close
మొక్కజొన్నను కబళిస్తున్న కత్తెర!

అదుపునకు శాస్త్రవేత్తల సూచనలు
న్యూస్‌టుడే, ఖమ్మం (వ్యవసాయం)

రబీలో అధిక విస్తీర్ణంలో సాగు చేసిన మొక్కజొన్న పంటను కత్తెర పురుగు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది. దీన్ని సకాలంలో నివారించకపోతే.. మొత్తం పంటను కోల్పోవాల్సి వస్తుంది. ఈ పురుగు నివారణకు రైతులు సకాలంలో యాజమాన్య పద్ధతులను పాటించాలని ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ జే.హేమంత్‌కుమార్‌, శాస్త్రవేత్తలు (సెల్‌: 99896 23831) డాక్టర్‌ కె.రవికుమార్‌, డాక్టర్‌ పి.శ్రీరంజిత తెలిపారు.
నష్టపరిచే విధానం..
* ఈ పురుగు లార్వా దశలో ఆకులను, కాండాల్ని తిని నష్టపరుస్తుంది. మొదటి దశలో ఉన్న లార్వాలు ఆకుల పత్రహరితాన్ని గోకి తినడం వల్ల ఆకులపై తెల్లని పొర ఏర్పడుతుంది. లార్వాలు పెరుగుతున్న కొద్దీ ఆకులను కత్తిరించి తింటాయి.
* రెండు, మూడో దశ లార్వాలు ఆకు సుడుల్లో ఉండి రంధ్రాలు చేస్తూ తింటాయి. దీంతో ఆకులు విచ్చుకున్న తర్వాత వాటిపై వరుసగా రంధ్రాలు కన్పిస్తాయి.
* లద్దె పురుగులు (ఎదిగిన లార్వాలు) ఉధృతంగా ఉన్న చేలల్లో.. మొక్కల్లో కేవలం కాండాలు మాత్రమే మిగులుతాయి.
* ఈ పురుగుకు చెందిన తల్లి రెక్కల పురుగు రోజుకు 100 కి.మీ. దూరం ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇవి జొన్న, వేరుసెనగ, పొద్దుతిరుగుడు తదితర పంటలను కూడా ఆశిస్తాయి.

ముందు జాగ్రత్త చర్యలు
* విత్తేముందు లోతు దుక్కి చేయాలి. దీంతో నేలలో ప్యూపా దశ పురుగులు ఎండవేడికి చనిపోతాయి లేదా పక్షులకు ఆహారమవుతాయి.
* ఒక్కో తల్లి రెక్కల పురుగు 1500-2000 వరకు గుడ్లు పెడుతుంది. ప్యూపాలను నాశనం చేయడం ద్వారా తల్లి పురుగులను అరికట్టవచ్చు.
* మొక్కజొన్నలో కందిని అంతర పంటగా విత్తడం ద్వారా పురుగు ఉద్ధృతిని తగ్గించడమే కాకుండా కంది పంట ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.
* సిఫారసు చేసిన మోతాదులోనే ఎరువులను వినియోగించాలి.
* పంట విత్తడం ఆలస్యమైతే.. పంట తొలి దశలో (నెల రోజులు వరకు) వారానికోసారి లీటరు నీటికి 50 మి.లీ. (5 శాతం) వేప కషాయం లేదా వేపనూనె లీటరు నీటికి 5 మి.లీ. + అర మి.లీ. సాండోవిట్‌ లేదా అప్స కలిపి పైరుపై పిచికారీ చేయాలి.
* ఎకరాకు 10-15 లింగాకర్షక బుట్టలను పైరులో అడుగు ఎత్తులో ఉండేలా అమర్చాలి. ఎకరానికి 10 పక్షి స్థావరాలను (పంగల కర్రలను) ఏర్పాటు చేయాలి.
* పైరు నాటిన 15 రోజుల వరకు కలుపు నివారణ చర్యలు చేపట్టాలి.

విత్తిన నెల తర్వాత..
* పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉంటే, పది లీటర్ల నీటికి క్లోరాంత్రనిలిప్రోల్‌ 4 మి.లీ. లేదా స్పైనిటోరమ్‌ 5 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
* ఎకరానికి పది కిలోల చొప్పున పొడి ఇసుక, సున్నం 9:1 నిష్పత్తిలో కలిపి ఆకుల సుడుల్లో వేస్తే ఇసుక రాపిడికి లార్వాలు చనిపోతాయి.
* అవసరాన్ని బట్టి మందులను మార్చి పిచికారీ చేయాలి. ఎదిగిన లార్వాల నివారణకు.. విషపు ఎరలను తయారుచేసి వినియోగించాలి.
విషపు ఎర తయారీ.. ఎకరానికి 10 కిలోల తవుడు + 2 కిలోల బెల్లానికి 2-3 లీటర్ల నీరు కలిపి 24 గంటలపాటు పులియబెట్టాలి. వాడే అరగంట ముందు ఈ మిశ్రమానికి 100 గ్రా. థయోడికార్బ్‌ కలిపి ఉండలుగా చేసిన విషపు ఎరలను మొక్కల సుడిలో వేయాలి.
* 65 రోజుల దశ నుంచి పంటకు ఈ పురుగును తట్టుకునే శక్తి సమకూరుతుంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.