close
శీతాకాలంలో పశుగ్రాసాల సాగు

లికాలంలో నీటివసతి కింద ధాన్యం, పప్పుజాతి పశుగ్రాసాలను సాగు చేయవచ్చు. ధాన్యపుజాతి గ్రాసాల్లో మొక్కజొన్న, జొన్న, సజ్జ.. పప్పుజాతి గ్రాసాల్లో లూసర్న్‌, అలసంద ముఖ్యమైనవి.


ధాన్యపుజాతి గ్రాసాలు..

మొక్కజొన్న: నీటివసతి కింద పండిస్తే.. తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడినిస్తుంది. వివిధ రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటుంది. ఈ పంట అన్ని దశల్లో మేతగా ఉపయోగపడుతుంది. పైరు అన్ని దశల్లో నీరు అందుబాటులో ఉండాలి. పాలకంకి దశలో అత్యధిక పోషకాలను కలిగి ఉంటుంది. ‘ఆఫ్రికన్‌ టాల్‌’ రకం నీటివసతి కింద దాదాపు 10 అడుగుల ఎత్తు పెరుగుతుంది. ‘జె-1006’ రకం కూడా అన్ని నేలలకు అనువైనది. ఎకరాకు 16-24 కిలోల విత్తనం అవసరం. బోదెలకు పక్కగా 3-4 సెం.మీ. లోతులో విత్తాలి. నాటిన వెంటనే నీరివ్వాలి. తరువాత నేలను బట్టి 7-10 రోజుల వ్యవధిలో తడులివ్వాలి. దిగుబడి ఎకరాకు 25-32 టన్నులు.

జొన్న: పచ్చి, ఎండు మేతగా వాడొచ్చు. పప్పుజాతి పంటలతో మిశ్రమ పంటగా పండిస్తే.. జొన్నలో పోషక విలువలు పెరుగుతాయి. జొన్నలో నాము గురించి రైతులు జాగ్రత్త వహించాలి. ‘హైడ్రోసైనిక్‌ యాసిడ్‌’ అనే విషపదార్థం నాముకు కారణం కాబట్టి పంట పూతదశ వచ్చేంత వరకు కోయకూడదు. ఎం.పి.చారి (ఇది ఒకే కోత రకం), యస్‌.యస్‌.జి, 59-8, కో.ఎఫ్‌.యస్‌-29, పూసాచారి, రాజ్‌చారి-1, రాజ్‌చారి-2 వంటివి పలుకోత రకాలు. ఇవి ఏడాదిలో 3-4 కోతలిస్తాయి. ఒక కోత రకాలు ఎకరాకు 10 కిలోలు, పలుకోత రకాలు ఎకరాకు 12-20 కిలోల విత్తనం అవసరం. ఈ రకాలను పంట పూత దశలోనే కొయ్యాలి. ఎండుమేతగా సాగు చేసినప్పుడు ఎకరాకు 30-40 కిలోల విత్తనం అవసరం. ఈ పంటను పూర్తి పక్వదశలో కోసి, విత్తనాన్ని వేరుచేసి, చొప్పను కట్టలుగా కట్టాలి. ఏక కోత రకాలు ఎకరాకు 12-15 టన్నులు, పలుకోత రకాల్లో.. మొదటి కోతలో ఎకరాకు 15-18 టన్నులు, రెండో కోతలో 10 టన్నుల దిగుబడి ఉంటుంది.

సజ్జ: వర్షాభావ ప్రాంతాల్లో, పొడి వాతావరణం ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా సాగు చేస్తారు. మిగతా పశుగ్రాసాల కంటే దీనిలో మాంసకృత్తులు ఎక్కువ. జెయింట్‌ బాజ్రా, బెయిఫ్‌ బాజ్రా, రాజ్‌కోబాజ్రా ముఖ్యమైనవి. ఎకరాకు 4-6 కిలోల విత్తనం అవసరం. 25×10 సెం.మీ. దూరంలో, 2 సెం.మీ. లోతులో విత్తాలి. విత్తిన 40-45 రోజుల నుంచి పూత తొలిదశ నుండి పూత పూర్తయ్యేలోపు కోసుకోవచ్చు.


 పప్పుజాతి గ్రాసాలు 

వీటిలో మాంసకృత్తులు అధికంగా ఉంటాయి. పశువులకు ధాన్యపుజాతి పశుగ్రాసాలు ఎక్కువగా, పప్పుజాతి పశుగ్రాసాలు 30 శాతానికి మించకుండా మేపాలి.

లూసర్న్‌: ఈ పంట రెండు అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. దీనిని ‘పశుగ్రాసాల రాణీ’ అంటారు. వీటిలో ఏకవార్షిక, బహువార్షిక  రకాలు ఉంటాయి. కో-1, ఆర్‌.యల్‌-88, టి9, అనంద్‌ 1,2. వీటిలో కో-1, ఆర్‌.యల్‌-88 బహువార్షికాలు. మురుగుపోయే అన్ని నేలలు అనుకూలం. అక్టోబరు-నవంబరు నెలల్లో విత్తాలి. లూసర్న్‌ విత్తనం చిన్నది కాబట్టి మెత్తని దుక్కి చేయాలి. దుక్కిలో 10 టన్నుల పశువుల ఎరువు, 22 కిలోల యూరియా, 300 కిలోల సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌, 26 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ వేయాలి. విత్తిన వెంటనే, మూడోరోజు తడివ్వాలి. తరువాత అవసరాన్ని బట్టి నీరు పెట్టాలి. లూసర్న్‌లో బంగారు తీగ సమస్య తీవ్రమైనది. ఇది కలుపు విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. నివారణకు లీటరు నీటికి పెండిమిథాలిన్‌ 5 మి.లీ. చొప్పున కలిపి విత్తిన 48 గంటల్లో పిచికారీ చేయాలి. మొదటి కోత విత్తిన 75-90 రోజులకు, తదుపరి కోతలు 25-30 రోజులకు ఒకసారి కోయవచ్చు. దిగుబడి సంవత్సరానికి 32-40 టన్నులు వరకు వస్తుంది.

అలసంద: దీన్ని అన్ని రకాల నేలల్లో, ఏ కాలంలోనైనా విత్తొచ్చు. మురుగునీటి సౌకర్యం ఉండాలి. బన్‌డల్‌ టాబియా 1, 2, యు.పి.సి-5286, ఇ.సి.4216 ముఖ్యమైనవి. ఎకరాకు 8-10 కిలోలు, 30×10 సెం.మీ. దూరంలో విత్తుకోవాలి. విత్తేటప్పుడు ఒకసారి నీరివ్వాలి. ఆపై అవసరాన్ని బట్టి నీరు పెట్టాలి. దిగుబడి ఎకరాకు 10-12 టన్నులు. అలసందను మొక్కజొన్న, జొన్న, సజ్జలతో కలిపి అంతర పంటగా విత్తుకోవచ్చు.

- భాగ్యరాజీ.నేతల

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.