close
బొప్పాయిలో వైరస్‌ తెగుళ్లు

న్యూస్‌టుడే, అనంతపురం (వ్యవసాయం)

లికాలంలో బొప్పాయిని వైరస్‌ తెగుళ్లు ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. మూడేళ్లు పంటకాలం ఉన్న ఈ పంటను ప్రస్తుతం వైరస్‌ తెగుళ్లు ఆశించడం వల్ల ఏడాదికే తొలగించాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. మొక్కలకు ఒకసారి ఈ తెగులు సోకితే అది చనిపోయే వరకు మొక్కల్లో ఉండి నష్టపరుస్తుంది. దీని నివారణకు ముందస్తు యాజమాన్య పద్ధతులను పాటించాలని అనంతపురం జిల్లా పెనుకొండ ఉద్యానశాఖ డివిజన్‌-2 సహాయ సంచాలకు చంద్రశేఖర్‌ (సెల్‌ : 79950 86791) తెలిపారు.

ఆకుముడత తెగులు : ఇది తెల్లదోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం కారణంగా గాలిలో తేమ పెరిగే కొద్ది ఈ తెగులు ఉద్ధృతి పెరుగుతుంది. ఈ వైరస్‌ కలుపు మొక్కలను సైతం ఆశించి, వాటి ద్వారా పంటకు సోకే అవకాశం ఉంటుంది. ఈ తెగులు ప్రధానంగా మార్చి నుంచి జాన్‌లో ఎక్కువగా ఉంటుంది. తెగులాశించిన మొక్కల ఆకులు ముడుచుకుని వంకర్లు తిరుగుతాయి. ఆకుల పరిమాణం తగ్గుతుంది. ఈనెలు పాలిపోతాయి. ఆకులు మందపు తోలులా మారుతాయి. ఆకులు, కాడలు వంపులు తిరిగి కాండం చివరిలో గుంపుగా ఉంటాయి. ఈ వైరస్‌ సోకిన మొక్కల్లో పెరుగుదల మందగిస్తుంది. పూలు ఏర్పడవు. పూత కాయగా మారదు.

యాజమాన్యం
* మొక్కలను రసంపీల్చే పురుగులు చొరబడని 60-80 సైజు కలిగిన నైలాన్‌ మెష్‌ (వల) లోపల పెంచాలి.
* పంట తొలి దశలోనే వైరస్‌ సోకిన మొక్కలను, కలుపు మొక్కలను తొలగించి కాల్చేయాలి.
* బొప్పాయి సాగుకు ముందే తోట చుట్టూ రెండు వరుసలు అవిశ, ఆముదం, మొక్కజొన్న పంటలను సాగుచేసి.. ఈ తెగులు వ్యాప్తిని తగ్గించవచ్చు.
* తెల్లదోమ నుంచి మొక్కలను రక్షించడం కోసం.. ఎకరాకు 10 కిలోల కార్బొఫ్యూరాన్‌ 3జి గుళికలను ఆఖరి దుక్కిలో వేయాలి.
* తెల్లదోమ ఉద్ధృతిని గమనించడానికి పసుపురంగు జిగురు అట్టలను ఎకరాకు 15 చొప్పున మూడు అడుగుల ఎత్తులో అమర్చాలి.
* రసాయన మందులతో పాటు మధ్యలో వేపనూనె లీటరు నీటికి 5 మి.లీ. కలిపి పిచికారీ చేస్తే మంచిది.


ఉంగరాల తెగులు (రింగ్‌స్పాట్‌ వైరస్‌)

ఇది పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతుంది. చలికాలంలో దీని ఉద్ధృతి అధికంగా ఉంటుంది. ఇది బొప్పాయితో పాటు గుమ్మడి జాతి పంటలను ఆశిస్తుంది. బొప్పాయి అన్ని దశల్లో ఈ తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. ఆకులు, కాయలు, కాండంపై ఈ తెగులు లక్షణాలు కనిపిస్తాయి. వైరస్‌ ఆశించిన తొలిదశలో లేతాకులు పత్రహరితాన్ని కోల్పోతాయి. ఈనెలు పసుపు రంగులోకి మారి ఆకులపై పసుపురంగు మచ్చలు కనిపిస్తాయి. ఈనెల మధ్యభాగం పైకి ఉబ్బినట్లు కనిపిస్తుంది. నారు దశ మొక్కల్లో.. ఈ తెగులు సోకిన 1-2 వారాల్లో లేతాకుల్లో ఈనెలు పాలిపోయి ఆకులు లోపలికి ముడుచుకుంటాయి. పెద్ద మొక్కల్లో ఆకులు అంచుల వెంబడి లోపలికి ముడుచుకుంటాయి. దీంతో ఆకులు పచ్చదనం, పరిమాణం తగ్గి, ఆకారం కోల్పోయి ఈనెలుగా ఏర్పడతాయి. వైరస్‌ ఆశించిన మొక్కల్లో తెగులు లక్షణాలు బయటపడటానికి వాతావరణ పరిస్థితులను బట్టి 9-39 రోజులు పడుతుంది. చలికాలంలో అయితే ఆరు వారాలు పడుతుంది. ముదిరిన కాయలపై గుండ్రంగా, వృత్తాకారంలో ఉండే రింగులు 10-150 వరకు ఏర్పడతాయి. కాయలపై ఎండ పడే వైపు ఈ రింగులు ఎక్కువగా ఉంటాయి. తెగులు సోకిన కాయలు ఆకారం కోల్పోయి, నాణ్యత తగ్గుతుంది.

యాజమాన్యం
* కొత్తగా సాగుచేసే తోటలను, తెగులుండే ప్రాంతాలకు దూరం సాగుచేయాలి.
* తోటల చుట్టూ ఈ వైరస్‌ ఆశించని జొన్న, మొక్కజొన్న వంటి పంటలను పెంచాలి.
* అంతరకృషి చేసేటప్పుడు వేర్లు దెబ్బతినకుండా జాగ్రత్తపడాలి.
* తెలుగు సోకిన మొక్కలను గమనించిన వెంటనే పీకి కాల్చేయాలి. లేదంటే తోటంతా వ్యాపిస్తుంది. వైరస్‌ నివారణకు మందు లేదు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.