close
వేసవి పంటగా ఉల్లి సాగు

న్యూస్‌టుడే, బొండపల్లి

వేసంగి పంటగా ఉల్లిని జనవరి-ఫిబ్రవరి మాసాల్లో నాటవచ్చు. ఈ పంటకు నీటి అవసరం తక్కువే.. కనుక సాగునీరు పరిమితంగా ఉన్న రైతులు బిందు, తుంపర నీటిపారుదల పద్ధతులను ఆచరించి నాణ్యమైన అధిక దిగుబడి పొందవచ్చని విజయనగరం, ఉద్యానశాఖ సంయుక్త సంచాలకులు ఆర్‌.శ్రీనివాసరావు (సెల్‌: 79950 86762) తెలిపారు.
అనువైన రకాలు : అగ్రిఫౌండ్‌ లైట్‌రెడ్‌, అర్కనికేతన్‌, అర్క ప్రగతి, ఎన్‌-53, బీమ సూపర్‌.
నారు పెంపకం : ఎకరానికి 3-4 కిలోల విత్తనం సరిపోతుంది. ఎత్తు మడులపై 200-250 చ.మీ. విస్తీర్ణంలో పెంచిన నారు ఎకరాలో నాటేందుకు సరిపోతుంది. బెడ్లను 100-120 సెం.మీ. వెడల్పు, 15 సెం.మీ. ఎత్తు, సరిపడినంత పొడవుతో తయారు చేయాలి. విత్తనశుద్ధి తప్పనిసరిగా చేయాలి. ఇందుకోసం.. కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున కాప్టాన్‌ లేదా కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ కలిపి శుద్ధి చేయాలి. విత్తనాన్ని 10 సెం.మీ. ఎడం ఉండేలా వరుసల్లో విత్తి, ఎండుగడ్డి కప్పాలి. మొలకెత్తిన తర్వాత గడ్డిని తీసివేయాలి. రసంపీల్చే పురుగు ఆశించకుండా సెంటు నారుమడికి ఫిప్రోనిల్‌ గుళికలు 160 గ్రాముల చొప్పున చల్లి నీరు పారించాలి. 30 నుంచి 45 రోజుల వయసున్న నారును నాటాలి.
ప్రధాన పొలం తయారీ : 2-3 సార్లు పొలాన్ని మెత్తగా దున్నాలి. ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు, భాస్వరం పోషకాన్ని సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌ రూపంలో 200 కిలోల చొప్పున వేయడం వల్ల గడ్డలకు గంధకం, కాల్షియం అదనంగా అందుతుంది. 60 కిలోల యూరియా, 15 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌లను ఆఖరి దుక్కిలో వేయాలి. జీవన ఎరువులైన.. అజోస్పయిరిల్లం, సూడోమోనాస్‌, ట్రైకోడెర్మా విరిడిలను 2 కిలోల చొప్పున 100 కిలోల మాగిన పశువుల ఎరువుతో కలిపి 10-15 రోజులు మాగబెట్టి నాట్లువేసే ముందు తడినేలపై వెదజల్లాలి. 120 సెం.మీ. వెడల్పు, 15 సెం.మీ. ఎత్తు మడులు చేయాలి. మడుల మధ్య 45 సెం.మీ. ఎడం ఉండాలి. ఈ మడులపై 30×15 సెం.మీ. ఎడంతో మొక్కలను నాటాలి.
కలుపు నివారణ : నారు నాటే ముందు లేదా నాటిన వారం తర్వాత.. ఎకరానికి 200-300 మి.లీ. ఆక్సీఫ్లోర్‌ఫిన్‌ (23.5 శాతం ఇ.సి)ను 200 లీటర్ల నీటిలో కలిపి తడినేలపై పిచికారీ చేస్తే.. నెల వరకు కలుపు రాదు. గడ్డిజాతి కలుపు 2-4 ఆకుల దశలో ఉన్నప్పుడు ఎకరానికి ప్రొపాక్విజాపాస్‌ (10 శాతం ఇ.సి) పావు లీటరు పిచికారీ చేయాలి. నాటిన 30-45 రోజుల తర్వాత ఉండే కలుపును కూలీలతో తీయించి నేలను కలియబెట్టాలి.

నీటి పారుదల,  ఎరువులు : నాటిన 6-7 రోజులకు నీటితడివ్వాలి. కలుపు తీత తర్వాత 30, 60 రోజులకు.. ఎకరానికి 60 కిలోల యూరియా, 15 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ చొప్పున వేయాలి. పంట 45, 60 రోజులప్పుడు లీటరు నీటికి సూక్ష్మపోషకాల మిశ్రమం 5 గ్రా. + పాలీఫిడ్‌ (19:19:19) 5 గ్రా. చొప్పున కలిపి రెండు సార్లు పిచికారీ చేయాలి.
డ్రిప్‌, ఫెర్టిగేషన్‌ పద్ధతి : ఈ పద్ధతులను ఆచరిస్తే.. 15-20 శాతం దిగుబడి పెరుగుతుంది. 35-40 శాతం నీరు, 25-30 శాతం కూలీల ఖర్చు తగ్గుతుంది.
*ఫెర్టిగేషన్‌ పద్ధతిలో.. పంట నాటిన పది రోజుల నుంచి ఎకరానికి 120 కిలోల యూరియా, 30 కిలోల నీటిలో కరిగే పొటాష్‌ (తెలుపు రంగు ఎరువు)ను ఏడు సమభాగాలుగా చేసి వారానికోసారి చొప్పున 60 రోజుల వరకు వెంచురీ లేదా ఫెర్టిగేషన్‌ ట్యాంకు ద్వారా బిందు పద్ధతిలో అందించాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.