close
కందిలో సస్యరక్షణ

న్యూస్‌టుడే, కురుపాం గ్రామీణం

ప్రస్తుతం కంది పంటను ఆశించే కాయతొలుచు పురుగు, మారుకా మచ్చల పురుగుల నివారణ చర్యలను విజయనగరం రస్తాకుంటుబాయి ప్రొగ్రామ్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ కె.తేజేశ్వరరావు (సెల్‌: 94930 84826) తెలిపారు. రబీలో విత్తిన కంది జనవరిలో పూతకు వస్తుంది. ఈ సమయంలో పురుగుల తాకిడి పెరిగి పంటకు నష్టం వాటిల్లుతుంది.

ఆకుచుట్టు పురుగు : ఇది పంట పెరిగే దశలో ఆశిస్తుంది. ఆకులను, పూతను చుట్టి, లోపల ఉండి గీరి తింటుంది. దీని నివారణకు లీటరు నీటికి 1.6 మి.లీ. మోనోక్రోటోఫాస్‌ లేదా 2 మి.లీ. క్వినాల్‌ఫాస్‌ చొప్పున కలిపి పైరుపై పిచికారీ చేయాలి.
శనగపచ్చ పురుగు : ఇది కాయలకు రంధ్రాలు చేసి గింజలను తింటుంది. ఒక కాయ నుంచి మరో కాయకు చేరి నష్టం కలిగిస్తుంది. నివారణకు సమగ్ర సస్యరక్షణ పాటించాలి..
* ముందస్తు చర్యల్లో భాగంగా వేసవిలో లోతు దుక్కి చేస్తే.. నేలలో ఉండే పురుగు కోశస్థ దశలు నశిస్తాయి.
* ఈ పురుగు తక్కువగా ఆశించే జొన్న, సోయాచిక్కుడు, నువ్వులు, మినుము, ఉలవ, మెట్ట వరి పంటలతో పంటమార్పిడి చేయాలి.
* కందిలో అంతర పంటగా పెసర లేదా మినుములను ఖరీఫ్‌లో 7 సాళ్లు, రబీలో 3 సాళ్లు చొప్పున సాగు చేయాలి. పొలం చుట్టూ 4 సాళ్లు జొన్నను రక్షక పంటగా విత్తాలి.
* పచ్చ పురుగును తట్టుకునే ఐ.సి.పి.ఎల్‌-332, ఎల్‌.ఆర్‌.జి-41 రకాలను విత్తాలి లేదా పురుగు ఆశించినప్పటికీ తిరిగి పూతకు రాగల ఎల్‌.ఆర్‌.జి-30, ఎల్‌.ఆర్‌.జి-38 రకాలను విత్తాలి.
* కంది పైరు మూడు నెలల దశలో మొక్కల చిగుళ్లను అడుగు మేర కత్తిరించాలి.
* ఎకరాకు 4 లింగాకర్షణ బుట్టలను చేలో అమర్చాలి.
* ఎకరాకు 20 పక్షి స్థావరాలను (పంగల కర్రలు) ఏర్పాటు చేయాలి.
* పురుగు గుడ్లను, తొలి దశ పురుగులను గమనించిన వెంటనే లీటరు నీటికి 50 మి.లీ. వేప గింజల కషాయాన్ని లేదా 5 మి.లీ. వేపనూనె + అర మి.లీ. జిగురు (సాండోవిట్‌) కలిపి పిచికారీ చేయాలి.
* ఎకరాకు 200 లార్వాలకు సమానమైన ఎన్‌.పి.వి ద్రావణాన్ని లేదా 400 గ్రా. బ్యాక్టీరియా సంబంధమైన (బి.టి) మందును 200 లీటర్ల నీటిలో కలిపి వారం రోజుల వ్యవధితో పైరుపై రెండుసార్లు సాయంత్రం పూట పిచికారీ చేయాలి.
* ఎదిగిన పురుగులను ఏరివేయాలి లేదా నేలపై పాలిథీన్‌ కవర్లను పరిచి, చెట్లను బాగా ఊపి అందులో పడిన పురుగులను కాల్చివేయాలి.
* రసాయన పురుగు మందులను విచక్షణ రహితంగా వాడకూడదు. అవసరం మేరకు సూచించిన మోతాదులోనే వాడాలి.

మారుకా మచ్చల పురుగు : ఇది లేతాకులు, పూత, పిందెలు, కాయలను దగ్గరకు చేర్చి గూడులా చేస్తుంది. ఈ గూడు లోపల ఉండి కాయలకు రంధ్రం చేసి లోపలి గింజలను తింటుంది. నివారణకు 10 లీటర్ల నీటికి.. క్లోరిపైరిఫాస్‌ 25 మి.లీ లేదా ఎసిఫేట్‌ 10 గ్రా. లేదా థయోడికార్బ్‌ 10 గ్రా. లేదా నొవాల్యురాన్‌ 10 మి.లీ. లేదా ల్యాండా సైహలోత్రిన్‌ 10 మి.లీ. లేదా స్పైనోసాడ్‌ 3 మి.లీ. లేదా ప్లుబెండిఎమైడ్‌ 2 మి.లీ. లేదా క్లోరాంత్రనిలిప్రోల్‌ 3 మి.లీ. వీటిలో ఏదో ఒక మందుతోపాటు డైక్లోరోవాస్‌ 10 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ఉధృతి అదుపులోకి రాకుంటే.. మందులను మార్చి వారం రోజులకోసారి పిచికారీ చేయాలి.

కాయ ఈగ : తల్లి పురుగు లేత పిందె దశలో కాయలపై గుడ్లను పెడుతుంది. ఇది ఆశించినప్పుడు నష్టం బయటకు కనిపించదు. దీని పిల్ల పురుగులు కాయ లోపలే ఉండి గింజలను తింటాయి. దీని నివారణకు పిందె దశలో లీటరు నీటికి 50 మి.లీ. వేప గింజల కషాయాన్ని పిచికారీ చేసి పిందెలపై ఈగ గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. గింజ గట్టిపడే దశలో 10 లీటర్ల నీటికి.. మోనోక్రోటోఫాస్‌ 16 మి.లీ. లేదా డైమిథోయేట్‌ 20 మి.లీ. లేదా థయోక్లోప్రిడ్‌ 7 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.