close
పుచ్చ సాగులో మెలకువలు

- న్యూస్‌టుడే, పత్తికొండ (గ్రామీణం)

వర్షాభావ ప్రాంతాల్లో తక్కువ నీటితో పుచ్చసాగు చేయవచ్చు. ఈ పంటలో సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే మేలైన దిగుబడులు వస్తాయని పత్తికొండ వ్యవసాయ సహాయ సంచాలకులు మహమ్మద్‌ఖాద్రీ (ఫోన్‌: 88866 13957) తెలిపారు.

నేలలు, వాతావరణం : మురుగు ఇంకిపోయే ఇసుక, బంకమట్టి నేలలు అనుకూలం. చౌడు, ఉప్పు నేలలు పనికిరావు. కాయ కోతల దశలో అధిక ఉష్ణోగ్రతల వల్ల రుచి, నాణ్యత పెరుగుతుంది. తేమతో కూడిన వాతావరణం అనుకూలం.

విత్తనం : ఎకరాకు హైబ్రిడ్‌ విత్తనాలైతే 300 గ్రాములు, మేలు రకాలైతే 600 గ్రాములు నుంచి కిలో వరకు విత్తుకోవచ్చు. జనవరిలో పంటను విత్తుకోవాలి.

విత్తే విధానం : విత్తేముందు నేలను 4-5 సార్లు దున్నాలి. భూసారం ఆధారంగా 8-10 అడుగుల ఎడంగా, రెండు అడుగుల వెడల్పు నీటి కాల్వల చేయాలి. ఈ కాల్వ లోపల రెండు వైపులా రెండు అడుగులు ఎడంగా విత్తనాలను విత్తాలి. విత్తే ముందురోజు సాళ్లలో నీరు పారించాలి.

ఎరువులు : ఎకరాకు 4 టన్నుల మాగిన పశువుల ఎరువు లేదా టన్ను వానపాముల ఎరువు, 150 కిలోల సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌, 40 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ ఎరువులను ఆఖరు దుక్కిలో వేసి కలియదున్నాలి. 86 కిలోల యూరియాను రెండు దఫాలుగా చేసి ఆఖరు దుక్కిలో సగభాగం, విత్తిన 25 రోజులకు రెండో భాగం వేయాలి. పంట పూత, పిందె దశలో 60 కిలోల కాల్షియం అమోనియం నైట్రేట్‌ను మొక్కల మొదళ్లకు ఇరువైపులా గుంత తీసి ఎరువు వేసి మట్టి కప్పాలి. తీగ పారే దశలో చివర్లను తుంచేయాలి. దీంతో పక్క కొమ్మలు ఎక్కువగా వస్తాయి. లీటరు నీటికి.. 4 గ్రాముల సూక్ష్మధాతువుల మిశ్రమం (ఎఫ్‌-4) కలిపి పిచికారీ చేయాలి. దీనివల్ల తీగలు సాగి దిగుబడి పెరుగుతుంది.

సస్యరక్షణ : పంటను ప్రధానంగా తామర పురుగులు ఆశించి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు ముడుచుకుంటాయి. నివారణకు లీటరు నీటికి ఫిప్రోనిల్‌ 2 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ఆల్టర్నేరియా, మచ్చ తెగుళ్ల నివారణకు లీటరు నీటికి.. గ్రాము చొప్పున కార్బండిజమ్‌ కలిపి పిచికారీ చేయాలి.

నీటి యాజమాన్యం : పంట మొదటి దశలో వారానికో తడివ్వాలి. అనంతరం వాతావరణం, నేల స్వభావాన్ని బట్టి 5-7 రోజులకు ఒక తడివ్వాలి. పూతవచ్చే దశలో తోటను బెట్టకు గురిచేసిన తర్వాత నీడితడిస్తే పూత అధికంగా వస్తుంది. కాయ ఎదుగుదల దశలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి. పక్వ దశలో నీరు ఎక్కువగా ఇస్తే కాయలు పగులుతాయి.

కోత : కాయలను చేతితో కొట్టి చూస్తే డొల్ల శబ్దం వస్తే పక్వానికి వచ్చినట్లే. ఈ కాయలను సాయంత్రం పూట కోసి, ఉదయాన్నే రవాణా చేయాలి.


రకాలు

అర్కజ్యోతి, అర్కమానిక్‌, సుగర్‌బేబీ, అపర్ణ, మధుబాల, మోహినీ వంటి రకాలు విత్తుకోవచ్చు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.