close
పందిరి పద్ధతిలో అరటి సాగు!

అనుభవం నేర్పిన పాఠాలతో అరటి సాగులో ఖర్చును తగ్గించే మార్గాలను ఆచరిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా కె.గంగవరం మండలానికి చెందిన రైతు అల్లూరి సూర్యనారాయణరాజు. రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల అధిక వినియోగం వల్ల భూసారంతో పాటు పంట దిగుబడి తగ్గుతోంది. సేంద్రియ సాగులో కాయ దిగుబడితో పాటు పంటకాలం పెరుగుతుంది. తదనుగుణంగా పంట ఖర్చు తగ్గుతుందని తెలిపారు.


వెదురు కర్రతో అధిక ఖర్చు

అరటి చెట్టుకు పొత్తు (పువ్వు) వచ్చినప్పుడు గుర్తించి, పాదుల్లో గుంతలు తవ్వి దన్నుగా వెదురు కర్రను నిలబెట్టి చెట్టుకు కడతారు. ఇలా చేయడం వల్ల అరటి గెల వేసిన తర్వాత చెట్టు ఒరిగిపోకుండా ఉంటుంది. అయితే వెదురు కర్రల వినియోగం వల్ల ఖర్చు పెరుగుతుంది. ఒక్కో వెదురు కర్ర ధర రూ.100 నుంచి 125 వరకు ఉంటుంది. వీటి కొనుగోలుకు అధిక ఖర్చవుతుంది.

తీగతో పందిరి నిర్మాణం: వెదురు కర్రలకు ప్రత్యామ్నాయంగా ఇనుప గొట్టాలు, తీగను ఉపయోగించి తక్కువ ఖర్చుతో గెలలకు ఊతం అందించే మార్గాన్ని అన్వేషించారు. పొలం వాలును బట్టి ఎకరా విస్తీర్ణంలో నిలువు 6 గొట్టాలు, అడ్డం 4 గొట్టాలు.. మొత్తం 24 (ఒక్కోటి 10 అడుగులు ఎత్తు) ఇనుప గొట్టాలను సిద్ధం చేసుకోవాలి. రెండు అడుగుల లోతు గుంతలు తవ్వి అందులో ఇనుప గొట్టాలను పాతాలి. నిలువు, అడ్డం వరుసల్లో గొట్టాలు పాతిన తరువాత అడ్డం వరుసల్లో ఉన్న గొట్టాలకు తుప్పు పట్టని కళాయి తీగను గట్టిగా కట్టాలి. అదే విధంగా నిలువు వరుసల్లోని గొట్టాలకు కొంచెం సాగే గుణం ఉన్న నరం వైరును (మార్కెట్‌లో దొరుకుతుంది) కట్టాలి. నిలువు గొట్టాల నుంచి లాగే వైరు అడ్డు గొట్టాలకు కట్టిన వైరు పైనుంచి వెళ్లే విధంగా కట్టాలి. ఇలా చేయడం వల్ల అరటి గెలలు వేసిన చెట్లకు తీగను ఒకదానితో ఒకటి పెనవేసినప్పుడు బరువుకు చెట్లు ఒరిగిపోకుండా నిలబడి ఉంటాయి.

నిర్మాణం ఖర్చు: 24 ఇనుప గొట్టాలు ఒక్కోటి 400 చొప్పున రూ.12 వేలు. నరం వైరు రూ.5 వేలు, తుప్పు పట్టని కళాయి తీగ రూ.2 వేలు, ఇనుప గొట్టాలకు రంగు రూ.వెయ్యి, కూలీల ఖర్చు రూ.5 వేలు. మొత్తం ఖర్చు రూ.25 వేలు.

తీగ పందిరితో తగ్గిన ఖర్చు: వెదురు కర్రలతో పోలిస్తే తీగతో వేసిన పందిరి ద్వారా సుమారు రూ.లక్ష నుంచి లక్షా 20 వేలు వరకు పంట ఖర్చు తగ్గుతుందని చెప్పారు. గెలను కోసేటప్పుడు తీగను తప్పిస్తే సరిపోతుంది. దీంతో కూలీల ఖర్చు తగ్గడంతో పాటు నాలుగైదు సంవత్సరాల వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అరటి సాగులో అంతర పంటలతో పాటు పొలం గట్ల వెంబడి బొప్పాయి వంటి పండ్ల మొక్కలు నాటి అదనపు ఆదాయాన్ని పొందవచ్చని సూచించారు. సేంద్రియ సాగు విధానం, అరటి తోటలో తీగతో పందిరి నిర్మాణానికి సంబంధించిన వివరాలకు రైతును (చరవాణి : 94942 55962) సంప్రదించవచ్చు.

- వై.యస్‌.కుమార్‌, తిరువూరు, కృష్ణాజిల్లా



ఖర్చు తక్కువ, మన్నిక ఎక్కువ
వెంకటేశ్వరరావు, ఉద్యానశాఖ విస్తరణాధికారి

వెదురు కర్రలు కొంత కాలానికి పుచ్చుపట్టి విరిగిపోతాయి. వీటి ఖర్చు కూడా ఎక్కువే. తీగతో పందిరి నిర్మాణం చేస్తే.. ఎక్కువ కాలం మన్నిక ఉంటుంది. ఖర్చు తక్కువ. వీటిపై తీగజాతి కూరగాయలు కూడా పండించవచ్చు. టమాట మొక్కలు నాటి, అవి పెరిగిన తరువాత పందిరి తీగకు పురికొసతో మొక్కలకు ఊతం ఏర్పాటు చేస్తే.. కాయలు నేలకు తగలకుండా, పాడవకుండా నాణ్యమైన పంట దిగుబడులు వస్తాయి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.