుగుల బెడద ముఖ్యంగా.. ఊజి పురుగు సమస్య పెరుగుతుంది. వీటి నివారణకు.. 3 కిలోల చొప్పున సీతాఫలం ఆకు, వావిలాకు, ఆకురోజా ఆకులు (కాగితం పూల చెట్టు) ఈ మూడింటిని ముక్కలుగా కత్తిరించాలి. 7-8 లీటర్ల వేస్ట్‌ డీకంపోసర్‌ ద్రావణంలో ఈ ఆకులను వేసి రాత్రంతా నానబెట్టాలి. ఈ మిశ్రమాన్ని మరుసటి ఉదయం ఒక కుండలో పోసి మూడు పొంగులు వచ్చే వరకు మరిగించి, చల్లార్చి వస్త్రంతో వడకట్టాలి. ఈ ద్రావణాన్ని లీటరు నీటికి 10 మి.లీ. చొప్పున కలిపి సాయంత్రం పూట పిచికారీ చేయాలి.
* చీడ పురుగులు, కీటకాల నివారణకు.. ఎకరానికి 40 జిగురు అట్టలు, పది చొప్పున పండు ఈగలను ఆకర్షించే ఎరలను తోటలో ఏర్పాటు చేయడం ద్వారా రెక్కల పురుగుల సంతతిని    అరికడుతున్నారు.


రాబడి

మొత్తం సాగు ఖర్చు రూ.రెండున్నర లక్షలు కాగా, తొలిదశలోనే సుమారు రూ.పది లక్షల వరకు రాబడి వచ్చింది. పెట్టుబడి పోను రైతుకు ఇప్పటివరకు సుమారు రూ.ఏడున్నర లక్షల లాభం వచ్చింది. కాలానుగుణంగా మొక్కల ఎదుగుదలతో దిగుబడి మరింత పెరుగుతుందని రైతు పేర్కొన్నారు.


ఆధునిక పద్ధతులతో లాభాలే
లోకేష్‌రెడ్డి, రైతు, మిట్టఎంబాడి (చరవాణి : 81216 15158)

సాగులో మూస పద్ధతులకు స్వస్తి పలకాలి. మేలైన పంట రకాలను ఎంపిక చేసుకొని, ప్రణాళిక బద్ధంగా ఆధునిక పద్ధతుల్లో సాగుచేయాలి. దీర్ఘకాలికంగా దిగుబడులిచ్చే హైబ్రిడ్‌ రకాల పండ్ల తోటల పెంపకం చేపట్టాలి. సేంద్రియ (ఆర్గానిక్‌) పద్ధతులను ఆచరిస్తే, ఖర్చు తగ్గి, నాణ్యమైన దిగుబడులు వస్తాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఆర్గానిక్‌ పండ్లకు, పంట ఉత్పత్తులకు మంచి డిమాండ్‌ ఉంది. అందుకే తైవాన్‌ జామను ఆర్గానిక్‌ పద్ధతిలో సాగు చేస్తూ.. హైదరాబాద్‌లోని అపార్ట్‌మెంట్‌ వాసులకు ఎగుమతి చేస్తున్నా. మంచి ధర గిట్టుబాటవుతోంది. 


పండ్లలో జామ సాగు మేలు
ఉమాదేవి, ఉద్యానాధికారిణి, మదనపల్లె (చరవాణి: 79950 86954)

జామను నీరుంటే బిందుసేద్యం కింద లేక వర్షాధారంగానూ సాగు చేయవచ్చు. సాగునీటి పద్ధతిలో తోట జీవితకాలంతో పాటు దిగుబడి బాగుంటుంది. ఈ పంట సాగులో తెగుళ్ల సమస్య పెద్దగా ఉండదు. పండు ఈగలు కాయలపై దాడి చేస్తాయి. వీటి నివారణకు చేలో అక్కడక్కడ లింగాకర్షణ బుట్టలు పెట్టాలి. జామ తోటలు 18-25 ఏళ్ల వరకు దిగుబడులను ఇస్తాయి. మామిడి, దానిమ్మతో పోల్చితే జామసాగు లాభదాయకం.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.