close
వరికి సిలికాన్‌ ప్రాధాన్యం!

ఇతర పోషకాలతోపాటు వరి పైరుకు సిలికాన్‌ ధాతువు అవసరం ఉంటుంది. ఈ పంట నత్రజని, భాస్వరం, పొటాష్‌ పోషకాల కన్నా సిలికాన్‌ను ఎక్కువగా తీసుకుంటుంది. వరి, చెరకు ఆకుల్లో 4 నుండి 7 శాతం వరకు సిలికాన్‌ ఉంటుంది. పప్పుదినుసు పంటల్లో ఈ ధాతువు 1.5 శాతం వరకు మాత్రమే ఉంటుంది. సారం తక్కువ గల నేలలు, క్షీణించిన నేలలు, గాలి ఉధృతి ఎక్కువగా ఉండే నేలలు, తక్కువ వర్షపాతం గల ఎత్తు, లోతట్టు ప్రాంతాల్లో సిలికాన్‌ లభ్యత తక్కువగా ఉంటుంది. ఒండ్రు నేలల్లో సిలికాన్‌ లోపిస్తే.. నేలలో విషపూరిత ధాతువుల గాఢత పెరుగుతుంది. దీంతో పంట దిగుబడులు క్షీణిస్తాయి.

ప్రయోజనాలు
* సిలికాన్‌ ఆకులను దృఢపరిచి, నిటారుగా ఉండేలా చేస్తుంది. దీంతో ఆకుల్లో కిరణజన్య సంయోగక్రియ అధికమవుతుంది. పిండి పదార్థాలు బాగా తయారవుతాయి. దీంతో మొక్కల ఎదుగుదల బాగుండి, బరువైన గింజలు వస్తాయి. ఫలితంగా పంట దిగుబడులు పెరుగుతాయి.
* ఈ ధాతువు తగినంత అందిన వరిలో అగ్గితెగులు, మెడవిరుపు తెగులు, కాండంతొలుచు పురుగుల బెడద తగ్గుతుందని పరిశోధనల్లో వెల్లడైంది.
* ఇది వరిలో అమోనియం వృద్ధిని ప్రోత్సహించడం వల్ల వ్యాధి సంక్రమణ, తెగుళ్ల వ్యాప్తి అదుపులో ఉంటుంది.
* వరి పొలాల్లో నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండే పరిస్థితుల్లో.. చేలో మాంగనీస్‌, ఇనుము, సల్ఫర్‌ ధాతువుల గాఢత పెరుగుతుంది. ఈ పరిస్థితి వరి వేర్లకు ప్రమాదకరం. ఈ సమయంలో.. సిలికాన్‌ వరి వేర్లలో ఆక్సీకరణ సామర్థ్యాన్ని పెంచి, విషపూరిత ధాతువుల శోషణను తగ్గిస్తుంది.

* వరి ఆకులపై సిలికాన్‌ ఒక పొరను ఏర్పరచి, ఆకుల నుంచి నీరు ఆవిరి కావడాన్ని (పత్ర స్వేదనం) నియంత్రిస్తుంది. దీంతో మొక్కలు నీటి ఎద్దడిని తట్టుకుంటాయి.
* నత్రజని అధిక వినియోగంతో పైరు ఏపుగా పెరిగి, మొక్కలు వాలిపోయి దిగుబడి తగ్గుతుంది. సిలికాన్‌, కాల్షియంలు తగినంత అందుబాటులో ఉన్న చేలలో ఈ సమస్య తలెత్తదు.
* భాస్వరం ఎరువుకు మట్టిలో కలిసిపోయి మొక్కలకు అందకుండా పోయే గుణం ఉంది. సిలికాన్‌ దీన్ని అరికట్టి, మొక్కలకు భాస్వరం లభ్యతను పెంచుతుంది.
* ఈ ధాతువు తగినంత ఉన్న చేలలో 20 శాతం వరకు దిగుబడి పెరగడంతో పాటు నీటి వినియోగం 10 శాతం వరకు తగ్గుతుంది.

ఇలా అందించాలి
* వరిగడ్డిలో 4-20 శాతం సిలికాన్‌ ఉంటుంది. దీన్ని ట్రైకోడెర్మా శిలీంధ్రంతో కలిపి దుక్కిలో కలియదున్నాలి. వరిపొట్టులోనూ 9-26 శాతం వరకు సిలికాన్‌ ఉంటుంది. దీన్ని సైతం నేలలో కలియదున్నవచ్చు.
* ‘ఫ్లైయాష్‌’ అందుబాటు ఉన్న రైతులు, దీన్ని పొలంలో వేయడం ద్వారా నేలలో సిలికాన్‌ లభ్యతను పెంచవచ్చు.
* నారు నాటే పద్ధతిలో వరిసాగు చేసే రైతులు లేదా పొలంలో నేరుగా విత్తనాలు విత్తే రైతులు.. నెల రోజుల ముందే సిలికాన్‌ను నేలకు అందించే చర్యలు చేపడితే ప్రయోజనం ఉంటుంది.
- భాగ్యరాజీ.నేతల

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.