close
చీని, నిమ్మలో యాజమాన్యం

న్యూస్‌టుడే, హన్వాడ

చీని, నిమ్మ తోటల్లో పాటించాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులను జడ్చర్ల ఉద్యానశాఖాధికారి హిమబిందు (సెల్‌: 79977 25169) సూచించారు. జీవన ఎరువులను ఎక్కువగా వాడాలి. డ్రిప్‌ ద్వారా ఫెర్టిగేషన్‌ పద్ధతిలో (నీరు, రసాయన ఎరువులను కలిపి) ఎరువులను అందించాలి. ప్రాంతాలను బట్టి చెట్లలో పూత వచ్చే సమయం మారుతుంది. లేత మొక్కలు ఏడాదికి 4-5 సార్లు చిగురిస్తాయి. ఈ సమయంలో ఆశించే పల్లాకు నివారణకు లీటరు నీటికి.. జింకు సల్ఫేట్‌ 5 గ్రా. + మాంగనీసు సల్ఫేట్‌ 2 గ్రా. + మెగ్నీషియం సల్ఫేట్‌ 2 గ్రా. + ఫెర్రస్‌ సల్ఫేట్‌ 2 గ్రా. + 1 గ్రా. బోరాక్స్‌ + 6 గ్రా. కాల్షియం లేదా సున్నం + 10 గ్రా. యూరియా మిశ్రమాన్ని కలిపి పిచికారీ చేయాలి. ఇలా ఏడాది నాలుగు సార్లు (జనవరి, ఫిబ్రవరి, జూన్‌, జులై) పిచికారీ చేయాలి. సున్నపు నేలల్లోని నిమ్మ తోటల్లో ఇనుపధాతు లోపం ఎక్కువగా ఉంటుంది. లోప సవరణకు 10 లీటర్ల నీటికి ఫెర్రస్‌ సల్ఫేట్‌ 20 గ్రా. + నిమ్మ ఉప్పు 2 గ్రా. చొప్పున కలిపి పది రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి.  
*తోటల్లో ఒకటి కన్నా ఎక్కువ పోషక లోపాలున్నప్పుడు వాటిని గుర్తించడం కష్టం. ఈ సందర్భాల్లో.. సూక్ష్మపోషకాల మిశ్రమం ఫార్ములా-4 లీటరు నీటికి 5 గ్రా. + అర మి.లీ. జిగురు +  మెగ్నీషియం సల్ఫేట్‌ 2 గ్రా. (ఫార్ములా-4లో మెగ్నీషియం ఉండదు) కలిపి ఏటా 4 సార్లు చెట్లపై పిచికారి చేయాలి.
చీనీ, నిమ్మ తోటల్లో మూడు సీజన్‌ల్లో పూత అధికంగా వస్తుంది. జనవరి-ఫిబ్రవరి మాసాల్లో వచ్చే పూతను ‘అంబే బహార్‌’, జూన్‌-జులై మాసాల్లో వచ్చే పూతను ‘మ్రిగ్‌ బహార్‌’, సెప్టెంబర్‌-అక్టోబర్‌ మాసాల్లో వచ్చే పూతను ‘హస్త బహార్‌’ అంటారు. వాతావరణ పరిస్థితులు, మార్కెట్‌ ధరలు, చీడపీడల నియంత్రణ, నీటివసతి సదుపాయాలను దృష్టిలో ఉంచుకొని ఏ సీజన్‌ పంట కావాలో రైతులు నిర్ణయించుకోవాలి.  
బహార్‌ ట్రీట్‌మెంట్‌ : పూత బాగా వచ్చేందుకు రైతులు బహార్‌ ట్రీట్‌మెంట్‌ పద్ధతిని ఆచరించాలి. ఇందులో భాగంగా చెట్లకు కొన్ని రోజులపాటు నీటి తడులను ఆపి, బెట్టకు గురి చేయాలి. ఆకులు కొద్దిగా వాడుముఖం పడుతున్నప్పుడు.. చెట్ల పాదుల్లో తవ్వి కలుపు మొక్కలను తొలగించి, ఆ తరువాత నీరివ్వాలి.
* తోటలో కలుపు నివారణకు 400 లీటర్ల నీటిలో.. అట్రజిన్‌ 800 గ్రా. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
* సేంద్రియ, పచ్చిరొట్ట ఎరువులు వాడితే భూమిలో తేమ నిల్వ సామర్థ్యం పెరిగి చెట్లు బాగా కాపునిస్తాయి. ఎరువులు వేసేటప్పుడు కాండం చుట్టూ ఒక మీటరు దూరంలో 15-20 సెం.మీ. వెడల్పు, 15 సెం.మీ. లోతుతో కందకం తవ్వి ఎరువులను వేసి మట్టి కప్పాలి.  
* నీటి ఎద్దడి ప్రాంతాల్లో చెట్ల పాదుల్లో మల్చింగ్‌ కోసం.. ప్లాస్టిక్‌ షీట్లు, ఎండాకులు, వరిపొట్టు, వేరుసెనగ పొట్టు 8 సెం.మీ. మందంలో వేసి తేమ ఆవిరవ్వకుండా చేయాలి.  
*కొత్తగా నాటిన తోటల్లో కాపు రాకముందు 2-3 ఏళ్ల వరకు అంతర పంటలుగా వేరుసెనగ, బంతి, అపరాలు, దోస, ఉల్లి, పుచ్చ సాగు చేయవచ్చు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.