close
వరి నాటే రైతులకు సూచనలు

న్యూస్‌టుడే, మద్దికెర

రబీలో ఆలస్యంగా వరి నాటే రైతులు చేపట్టాల్సిన చర్యలను పత్తికొండ ఏడీఏ మహమ్మద్‌ఖాద్రీ (చరవాణి: 88866 13957) సూచించారు.
పొలం తయారీ : నాట్లు వేసే నాటికి 2-3 సార్లు దమ్ము చేయాలి. ఆఖరి దమ్ములో ఎకరాకు 40 కిలోలు వేపపూత యూరియా, 200 కిలోల సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌, 35 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ వేయాలి. చదరపు మీటరుకు 44 కుదుళ్లు ఉండేలా నాటాలి. నాట్ల తర్వాత ప్రతి 2 మీటర్లకు.. 20 సెం.మీ. కాలిబాటలు వదలాలి. దీనివల్ల పైరుకు గాలి, వెలుతురు సమంగా అంది చీడపీడల ఉద్ధృతి తగ్గుతుంది.  
ఎరువుల యాజమాన్యం : నాట్లు వేసిన 30, 60 రోజుల దశలో బురద పదును ఉన్నప్పుడు.. ఎకరాకు 30 కిలోల వేపపూత యూరియా వేయాలి. దీనివల్ల పిలకలు ఎక్కువగా వచ్చి, దుబ్బు బాగా కడుతుంది. తేలిక నేలల్లో అంకుర దశలో (నాటిన 60 రోజులకు) ఎకరాకు 35 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ వేయాలి.
నీటి యాజమాన్యం : నాటేటప్పుడు పొలంలో 2 సెం.మీ. మేర నీరుంచాలి. నాట్ల అనంతరం 4-5 రోజుల వరకు 5 సెం.మీ. మేర నీరు పెట్టడం వల్ల మొక్కలు త్వరగా వేరు తొడుగుతాయి. తర్వాత నుంచి 2 సెం.మీ. మేర మాత్రమే నీరుంచాలి. ఆ సమయంలో నీరు ఎక్కువైతే పిలకలు తక్కువగా వస్తాయి. పంట పొట్ట దశ నుంచి గింజలు పాలు పోసుకుని గట్టిపడే వరకు 5 సెం.మీ. నీరుపెట్టాలి. పంట మధ్య కాలంలో అప్పుడప్పుడు నీరుతీసి పొలాన్ని ఆరబెట్టి, తిరిగి నీరుపెట్టాలి. ఇలా చేస్తే పైరు ఆరోగ్యంగా ఉండి, చీడపీడల బెడద తగ్గుతుంది.  
కలుపు నివారణ : నాట్లు వేసిన 3-5 రోజుల్లో ఎకరానికి.. 40 గ్రా. ఆక్సాడయార్జిల్‌ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
సల్ఫైడ్‌ దుష్ప్రభావం : పంట మధ్య కాలంలో పైరులో అక్కడక్కడ కుదుళ్లు పసుపు రంగులోకి మారతాయి. దీనినే సల్ఫైడ్‌ దుష్ప్రభావం అంటారు. ఈ సమస్య ఉన్న పొలంలో నేల మెత్తబడి, కాలు దిగబడిపోతుంది. పొలంలో నడుస్తుంటే బుడగల రూపంలో గాలి బయటకు వస్తుంది. నేల నుంచి దుర్వాసన వస్తుంది. వేర్లను పీకితే నల్లగా ఉంటాయి.
నివారణ : మొక్కల వేర్లకు తగినంత గాలి అందేలా చూడాలి. మురుగునీటిని బయటకు పంపి కొత్త నీరు పెట్టాలి. అమోనియం సల్ఫేట్‌ (21 శాతం నత్రజని, 25 శాతం గంధకం ఉన్న ఎరువు) ఎరువులను పంటకు వాడకూడదు.
పురుగులు : నారుమడి నుంచి అంకురం వరకు కాండం తొలిచే పురుగు ఆశిస్తుంది. పిలకల దశలో ఈ పురుగాశిస్తే మొవ్వులు ఎండి చనిపోతాయి. పంట చిరుపొట్ట దశలో ఆశిస్తే.. తెల్ల కంకులు వస్తాయి. ముదురునారు నాటినప్పుడు ఇది ఎక్కువగా ఆశిస్తుంది. నివారణకు.. లీటరు నీటికి ఒక గ్రాము చొప్పున ఎసిఫేట్‌ కలిపి పిచికారీ చేయాలి లేదా ఎకరాకు కార్బోఫ్యూరాన్‌ 3జి గుళికలు 4 కిలోలు చొప్పున  చల్లి నివారించవచ్చు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.