close
చెరకు సాగులో మెలకువలు

- న్యూస్‌టుడే, పీలేరు (గ్రామీణం)

చెరకులో వాతావరణ పరిస్థితులు, సాగు విధానం, నీటి యాజమాన్యం, సస్యరక్షణ పద్ధతులు దిగుబడిని, పంట నాణ్యతను ప్రభావితం చేస్తాయి. ఈ పంట సాగులో పాటించాల్సిన మెలకువలను పీలేరు వ్యవసాయ సహాయ సంచాలకులు మజీద్‌ అహ్మద్‌ (సెల్‌ : 88866 12511) సూచించారు.

వాతావరణం
అధిక ఎండలు, వర్షపాతం, గాలిలో తేమ ఎక్కువైనప్పుడు చెరకు ఏపుగా పెరుగుతుంది. గాలిలో తక్కువ తేమ, చల్లటి పొడి వాతావరణంలో (నవంబరు నుంచి) చెరకు రసంలో పంచదార శాతం పెరుగుతుంది.

నాటే సమయం
కోస్తాంధ్రలో జనవరి నుంచి మార్చి, రాయలసీమలో జనవరి నుంచి ఫిబ్రవరి మాసాల్లో నాటాలి. నీటివసతి కింద నల్లరేగడి, ఒండ్రు, మెరక భూములు అనుకూలం.


రకాలు

నీటివసతి కింద ఎప్పుడైనా నాటేందుకు: కో-6909, 81ఎ99, 83ఎ30, 84ఎ125, 85ఎ261, 86వి96, 83ఆర్‌23, 87ఎ298, 97ఎ85, 2003వి 46, 20022వి 59, 91వి83, 93ఎ145, కోఎ-7602, కోటీ-8201, కో-7805, 83వి15, కో-7219, కోఆర్‌-8001, కో-7706, 2001వి63.
నీటివసతి కింద జనవరి-ఫిబ్రవరిలో సాగుకు : కో-6909, కోటి-8201, కోవి-7602, కో-7229, 81ఎ99, 85ఎ261, 83ఎ30, 84ఎ125, 90ఎ272, 83వి15, 93వి145, 97ఎ85, 2001ఎ63.
చౌడు భూముల్లో సాగుకు.. : 81ఎ99, 81వి48, 2000వి59, 99వి30, కో7219, కోటి8201, 93ఎ143 రకాలను నాటుకోవాలి.

విత్తనం : పూత పూయని చెరకు చివరి భాగాలను లేదా 7-8 నెలల వయసున్న తోటల నుంచి మూడు కళ్ల ముచ్చెలను సేకరించాలి. ఎకరానికి 16 వేల ముచ్చెలు నాటాలి. నాటేముందు 200 లీటర్ల నీటిలో.. ప్రొపికొనజోల్‌ 200 మి.లీ. + మలాథియాన్‌ 400 మి.లీ. కలిపిన ద్రావణంలో పావుగంట పాటు నానబెట్టి నాటడం ద్వారా పొలుసు పురుగు, అనాసకుళ్లు తెగుళ్లను అరికట్టవచ్చు. లేవడి తోటలను పెంచేందుకు ముదురు తోటల నుంచి సేకరించిన గడలను (మొదలు, చివర 1/3 వంతు తీసేసి) ముచ్చెలను వేడి నీటిలో అరగంట పాటు మరిగించి విత్తనశుద్ధి చేయాలి. దీంతో కాటుక, గడ్డి దుబ్బు, ఆకుమాడు తెగుళ్లను నివారించవచ్చు.


నాటడంలో జాగ్రత్తలు

నేల తయారీ : తేలిక నేలల్లో.. ఎకరాకు పది టన్నుల మాగిన పశువుల ఎరువు లేదా 5 టన్నుల ఫిల్డర్‌ మడ్డి వేసి నాటాలి. సారం లేని, లోతు తక్కువ, నేల పైపొర గట్టిపడే భూములను లోతు దుక్కిచేసి, ఎకరాకు టన్ను వేరుసెనగ తొక్కలను లేదా వరి ఊక వేసుకోవాలి. పాలచౌడు నేలలో లవణీయత సెంటుకు 2 మి.మీ. మించకూడదు. క్షార భూముల్లో జిప్సం వేసి నాటాలి.
నాటే పద్ధతి : చదును నేలపై 30 సెం.మీ. వెడల్పు, 20 సెం.మీ. లోతుండేలా రెక్కల నాగలితో బోదెలను చేయాలి. స్వల్పకాలిక రకాలను సాళ్ల మధ్య 80 సెం.మీ., మధ్యకాలిక రకాలను 90 సెం.మీ., ఆలస్యంగా నాటే రకాలను 60 సెం.మీ. ఎడంగా నాటాలి. నల్లరేగడి, ఒండ్రు నేలల్లో నాటేముందు.. ప్రతి 24 మీటర్లకు 60 సెం.మీ. వెడల్పు, 40 సెం.మీ. లోతుతో మురుగునీటి కాల్వలు తీయాలి. లోతైన కాలువల్లో చెరకు నాటితే పీకపురుగు, కలుపు ఉద్ధృతి తగ్గడంతో పాటు సాగునీరు ఆదా అవుతుంది. తోటలు తుపాను గాలులకు పడిపోవు.
ఎరువులు : సిఫారసు మేరకు ఎకరాకు సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌ 250 కిలోలు, మ్యూరేట్ ఆఫ్‌ పొటాష్‌ 76 కిలోల చొప్పున ఆఖరు దుక్కిలో వేసి కలియదున్నాలి.
గమనిక : ఉత్తరాంధ్ర జిల్లాల్లో యూరియా 98 కిలోలు, కోస్తాంధ్రలో 145 కిలోలు, రాయలసీమలో 195 కిలోలు చొప్పున రెండు సమపాళ్లుగా చేసి నాటిన 45, 90 రోజులకు వేయాలి.


కలుపు నివారణ, అంతరకృషి

ముచ్చెలు నాటిన 1-3 రోజుల్లోపు ఎకరాకు అట్రజిన్‌ (50 శాతం) పొడి 2 కిలోలు లేదా మెట్రిబుజిన్‌ 600 గ్రా. 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అనంతరం ఎకరాకు 1.25 టన్నుల చెరకు చెత్తను నేలపై పలుచగా పరచాలి. పైరు 25-30 రోజుల దశలో అవసరాన్ని బట్టి గొర్రు లేదా దంతితో అంతరకృషి చేయాలి. వెడల్పాటి కలుపు ఉంటే, నివారణకు.. ఎకరాకు 2,4-డి సోడియం సాల్ట్‌ అర కిలో 200 లీటర్ల నీటిలో కలిపి పైరుపై పడకుండా వరుసల మధ్య 20, 60 రోజుల మధ్య పిచికారీ చేయాలి. వానాకాలంలో కాల్వల్లో మట్టిని ఎగదోసేటప్పుడు చెత్తపై ఎకరాకు కిలోంబావు డికంపోస్ట్‌ శిలీంద్రం + 8 కిలోల యూరియా + 10 కిలోల సూపర్‌ ఫాస్ఫేట్‌ చల్లి మట్టితో కప్పాలి.


నీటి యాజమాన్యం

పంట నాటినప్పటి నుంచి 4 నెలల వరకు 6 రోజులకొక తడివ్వాలి. చెరకు పక్వదశలో (నవంబరు నుంచి నరికే వరకు) మూడు వారాలకు ఒక తడివ్వాలి.
* చేలో చెరకు చెత్తను పరచడం, లీటరు నీటికి పొటాషియం నైట్రేట్‌ (13-0-45) 10 గ్రా. చొప్పున కలిపి పిచికారీ చేయడం ద్వారా పంట బెట్ట పరిస్థితులను తట్టుకుంటుంది. కలుపుతోపాటు పీక పురుగు ఉద్ధృతి తగ్గుతుంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.