close
మిరప నాణ్యత పెంచే చర్యలు

మిరప కాయల నాణ్యత పెంచేందుకు పాటించాల్సిన మెలకువలను మహబూబాబాద్‌ జిల్లా, మల్యాల్‌ జెన్నారెడ్డి వెంకటరెడ్డి ఉద్యాన పరిశోధన స్థానంకు చెందిన శాస్త్రవేత్తలు డాక్టర్‌ ఎం.రాజ్‌కుమార్‌, డాక్టర్‌ కె.కళాధర్‌బాబు, కె.భాస్కర్‌ (చరవాణి : 73960 59111) తెలిపారు. నాణ్యమైన మిరప చేతికందాలంటే... కోతకు ముందు, కోత తరువాత తగిన జాగ్రత్తలు పాటించాలి. చెత్తా చెదారం, పురుగుమందుల అవశేషాలు, హానికర సూక్ష్మజీవ విషపదార్థాలు, అఫ్లోటాక్సిన్లు (విష శిలీంద్రాలు) లేకుండా చూడాలి.
కోతకు ముందు.. : కాయ కోతకు ఐదు రోజుల ముందు పంటకు నీటి తడులివ్వడం మంచిది. కోతకు 20 రోజుల ముందు నుంచి కోత చేపట్టే వరకు హానికర రసాయన పురుగు మందులను పిచికారీ చేయకూడదు. మందులు పిచికారి చేస్తే.. కాయల్లో మందుల అవశేషాలు ఉండే ప్రమాదం ఉంది.  
కోత సమయంలో  
* పొడి వాతావరణం ఉన్నప్పుడు.. పూర్తిగా పక్వానికి వచ్చి, రంగు ఉన్న కాయలను మాత్రమే కోయాలి.
* మొక్క మీద కాయల్ని ఎక్కువగా పండనిస్తే కాయలు ముడతలు పడతాయి. ఎండకు రంగు తగ్గి, నాణ్యత కోల్పోతాయి.
* పండిన కాయలు ఎప్పటికప్పుడు కోయడం వల్ల దిగుబడులు పెరుగుతాయి.
* కాయకుళ్లు తెగులాశించిన, కాయతొలుచు పురుగాశించిన, తాలు కాయలను నాణయమైన వాటితో కలుపకూడదు.

కాయ కోత తర్వాత  
*కోత తర్వాత కాయలను ఒకరోజు రాశిగా పోసి పట్టాతో కప్పితే సరిసమానంగా పండుతాయి.
* కాయలను నేల లేదా ఇసుక లేదా పేడతో అలికిన కళ్లాలపై ఆరబెట్టకూడదు. ఇలాచేస్తే.. ‘అఫ్లోటాక్సిన్‌’ సోకే ప్రమాదం ఉంటుంది. అందువల్ల కాయలను పాలిథీన్‌ పట్టాల మీద కానీ శుభ్రమైన కాంక్రీటు కళ్లాల మీద గానీ ఆరబెట్టాలి.
* కాయలను పలుచగా పోసి రోజూ తిరగ తిప్పుతుండాలి. కాయలు బాగా ఎండకపోతే రంగు, మెరుపు త్వరగా కోల్పోతాయి.
* కాయలను రాత్రిళ్లు మంచుబారిన పడకుండా పట్టాలతో కప్పి ఉంచాలి.  
* మిరపలో తేమ 10 శాతం మించకుండా ఎండబెట్టాలి. ఈ సమయంలో చెత్త చెదారం, దుమ్ము ధూళి చేరకుండా శుభ్రంగా ఉంచాలి. కాయలను ఎండబెట్టే చుట్టుపక్కల కోళ్లు, కుక్కలు, ఎలుకలు రాకుండా చర్యలు చేపట్టాలి.
*కాయలు అకాల వర్షాలకు గురికాకుండా, మంచుబారిన పడకుండా, రంగు కోల్పోకుండా ఉండేందుకు.. బ్యారన్లలో గానీ, ఆధునిక సోలార్‌ డ్రయర్లలో గానీ ఎండబెట్టవచ్చు.

నిల్వలో జాగ్రత్తలు
* బాగా ఎండిన మిరప కాయల నిల్వకు పొడి గోనె సంచులను వాడాలి. కాయలను నింపేటప్పుడు నీరు చల్లకూడదు.
* నిల్వ చేసిన బస్తాలకు తేమ తగలకుండా.. అడుగున చాపలు లేదా వరిపొట్టు, కర్రచెక్కలు లాంటివి పరచాలి. బస్తాలను గోడల నుంచి 50-60 సెం.మీ. దూరంలో పేర్చాలి.
* అవకాశమున్న ప్రాంతాల్లో శీతలీకరణ గిడ్డంగుల్లో నిల్వ చేస్తే కాయలు 8-10 నెలల వరకు రంగు, నాణ్యత కోల్పోకుండా ఉంటాయి.
* కాయలకు మంచి రంగు కోసం.. కృత్రిమ మందులు వాడరాదు.
* నిల్వ చేసిన మిరప కాయలను అప్పుడప్పుడు ఎండబెడుతుండాలి.              

- వై.ఎస్‌.కుమార్‌, తిరువూరు, కృష్ణాజిల్లా

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.