close
ఈ తండాకు.. కూరగాయలే అండ!

బిందు, మల్చింగ్‌ పద్ధతిలో సాగు
కొనుగోలుకు చేల వద్దకే దళారులు

అదో గిరిజన తండా... నేలతల్లే వారికి కొండంత అండ.. కలం పట్టకపోయినా, హలంపై పట్టు సాధించారు. గతంలో ఇక్కడి రైతులు వాణిజ్య పంటలు సాగుచేసి గిట్టుబాటుకాక సేద్యాన్నే విరమించుకున్నారు. కొన్నాళ్ల తర్వాత కూరగాయల సాగుతో కొత్త పుంతలు తొక్కారు. నీటివసతి పెద్దగా లేకపోయినా నూతన ఒరవడి సృష్టించారు. బోర్లని నమ్ముకుని బొప్పాయి సాగు చేశారు. బిందు పద్ధతిలో బంతి వేశారు. మల్చింగ్‌తో మిరప పండించారు. మునగ చెట్లతో ముందడుగు వేశారు. చేదు కాకరలో తీపి లాభాలు పొందారు.
- గంధం మహేశ్వరరావు (ఈనాడు జర్నలిజం స్కూల్‌)
- న్యూస్‌టుడే, రఘునాథపాలెం
ఖమ్మం జిల్లా, రఘునాథపాలెం మండలం, సూర్యాతండా ఓ కుగ్రామం. జనాభా 500 లోపే.. అందరు గిరిజనులే. దశాబ్ద కాలం నుంచి ఈ గ్రామంలో ఎక్కడ చూసిన కూరగాయలు, పండ్ల సాగే కనిపిస్తుంది. అంతా వర్షాధారమే. ఈ పరిస్థితుల్లో.. సాగులో ఆధునిక పద్ధతులను ఆచరిస్తూ సిరులు పండిస్తున్నారు.


నేపథ్యం..
గతంలో వరి, మొక్కజొన్న, పత్తి పంటలు విత్తినప్పుడు.. పంట కీలక దశల్లో భూగర్భ జలాలు అడుగంటి నష్టాల పాలయ్యారు. పట్టణాలకు వలస కూలీలుగా వెళ్లారు. ఈ నేపథ్యంలో.. ఆంగోతు సక్రుకు వచ్చిన ఆలోచన మిగతా వారి జీవితాల్లోనూ వెలుగులు నింపింది. వలసలను నివారించింది. బోరులో వచ్చే కొద్దిపాటి నీటి ద్వారా ఈ రైతు బొప్పాయ సాగు చేశాడు. మడుల పద్ధతికి స్వస్తిచెప్పి, బిందుసేద్యాన్ని ఎంచుకున్నాడు. ఎత్తుమడులు చేసి దానిపై ప్లాస్టిక్‌ పేపర్‌ (మల్చింగ్‌ షీట్‌) పరిచి, షీట్‌ కింద డ్రిప్‌ పైపులను అమర్చాడు. దీంతో నీటి వృథా, కలుపు బెడద తగ్గింది. నాణ్యమైన, అధిక దిగుబడులు వచ్చాయి. ఒకప్పుడు బీడుగా ఉన్న భూములు నేడు పచ్చని పైర్లతో కళకళలాడుతున్నాయి. ఉన్న ఊరిలో వ్యవసాయానికి భూమి దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో పక్క ఊరిలో భూములను కౌలుకు తీసుకొని పంటలను పండిస్తున్నారు. ప్రస్తుతం చిక్కుడు, టమాట, బీర, మునగ, కాకర, పచ్చిమిర్చి వంటి 15 రకాల పంటలను సాగు చేస్తున్నారు. వీటిలో పాటు బొప్పాయి, పుచ్చ, కర్బూజ, జామ తోటలను పెంచుతున్నారు. మునగలో అంతర పంటగా టమాట సాగు చేస్తున్నారు.


నీటి వనరుల సద్వినియోగం
గతంలో మాదిరిగా నీటిని కాల్వల ద్వారా పారించకుండా అవసరం మేరకు బిందుపద్ధతిలో అందిస్తుండటం వల్ల గతంలో ఎకరానికి సరిపడే నీటితో ఇప్పుడు పదెకరాల్లో పంటలను పండిస్తున్నారు. గతంలో రెండు బోర్లతో ఐదెకరాలు సాగు చేయడం కష్టమైన రైతులు నేడు ఒక బోరుతోనే ఐదెకరాల్లో పంటలను తీస్తున్నారు. దీంతో కరెంటు కూడా ఆదా అవుతుంది. నీటి వృథా తగ్గి, భూగర్భ జలాలు పెరిగాయి.
పంట విక్రయం.. : ఖమ్మంలోని రైతు బజార్లలో స్వయంగా విక్రయిస్తుంటారు. దిగుబడి బాగా పెరిగినప్పుడు.. మార్కెట్లో వ్యాపారులకు అమ్ముతారు. ప్రసుత్తం బొప్పాయి సాగు బాగా పెరిగింది. దీని కోసం దిల్లీ, బెంగళూరు నుంచి వ్యాపారులు వచ్చి పంటను కొనుగోలు చేసి, వారే ప్యాకింగ్‌ చేసుకొని లారీల్లో తీసుకు వెళ్తున్నారు.
పంటల సరళి : సీజన్‌కు అనుగుణంగా కూరగాయలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం టమాట విత్తారు. ఈ పంట పూర్తయ్యే రెండు వారాల ముందు చిక్కుడు, బెండ, దోస, కాకర, కర్బూజ వంటి పంటలను సాగు చేస్తారు. మరికొందరు వేసవిలో డిమాండ్‌ ఉండే పుచ్చను పండిస్తారు.
నేర రహిత గ్రామంగా.. : గతంలో పోల్చితే.. నేడు ఈ గ్రామంలో గొడవలు, కొట్లాటలు, దొంగతనాలు లేవు. కూరగాయల సాగు లాభసాటిగా ఉండటమే దీనికి కారణం. పొద్దంతా పొలాల్లోనే గడుపుతూ ప్రశాంత జీవనం గడుపుతున్నారు. చేతినిండా పనులుండటంతో చెడు వ్యసనాలకు దూరంగా ఉంటున్నారు. నిత్యం పంటల సాగుతో ఆర్థిక ప్రగతి సాధించారు. పిల్లలను పట్టణాల్లో చదివిస్తున్నారు.


తొలి అడుగు నాదే.. : ఆంగోతు సక్రు, ఆదర్శ రైతు, సర్పంచి, సూర్యాతండా 2006లో బొప్పాయి సాగు చేశాను. ప్రారంభంలోనే మంచి దిగుబడి వచ్చింది. సాగుపై అవగాహన ఏర్పడింది. ఆధునిక పద్ధతులను ఆచరించాను. మూడుసార్లు ‘ఆదర్శ రైతు’ అవార్డు అందుకున్నాను. క్రమంగా మిగతా రైతులూ సాగువైపు మొగ్గు చూపారు. ప్రస్తుతం 25 ఎకరాల్లో బొప్పాయి, 15 ఎకరాల్లో టమాటా, 10 ఎకరాల్లో దోస సాగు చేశాను. పక్క గ్రామంలో 45 ఎకరాలు కౌలుకు తీసుకొని బొప్పాయి, కూరగాయలను సాగు చేశాను. బిందు పద్ధతిలో నీరందిస్తున్నాను. బొప్పాయికి మంచి డిమాండ్‌ ఉండటంతో ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు.


రైతుబజార్‌లో విక్రయిస్తాం
భుక్యా కాంతి, మహిళా రైతు, సూర్యాతండా

3 ఎకరాల పొలంలో టమాటా, చిక్కుడు, వంకాయ, మిర్చి సాగుచేశాం. మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకున్నాం. నేను, నా భర్త, కొడుకు పొలంలో కష్టపడతాం. మరో ముగ్గురు కూలీలకు ఉపాధి కల్పిస్తున్నాం. పండించిన కూరగాయలను రైతుబజార్‌లో స్వయంగా విక్రయిస్తున్నాం. కూరగాయల సాగులో ఆర్థికంగా నిలదొక్కుకున్నాం. 


సాగు ఖర్చు తగ్గించారు
జి.అనసూయ, జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ సమన్వయాధికారి
(చరవాణి: 99591 33695)

సూర్యాతండా రైతులు ఏడాదిలో 2-3 పంటలు సాగు చేయడం వల్ల దుక్కి దున్నే అవసరం లేక సాగు ఖర్చు భారీగా తగ్గింది. అంతర పంటల సాగు పద్ధతిలో ఒకేసారి మూడు పంటలు తీస్తున్న రైతులూ ఉన్నారు. కొందరు రైతులు ‘స్టేకింగ్‌’ (మొక్కలకు ఊతం ఏర్పాటు)కు దరఖాస్తు చేశారు. ప్రభుత్వం ఈ ప్రక్రియకు రాయితీ ఇవ్వడం లేదు. శాశ్వత పద్ధతులైన పందిరి సాగుకు ప్రభుత్వం రాయితీ ఇస్తోంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.