close
పుచ్చ, దోసలో సస్యరక్షణ

పుచ్చ, దోస పంటలను గతంలో సీజన్‌లో మాత్రమే రైతులు సాగు చేసేవారు. సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏడాది పొడవునా సాగు చేస్తున్నారు. ఈ పంటలపై సస్యరక్షణ చర్యలు సకాలంలో చేపడితేనే మంచి దిగుబడులు వస్తాయనిని ఉద్యానశాఖ కడప ఉప సంచాలకులు డి.మధుసూదన్‌రెడ్డి (చరవాణి : 79950 87055) సూచించారు.

- న్యూస్‌టుడే, ఒంటిమిట్ట

ఎలుకలు: పుచ్చ, దోస విత్తనాలు మొలక రావడానికి ముందే ఎలుకలు తినడంతో ఖాళీలు ఏర్పడి పంటకు నష్టం కలుగుతుంది. దీని నివారణకు వరి గింజలు (వడ్లు) నీటిలో నానబెట్టి ఉడకబెట్టిన తర్వాత నీటిని తీసేయాలి. ఐదు కిలోల వరి గింజలకు పావు కిలో ఫ్యూరడాన్‌ గుళికలు కలిపి విత్తనం నాటిన అనంతరం పొలంలో చల్లాలి లేదా 5 కిలోల బొరుగులకు 10 ప్యాకెట్లు జింకు ఫాస్ఫయిడ్‌ (ఎలుకల మందు) కలిపి సాళ్లపై చల్లాలి.

మిడతలు: ఎలుకల తర్వాత అత్యంత ఎక్కువగా మిడతలు వాలి నష్టం కలిగిస్తాయి. మొలక వచ్చిన వెంటనే కాండం తీసేయడంతో మొక్కలు ఎండిపోతాయి. విత్తనం మొలకెత్తిన వెంటనే లీటరు నీటికి క్లోరిపైరిఫాస్‌ 2 మి.లీ., కలిపి పిచికారి చేయాలి.

పాము పొడ: రెక్కలు కలిగిన తల్లి ఈగలు ఆకులపై గుడ్లు పెడతాయి. ఈ గుడ్ల నుంచి వెలువడిన చిన్న లద్దె పురుగులు ఆకు పైపొర, కింది పొర మధ్యలో సొరంగాలు చేస్తుంది. దీంతో ఆకులపై చారలు కనిపిస్తాయి. నివారణకు ఫిప్రోనిల్‌ 2 మి.లీ. లేదా మలాథియాన్‌ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

పచ్చ పురుగు: ఇటీవల కాలంలో పుచ్చ, దోస కాయలపై పిందె దశ నుంచే పచ్చ పురుగులు ఆశించి గోకి తినడంతో కాయలు వృద్ధి చెందవు. రంగు కోల్పోతాయి. విపణిలో మంచి ధర లభించదు. నివారణకు ధయాడికార్బ్‌ (లార్విన్‌) 1.25 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.


ఎర్రనల్లి: పొడి వాతావరణంలో పుచ్చ, దోస పంటలపై వీటి ఉధృతి పెరుగుతుంది. ఎర్రనల్లి పిల్లలు గుంపులుగా ఆకుల కింద చేరి రసం పీల్చడంతో ఆకులపై తెల్ల మచ్చలు ఏర్పడుతాయి. ఆకంతా ఎండుతుంది. నివారణకు ఒమైట్‌ 2 మి.లీ. లేదా మెజిస్టార్‌ 2 మి.లీ., లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.


పండు ఈగ: దోస కాయలు పక్వానికి వచ్చే దశలో ఈ పండు ఈగకు చెందిన తల్లి ఈగలు కాయలపై చిన్న రంధ్రం చేసి గుడ్లు పెడతాయి. గుడ్ల నుంచి వెలువడిన చిన్న లద్దె పురుగులు కాయలోనికి రంధ్రాలు చేసుకొని వెళతాయి. కండను తింటూ పెరుగుతాయి. దీని ఫలితంగా కాయకుళ్లు సోకి పురుగు చేసిన రంధ్రాల నుంచి రసం కారుతుంది. కోసి గమనిస్తే కాయ గుజ్జులో తెల్లని పురుగులు ఉంటాయి. పురుగులు వృద్ధి చెందిన తర్వాత నేలపై పడి కోశస్థ దశకు వస్తాయి. రసాయన మందులు పిచికారి చేసినా పండు ఈగ నివారణ సాధ్యం కాదు. కనుక మగ పురుగులను ఆకర్షించడానికి పండు ఈగ నివారణ బుట్టలు అమర్చాలి. ఎకరాకు ఎనిమిది చోట్ల పంటపై 1.5 అడుగుల ఎత్తులో వీటిని కర్రలకు కట్టాలి. రెండు వైపులా రంధ్రాలు కలిగిన ప్లాస్టిక్‌ డబ్బా, డబ్బాలో వేయడానికి చిన్న ప్లైవుడ్‌ ముక్కకు మగ ఈగలను ఆకర్షించగలిగే మిథైల్‌ యుజినాల్‌ మందు, పురుగులను చంపే నువాన్‌ మందును కలపాలి. బెంగళూరుకు చెందిన ఎన్‌బీఏఐఆర్‌ నూతనంగా రూపొందించిన లూర్‌ (ఎర)లను ఎకరాకు 10 నుంచి 12 చొప్పున 1.5 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయాలి. ఇలా చేస్తే పండు ఈగకు చెందిన మగ ఈగలు ఆకర్షితమై మందు ప్రభావానికి గురై చనిపోతాయి. 10 రోజుల తర్వాత మళ్లీ నువాన్‌ మందును ప్లైవుడ్‌ ముక్కపై 4-5 చుక్కలు వేసి అదే డబ్బాలో పెట్టాలి. ఈ లూర్‌లు మూడు వారాల పాటు మగ ఈగలను ఆకర్షించే శక్తి కలిగి ఉంటాయి. 3 వారాల అనంతరం కూడా పండుఈగ ఉనికిని గుర్తిస్తే.. కొత్త లూర్‌లను నువాన్‌ వేసి అదే ప్లాస్టిక్‌ డబ్బాలో వేసి పొలంలో పెట్టాలి. మగ ఈగల బెడద తొలగితే ఆడ ఈగలున్నా ప్రత్యుత్పత్తి జరగదు.

పొలంలో పసుపు రంగు అట్టలకు జిగురు పూసి ఎకరాకు 40-50 చొప్పున అక్కడక్కడ ఒకటిన్నర అడుగు ఎత్తులో ఉంచితే పండు ఈగలు ఆకర్షితమై అతుక్కొని చనిపోతాయి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు