close
కొర్ర విత్తే అదును ఇదే

న్యూస్‌టుడే, అనంతపురం (వ్యవసాయం)

కొర్రను జనవరి రెండో పక్షం వరకు విత్తే అవకాశం ఉందని అనంతపురం జిల్లా రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) సమన్వయకర్త డాక్టర్‌ జి.నారాయణస్వామి (సెల్‌: 62812 84235) తెలిపారు. ఈ పంట సాగులో పాటించాల్సిన యాజమాన్య మెలకువలను సూచించారు. నల్లరేగడి, తేలికపాటి ఎర్ర చల్కానేలలు, మురుగునీరు నిల్వని నేలలు అనుకూలం.

యాజమాన్య పద్ధతులు

ఎకరాకు 2 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తే ముందు 1:3 నిష్పత్తిలో విత్తనాన్ని సన్నని ఇసుకతో కలిపి వరుసల మధ్య 22.5 సెం.మీ., మొక్కల మధ్య 7.5 సెం.మీ. ఎడం ఉండేలా గొర్రుతో విత్తాలి.
* ఎరువులు : ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు వేసి ఆఖరి దుక్కిలో కలియ దున్నాలి. ఎకరాకు 18 కిలోల యూరియా, 50 కిలోల సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌ విత్తేటప్పుడు వేయాలి. నాటిన 34 రోజుల తర్వాత పైపాటుగా మరో 18 కిలోలు యూరియా వేయాలి.
* మూడు తడులు చాలు : విత్తే ముందు నీరు పారించాలి. తగినంత తేమ ఉంటేనే విత్తాలి. విత్తిన 20 రోజులకు ఒక తడి, 45 రోజులకు ఒక తడి ఇస్తే చాలు మూడు తడుల్లో పంట చేతికొస్తుంది.
* అంతర పంటలు : కొర్రలో అంతర పంటలుగా కంది, సోయాచిక్కుడు 5:1 నిష్పత్తిలోను, కొర్ర, వేరుసెనగలను 2:1 నిష్పత్తిలో సాగు చేసుకోవచ్చు.
* అంతరకృషి : విత్తిన రెండు వారాల్లోగా ఒత్తు మొక్కలను తీసేయాలి. విత్తిన నెల వరకు పొలంలో కలుపు మొక్కలు లేకుండా చర్యలు చేపట్టాలి.


రకాలు

* సూర్యనంది: పంటకాలం 75 రోజులు. దిగుబడి ఎకరాకు 10-12 క్వింటాళ్లు. గింజ పసుపు రంగులో నాణ్యత కలిగి ఉంటుంది. అగ్గి తెగులు, వెర్రి కంకి తెగులును తట్టుకుంటుంది.
* ఎస్‌ఐఏ-3085 : పంటకాలం 76-80 రోజులు. దిగుబడి ఎకరానికి 8-10 క్వింటాళ్లు. నీటి ఎద్దడిని, అగ్గితెగులు, గింజ బూజు తెగుళ్లను తట్టుకుంటుంది. గింజ పసుపు రంగులో నాణ్యత కలిగి ఉంటుంది.
* కృష్ణదేవరాయ : పంటకాలం 70-75 రోజులు. దిగుబడి ఎకరాకు 8-12 క్వింటాళ్లు. గింజలు లావుగా, లేత పసుపు రంగులో ఉంటాయి. మొక్కలు 110 సెం.మీ. ఎత్తు ఎదిగి, 4-5 పిలకలు వస్తాయి. చొప్ప నాణ్యంగా ఉంటుంది.
* ప్రసాద్‌ : పంటకాలం 70-75 రోజులు. దిగుబడి ఎకరాకు 8-12 క్వింటాళ్లు. కంకులు పెద్దగా ఉండి గింజలు లావుగా, లేత పసుపు రంగులో ఉంటాయి. మొక్కలు మీటరు ఎత్తు పెరుగుతాయి. ఆకులు వెడల్పుగా ఉంటాయి. 3-4 పిలకలు వస్తాయి.
* నరసింహరాయ : పంటకాలం 80-85 రోజులు. దిగుబడి ఎకరాకు 10-12 క్వింటాళ్లు. గింజలు లావుగా, పసుపు రంగులో ఉంటాయి. మొక్కలు 110-120 సెం.మీ. ఎత్తు ఎదిగి, బాగా పిలకలు వస్తాయి.
* శ్రీలక్ష్మీ : పంటకాలం 80-85 రోజులు. దిగుబడి ఎకరాకు 10-12 క్వింటాళ్లు. మొక్కలు 120 సెం.మీ. ఎత్తు పెరుగుతాయి. వెర్రి కంకి, తుప్పు, అగ్గి తెగుళ్లను తట్టుకుంటుంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.