close
గ్రాసం కొరత తీర్చే పాతరగడ్డి!

న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ (వ్యవసాయం)

వేసవిలో పశుగ్రాసం కొరత పాడి రైతులను తీవ్రంగా వేధిస్తుంది. ఈ సమస్య రాకుండా ఉండేందుకు.. రైతులు ఇప్పటి నుంచే పచ్చిమేతలను సాగుచేసి పాతరగడ్డిని సైలేజి రూపంలో నిల్వ చేసుకోవాలని మహబూబ్‌నగర్‌ పశుసంవర్థక శాఖ సహాయ సంచాలకులు వెంకటయ్యగౌడ్‌ (సెల్‌ : 99899 97496) సూచించారు.

బాగా మగ్గిన పాతరగడ్డి వాసన తియ్యగా ఉంటుంది. అందువల్ల పశువులు ఇష్టంగా తింటాయి. నాణ్యమైన పాతరగడ్డి పసుపుతో కూడిన బంగారు వర్ణంలో ఉంటుంది. వరి గడ్డితో పోల్చితే పాతరగడ్డిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఈ పాతర గడ్డిని ఒక్కో పశువుకు రోజుకు 15-20 కిలోలు, గొర్రెలు, మేకలకు రోజుకు 1-2 కిలోల వరకు మేపవచ్చు.


సైలేజి తయారీ

* నీటివసతి ఉన్న ప్రాంతాల్లో మేలైన పశుగ్రాసాలను సాగుచేసి, వాటిని శాశ్వత పద్ధతిలో పాతరగడ్డి (సైలేజి) రూపంలో పోషక విలువలు తగ్గకుండా నిల్వ చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో తక్కువ స్థలంలో ఎక్కువ మేతను నిల్వ చేయవచ్చు. పాతరగడ్డి వాడకంతో రైతులు దాణా ఖర్చులను తగ్గించుకోవచ్చు. ఎండాకాలంలోను అధిక పాల దిగుబడులను పొందవచ్చు.
* మొక్కజొన్న, జొన్న, సజ్జ లాంటి ధాన్యపు జాతికి (ఎ.పి.బి.ఎన్‌1., ఎన్‌.బి-21, కో1, కో2, కో3) చెందిన ఏకవార్షిక పశుగ్రాసాలు సైలేజి తయారీకి అనుకూలం.
* చిక్కుడు (లెగ్యూం) జాతికి చెందిన లూసర్న్‌, బొబ్బర, అలసంద లాంటి గ్రాసాలు మిశ్రమ సైలేజి తయారీకి బాగా అనువైనవి.
* 85-90 రోజుల దశలో ఉన్న జొన్న గ్రాసం, సగం పాలకంకి దశలో ఉన్న మొక్కజొన్న గ్రాసం సైలేజి చేసేందుకు అనువుగా ఉంటుంది. గ్రాసాన్ని కోసిన తర్వాత, అందులో తేమ 30-35 శాతం వరకు తగ్గేలా ఆరబెట్టాలి.
* మూడు టన్నుల పచ్చిమేతను పాతరగడ్డిగా నిల్వ చేసేందుకు.. 2.75 మీటర్ల పొడవు, అంతే వెడల్పు, ఒకటిన్నర మీటర్ల లోతు గుంత తీయాలి. ఇది రెండు పాడి పశువులకు 90 రోజుల వరకు సరిపోతుంది.
* శాశ్వత పద్ధతిలో సైలేజి నిర్మాణం కోసం.. గుంత గోడలను ఇటుకలతో నిర్మించుకుంటే మంచిది.
* ఒక టన్ను గ్రాసానికి.. కిలో యూరియా (వేపనూనె పూత వేయని), తక్కువ నాణ్యతగల 2 కిలోల బెల్లం, కిలో ఉప్పు, కిలో మినరల్‌ మిక్చర్‌ను 15 నుండి 20 లీటర్ల నీటికి కలపాలి.
* ముందుగా తీసిన గోతిలో అడుగున వరి గడ్డి, కొబ్బరి అకులు లేదా పాలిథీన్‌ కవరును పరచాలి. దీనిపై చాఫ్‌ కట్టర్‌తో ముక్కలుగా కత్తిరించిన మొక్కజొన్న గ్రాసాన్ని నింపాలి. దాదాపు ఒకటిన్నర అడుగు మందం వచ్చే వరకు నింపి, గాలి చొరబడకుండా బాగా అణగదొక్కాలి. ఇలా మొక్కజొన్న గ్రాసాన్ని పొరలు, పొరలుగా నింపుతూ, తొక్కుతూ, తయారు చేసుకున్న ద్రావణాన్ని చల్లుతూ పాతరను నింపాలి.
* నిండిన పాతరను ప్లాస్టిక్‌ షీట్‌తో కప్పి గాలి చొరబడకుండా మట్టితో లేదా ఇసుక బస్తాలతో బరువు పెట్టాలి. వర్షపు నీరు పాతరలోకి పోకుండా ఎత్తు ప్రదేశంలో సైలేజి గుంతలు తీయాలి. ఇలా మూసిన పాతరను 45 రోజులు మగ్గనిచ్చి, ఆ తరువాత వాడుకోవచ్చు. సక్రమంగా నిల్వచేసిన పాతర రెండేళ్ల వరకు పాడవకుండా ఉంటుంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.