close
కూరగాయ పంటల్లో సస్యరక్షణ

న్యూస్‌టుడే, జగిత్యాల (వ్యవసాయం)

కూరగాయల పంటలను వివిధ రకాల చీడపీడలు ఆశించి నష్టం కలిగిస్తున్నాయి. వీటి నివారణకు చేపటాల్సిన సస్యరక్షణ చర్యలను జగిత్యాల జిల్లా ఉద్యానశాఖ అధికారి జె.ప్రతాప్‌సింగ్‌ (సెల్‌: 79977 25061) తెలిపారు.
* వంగలో.. మొగిపురుగు ఆశించిన మొవ్వు భాగాన్ని తుంచేయాలి. పురుగు నివారణకు లీటరు నీటికి ప్రొఫెనోఫాస్‌ 2 మి.లీ. చొప్పున కలిపి పది రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. కాయ కోత తర్వాతే మందు ద్రావణాన్ని పిచికారీ చేయాలి. పచ్చదోమల వల్ల వెర్రి తెగులు వ్యాపిస్తుంది. ఈ తెగులు ఆశించిన మొక్కలు గుబురుగా కనిపిస్తాయి. తెగులాశించిన మొక్కలను తొలగించాలి. తెగులును వ్యాప్తిచేసే పచ్చదోమల నివారణకు పది లీటర్ల నీటికి ఇమిడాక్లోప్రిడ్‌ 3 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.

* బెండలో.. బూడిద తెగులు నివారణకు లీటరు నీటికి.. 3 గ్రా., నీటిలో కరిగే గంధకం లేదా కెరాథేన్‌ 1 మి.లీ. చొప్పున కలిపి వారం, పది రోజుల వ్యవధితో రెండుసార్లు పిచికారీ చేయాలి. మొవ్వు, కాయతొలుచు పురుగుల నివారణకు లీటరు నీటికి 3 గ్రా. కార్బరిల్‌ లేదా 2 మి.లీ. క్వినాల్‌ఫాస్‌ కలిపి 10 రోజుల వ్యవధితో రెండుసార్లు పైరుపై పిచికారీ చేయాలి. పచ్చదోమ, తెల్లదోమల నివారణకు లీటరు నీటిని 2 మి.లీ. మిథైల్‌ డెమటాన్‌ లేదా ఫిప్రోనిల్‌ కలిపి పిచికారీ చేయాలి.
* కాకర, బీర తోటల్లో.. గుమ్మడి పెంకు పురుగుల నివారణకు లీటరు నీటికి మలాథియాన్‌ 2 మి.లీ. కలిపి పిచికారీ చేయాలి. పొట్లాకు పురుగు నివారణకు లీటరు నీటికి 2 మి.లీ. క్వినాల్‌ఫాస్‌ కలిపి పిచికారీ చేయాలి. బూడిద తెగులు నివారణకు.. లీటరు నీటికి.. 3 గ్రా. నీటిలో కరిగే గంధకం కలిపి పిచికారీ చేయాలి. పేనుబంక పురుగు నివారణకు లీటరు నీటికి 2 మి.లీ. మిథైల్‌ డెమటాన్‌ కలిపి పిచికారీ చేయాలి.
* చిక్కుడులో.. పంట పూత, పిందె, కాయ దశల్లో కాయతొలుచు పురుగు ఆశించి నష్టపరుస్తుంది. నివారణకు లీటరు నీటికి కార్బరిల్‌ 3 గ్రా. లేదా మలాథియాన్‌ 2 మి.లీ. చొప్పున కలిపి పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.

టమాటలో.. ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు నివారణకు లీటరు నీటికి పైరాక్సిస్ట్రోబిన్‌ 1 గ్రాము చొప్పున కలిపి పిచికారీ చేయాలి. కాయతొలుచు పురుగు నివారణకు.. నాటిన 28, 35 రోజులకు లీటరు నీటికి 2 మి.లీ. ప్రొఫెనోఫాస్‌ లేదా క్వినాల్‌ఫాస్‌ కలిపి పిచికారీ చేయాలి.

కాలీఫ్లవర్‌, క్యాబేజి.. కుళ్లురోగం ఆశిస్తే లీటరు నీటికి మాంకోజెబ్‌ 3 గ్రా. చొప్పున కలిపి మొక్క చుట్టూ మట్టి తడిచేలా పోయాలి. రసంపీల్చే పురుగుల నివారణకు లీటరు నీటికి డైమిథోయేట్‌ 2 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి. పొగాకు లద్దెపురుగుల నివారణకు విషపు ఎరల తయారీకి.. 10 కిలోల తవుడు + 2 కిలోల బెల్లం + రెండు లీటర్ల నీటిలో కలిపి, 24 గంటలు పులియబెట్టాలి. ఈ మిశ్రమానికి 100 గ్రా. థయోడికార్బ్‌ కలిపి చిన్న ఉండలుగా చేసి సాయంత్రం పూట పొలంలో చల్లాలి.

మిరపలో.. పై  ముడత నివారణకు లీటరు నీటికి ఫిప్రోనిల్‌ 2 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి. కిందిముడత నివారణకు.. లీటరు నీటికి డైకోఫాల్‌ 5 మి.లీ. కలిపి పిచికారీ చేయాలి. కాయకుళ్లు తెగులు నివారణకు లీటరు నీటికి కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ 3 గ్రా. లేదా ప్రొపికొనజోల్‌ 1 గ్రాము చొప్పున కలిపి పిచికారీ చేయాలి. బూడిద తెగులు నివారణకు లీటరు నీటికి.. 3 గ్రా. నీటిలో కరిగే గంధకం లేదా డైనోకాప్‌ 1 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.