close
ధాన్యం నిల్వలో జాగ్రత్తలు!

న్యూస్‌టుడే, బాపట్ల

నూర్పిడి తర్వాత ధాన్యాన్ని ఇంటికి చేరుస్తారు. మంచి ధర కోసం ఎక్కువ మంది రైతులు ధాన్యాన్ని నిల్వ చేస్తుంటారు. ఈ ధాన్యం ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను బాపట్ల పోస్ట్‌ హార్వెస్ట్‌ టెక్నాలజి కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త జాన్‌వెస్లీ (సెల్‌: 93940 43908) తెలిపారు.

ఇళ్లలో నిల్వ..
పంట కోత అనంతరం ధాన్యాన్ని ఎండలో ఆరబెట్టి (వరిలో 11-12 శాతం, అపరాల్లో 10 శాతం, నూనె గింజల్లో 7-8 శాతం తేమ ఉండేలా) నిల్వ చేస్తే పురుగు పట్టకుండా ఏడాది వరకు నిల్వ ఉంటాయి. కీటకాలు ఆశించకుండా వేపాకు, వెల్లుల్లి, ఉసిరి గింజలు, సీతాఫలం గింజల పొడి (1-2 శాతం) ధాన్యంలో కలిపితే 6-8 నెలల వరకు పురుగు ఆశించదు. ఇవేకాక కసివింద, ఉత్తరేణి, కుక్క మిరప, నేల ఉమ్మెత్త, కీసర చెట్ల ఆకులను ధాన్యంలో కలిపి దాదాపు మూడు నెలలు పురుగు ఆశించకుండా నివారించవచ్చు. రసాయన మందులను నేరుగా ధాన్యంపై పిచికారీ చేయకూడదు.

గోదాముల్లో నిల్వ
* నూర్పిడి చేసే యంత్రాలు, రవాణాకు ఉపయోగించే వాహనాలను ముందుగానే శుభ్రపరచుకోవాలి.
* పాత గోనె సంచులను ఉపయోగిస్తే.. వాటికి చిరుగులు లేకుండా చూడాలి. లీటరు నీటికి మలాథియాన్‌ (50 ఇ.సి) 2 మి.లీ. చొప్పున కలిపిన ద్రావణంలో పది నిమిషాలు ముంచి ఆరబెట్టిన తర్వాత సంచులను ఉపయోగించాలి.
* గోదాముల పైకప్పు, గోడలు, నేలలో పగుళ్లు, రంధ్రాలు లేకుండా సిమెంట్తో పూడ్చేయాలి.
* నేలపైన, గోడలు, పైకప్పు, గోనె సంచులపై పురుగు ఆశించకుండా లీటరు నీటికి 10 మి.లీ. మలాథియాన్‌ (50 ఇ.సి.) లేదా 7 మి.లీ. డైక్లోర్‌వాస్‌ (76 శాతం యస్‌.సి) లేదా డెల్టామెత్రిన్‌ 2.5 (డబ్ల్యూ.పి) 40 గ్రాములు చొప్పున కలిపిన ద్రావణాన్ని వంద చదరపు మీటర్లకు మూడు లీటర్ల చొప్పున పిచికారీ చేయాలి.
* ధాన్యపు బస్తాలకు తేమ చేరకుండా చెక్క దిమ్మెలపై ఉంచాలి. గోదాముల్లో గోడలకు, పైకప్పునకు తగలకుండా బస్తాలను ఉంచాలి. ధాన్యపు బస్తాల నిల్వల చుట్టూ కాలిబాటలకు దారి వదలాలి ఇది బస్తాల పరిశీలనకు, మందుల పిచికారీకి ఉపయోగపడుతుంది. 


* గోదాముల్లో ధాన్యానికి పురుగాశిస్తే అల్యూమినియం ఫాస్ఫయిడ్‌ (50 శాతం) బిళ్లల ద్వారా ఊదరబెట్టి పురుగులను నివారించవచ్చు. టన్ను ధాన్యానికి 3 గ్రాముల బిళ్లలు మూడు సరిపోతాయి. ముందుగా బస్తాల మధ్య మందు బిళ్లలు ఉంచి పట్టాలు కప్పాలి. ఇలా 5-7 రోజులు ఊదరబెట్టిన తర్వాత పట్టాలు తొలగించి రెండ్రోజుల పాటు ఏరేషన్‌ చేయాలి. సుశిక్షితుల పర్యవేక్షణలో మాత్రమే ఊదరబెట్టడం చేపట్టాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.