close
చెరకు నాటే పద్ధతులు!

న్యూస్‌టుడే, పీలేరు (గ్రామీణం)

చెరకు నాటే యాజమాన్య పద్ధతులను పీలేరు వ్యవసాయ సహాయ సంచాలకులు మజీద్‌ అహ్మద్‌ (చరవాణి: 88866 12511) సూచించారు.  
నాటే విధానం : సాళ్ల మధ్య 80-100 సెం.మీ, జంట సాళ్ల మధ్య 60-120 సెం.మీ దూరం ఉండాలి. సాళ్లలో పారించిన నీరు ఇంకిన తర్వాత కళ్లు పక్కకు ఉండేలా ముచ్చెలను 2.5 సెం.మీ. లోతుకు మించకుండా నాటాలి.  
బోదెలు, కాలువ పద్ధతి : నేలను దుక్కి చేసి ఎత్తుపల్లాలు లేకుండా చేయాలి. రెక్కనాగలి లేదా ట్రాక్టర్‌తో నడిచే రిడ్జ్‌మార్కర్‌తో 30 సెం.మీ. వెడల్పు, 20 సెం.మీ. లోతు కాల్వలను 80 సెం.మీ. ఎడంతో తీయాలి. నీటి ముంపునకు గురయ్యే పల్లపు ప్రాంతాల్లో 25 సెం.మీ. దూరంలో 1 నుంచి 1.5 అడుగుల లోతులో అడ్డుకాల్వలు తీయడం ద్వారా మురుగునీరు త్వరగా బయటకు పోతుంది.
దూరపు సాళ్ల పద్ధతి : సాళ్ల మధ్య 4-5 అడుగుల ఎడంతో ఎకరానికి 16 వేల మూడు కళ్ల ముచ్చెలను నాటవచ్చు. ఈ పద్ధతిలో విత్తనం ఆదా అవుతుంది. అంతర పంటల సాగుకు అనుకూలం. బిందుసేద్యం ద్వారా సాగుచేస్తే ఖర్చు తగ్గుతుంది.
గుంతల పద్ధతి : వరుసల మధ్య 150 సెం.మీ., వరుసల్లో గోతుల మధ్య 120 సెం.మీ., ఎడం ఉండేలా 90 సెం.మీ. వ్యాసం, 45 సెం.మీ. లోతుండే గోతులు తీయాలి. ఎకరాకు 1800 గోతులు తీయాలి. గోతుల ద్వారా వచ్చిన మట్టిని పశువులు ఎరువు లేదా ఫిల్టరు మట్టితో కలిపి 15 సెం.మీ. మందం వరకు గోతులను నింపాలి. ప్రతి గోతికి 20 ముచ్చెలను నాటాలి. 16 ముచ్చెలను వలయాకారంలో నాటాలి. మిగిలిన 4 ముచ్చెలను మధ్యలో వరుసగా నాటాలి. ముచ్చెలపై 5 సెం.మీ. మేర మట్టి కప్పాలి. ఈ పద్ధతిలో చెరకు నాటితే 25 శాతం దిగుబడి పెరుగుతుంది.
ముచ్చెలతో నారు పెంపకం : ఈ పద్ధతిలో మూడు కళ్ల ముచ్చెలకు బదులు, చెరకు కన్నుల నుంచి పెంచిన నారును నాటవచ్చు. దీంతో విత్తన ఖర్చు నాలుగింట మూడొంతులు తగ్గుతుంది. నారును సులభంగా పెంచవచ్చు. కన్నులు తీసిన గడలను పంచదార తయారీకి వినియోగించవచ్చు. ఈ విత్తనాన్ని లీటరు నీటికి ఒక గ్రాము కార్బండజిమ్‌ + 2 మి.లీ. మలాథియాన్‌ కలిపి విత్తనశుద్ధి చేయాలి. వీటిని ప్లాస్టిక్‌ ట్రే గుంతల్లో.. 1/3 వంతు భాగం కోకోపీట్‌ నింపి, కన్నులు పైకి కనిపించేలా 60 డిగ్రీల వాలుతో నాటి తిరిగి కోకోపీట్‌ నింపాలి.
జంట సాళ్ల పద్ధతి : సాళ్ల మధ్య 2 అడుగులు, జంటసాళ్ల మధ్య 4 అడుగులు, 20 సెం.మీ. లోతుతో సాళ్లుచేసి ముచ్చెలను లేదా నారును నాటొచ్చు. పెడలపై జనుము, జీలుగ వంటి పచ్చిరొట్ట పైర్లు పెంచి, 40-45 రోజుల్లో నేలలో కలియదున్నితే భూసారం పెరుగుతుంది. ప్రధాన సాళ్ల మధ్య పెసర, మినుమ, బీర, బెండ వంటి అంతర పంటలు సాగుచేసి అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. చిక్కుడుజాతి పంటలను అంతర పంటగా విత్తితే భూసారం పెరుగుతుంది. వీటి సాగువల్ల చెరకు నాణ్యత, రసనాణ్యత తగ్గదు. సాళ్లు దగ్గరగా ఉండటం వల్ల జడచుట్టడం సులభం. ట్రాక్టర్‌ రొటవేటర్‌తో అంతరకృషి చేస్తే ఖర్చు తగ్గుతుంది. కలుపు మందుల పిచికారీ సులభం. తోటలో గాలి, వెలుతురు సమంగా అంది పిలకలు ఎక్కువగా వస్తాయి. బిందుసేద్యం ద్వారా నీటి వృథా తగ్గుతుంది. ఎకరాకు 2 టన్నుల దిగుబడి పెరుగుతుంది.


గొర్రెల్లో మశూచి
- న్యూస్‌టుడే, చాగలమర్రి

జీవాల్లో మశూచి వ్యాధిని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టకపోతే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పశుసంవర్థకశాఖ సహాయ సంచాలకులు వెంకట సుబ్బారెడ్డి (సెల్‌: 98856 07468) తెలిపారు. మశూచి వైరస్‌ కారణంగా వ్యాప్తి చెందే అంటువ్యాధి. దీన్నే బొబ్బ, అమ్మతల్లి, అమ్మోరు పేర్లతో పిలుస్తారు. మేకల్లో కన్నా గొర్రెల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మేత, నీరు, స్పర్శ, శ్వాస (గాలి), పనిముట్ల ద్వారా వ్యాధి వ్యాప్తిచెందుతుంది. చలికాలంలో, వేసవిలో (డిసెంబరు నుంచి ఏప్రిల్‌ వరకు) ఎక్కువగా వస్తుంది. జీవాల వయస్సుతో సంబంధం లేకుండా వ్యాపిస్తుంది. పెద్ద గొర్రెల్లో కన్నా పిల్లల్లో మరణాలు ఎక్కువగా ఉంటాయి.
లక్షణాలు : వ్యాధి గురైన జీవాలు.. దురద వల్ల మిగిలిన వాటిని రుద్దినప్పుడు అంటువ్యాధిలా వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన జీవాల చర్మంపై వెంట్రుకలు లేనిచోట్ల దద్దుర్లు కనిపిస్తాయి. ఇవి క్రమంగా పెరిగి శరీరమంతా వ్యాపించి జీవాలు బలహీనపడి నిలబడలేక కూలిపోతుంటాయి. దగ్గు బారినపడి చనిపోతాయి.
నివారణ : వ్యాధి సోకిన జీవాలను మంద నుంచి వేరు చేయాలి. పాకల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలి. స్థానికంగా ఉండే పశువైద్యులను సంప్రదించాలి.
ముందుగా టీకాలు వేయించాలి : వ్యాధి సోకని జీవాలకు (ముఖ్యంగా మూడు నెలలలోపు వయసున్న జీవాలకు తప్పనిసరిగా టీకా వేయించాలి) రక్షా-ఎస్‌పీ టీకాలు 2 మి.లీ. చొప్పున టీకాలను కండకు వేయాలి. ముందస్తు చర్యల్లో భాగంగా డిసెంబరు-ఫిబ్రవరి మాసాల్లో టీకాలు వేయించాలి.


 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.