close
ఎరలతో చీడల అదుపు!

న్యూస్‌టుడే, మానుకోట

వివిధ రకాల చీడపీడలు పంటలను ఆశించి తీవ్రనష్టం కలిగిస్తున్నాయి. వీటి నివారణకు పురుగుమందుల పిచికారీ వల్ల సాగు ఖర్చులు పెరగడమే కాకుండా పంటలకు మేలు చేసే మిత్రపురుగులు కూడా నశిస్తున్నాయి. రసాయన మందుల వాడకం తగ్గించి, సమగ్ర సస్యరక్షణ పద్ధతుల్లో భాగంగా ‘ఎర’లను ఉపయోగించి చీడపీడలను నియంత్రించి, నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చని మహబూబాబాద్‌ జిల్లా మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) శాస్త్రవేత్త రాములమ్మ (చరవాణి: 83175 05717) తెలిపారు.
జిగురు ఆకర్షక ఎరలు : ఇవి పసుపు, నీలి రంగులో ఉండే జిగురు అట్టలు. రసంపీల్చే తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక వంటి పురుగుల బెడద ఉండే అన్ని రకాల పైర్లలో పసుపు రంగు అట్టలను అమర్చవచ్చు. పసుపు రంగుకు పురుగులు ఆకర్షితమై జిగురుకు అతుక్కొని చనిపోతాయి. తామర పురుగుల నియంత్రణకు నీలిరంగు అట్టలను వాడాలి. రసంపీల్చే పురుగులు వైరస్‌ రోగాలను వ్యాప్తి చేస్తాయి. అందువల్ల పత్తి, మిరప, కూరగాయల సాగులో.. పంటలకు రెండడుగుల ఎత్తులో కర్రలను పాతి, ఎకరానికి 10-20 అట్టలను అమర్చాలి. వీటి ధర రూ.30-40 ఉంటుంది. రైతులు వీటిని సొంతంగానూ తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం.. ఏదైనా ఇనుప డబ్బాలకు పసుపు లేదా నీలి రంగు (అవసరాన్ని బట్టి) పూసి వాటికి జిగురు రాసి పంటలో ఉంచాలి.
లింగాకర్షణ ఎరలు
*దీనిలో బుట్ట, ఎర (ల్యూర్‌) అనే రెండు భాగాలుంటాయి. మార్కెట్‌లో గరాటు, బకెట్‌, డెల్టా ఆకారాల్లో ఈ బుట్టలు దొరుతాయి. వీటిలో ఉండే ల్యూర్‌ ఎరలు.. పొగాకు లద్దెపురుగు, శనగపచ్చ పురుగు, మక్క లద్దెపురుగు, పత్తిలో గులాబీరంగు కాయతొలుచు పురుగు, టమాట, వంగలో కాయతొలుచు పురుగులకు చెందిన రెక్కల పురుగులను ఆకర్షిస్తుంది. ఎరకు ఆడ రెక్కల పురుగు వాసన ఉంటుంది. మగ రెక్కల పురుగులు ఈ వాసనకు ఆకర్షితమై ఎర ఉంచిన బుటటలో పడి చనిపోతాయి. వీటివల్ల ఆడ రెక్కల పురుగులు గుడ్లు పెట్టడం తగ్గుతుంది. ఈ ఎరబుట్టల్లో పడిన పురుగు ఉద్ధృతి ఆధారంగా అవసరమైన మందులను పిచికారీ చేయవచ్చు.  
* మామిడి, జామ, కాకర, బీర వంటి పంటల్లో పండు ఈగల ఆకర్షించేందుకు ‘ప్రూట్‌ ఫ్లై’ ట్రాప్‌లను ఉపయోగించాలి.  
* వేరుసెనగను ఆశించే ఎర్రగొంగళి పురుగులకు ఎరగా చేలో రాత్రిపూట పెద్ద మంటలు వేస్తే రెక్కల పురుగులు ఈ మంటలో పడి చనిపోతాయి.  

దీపపు ఎరలు : ఈ ఎరకు రెక్కల పురుగులు ఆకర్షితమవుతాయి. పసుపు రంగులో వెలిగే బల్బు లేదా కిరోసిన్‌ లాంతరును వెలిగించి, రాత్రిపూట పొలం మధ్య పంటకు రెండడుగుల ఎత్తులో వేలాడదీయాలి. దీపపు బుట్ట కింద కిరోసిన్‌ కలిపిన నీటిని ఒక పాత్రలో ఉంచితే దీపం వెలుతురుకు రెక్కల పురుగులు ఆకర్షితమై, కిరోసిన్‌ ద్రావణంలో పడి చనిపోతాయి. దీన్ని ఎకరాకు ఒకటి చొప్పున అమర్చుకోవాలి. అన్ని రకాల పంటల్లో రెక్కల పురుగు నివారణకు దీన్ని  ఉపయోగించవచ్చు.
విషపు ఎర : 10 కిలోల తవుడు, 2 కిలోల బెల్లానికి తగినన్ని నీళ్లు కలిపి ఒకరోజు నిల్వచేయాలి. మరుసటి రోజు ఈ మిశ్రమానికి 200 మి.లీ. మోనోక్రోటోఫాస్‌ కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి సాయంత్రం పూట ఎకరం విస్తీర్ణంలో చల్లితే లద్దెపురుగు లార్వాలు విషపు ఎరలను తిని చనిపోతాయి.  
*మొక్కజొన్నను ఆశించే కత్తెర పురుగుకు చెందిన మూడో దశ దాటిన లార్వాల నివారణకు పులియ బెట్టిన బెల్లం, తవుడు మిశ్రమంలో 300 గ్రాముల థయోడికార్బ్‌ కలిపి మొక్క సుడుల్లో వేసి కత్తెరపురుగును నియంత్రించవచ్చు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.