close
సేద్యంలో వైవిధ్యం!

ఆర్మూర్‌ రైతుల ఆదర్శ సేద్యం
వరి బదులు ఆరుతడి పంటల సాగు
అమ్ముల మోహిత్‌ నాగప్రసాద్‌ (ఈజేఎస్‌)

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ ప్రాంతం ఆదర్శ సేద్యానికి చిరునామాగా నిలుస్తోంది. ఇక్కడి రైతులు వాణిజ్య పంటలను సాగు చేస్తూ అధిక దిగుబడులను సాధిస్తూ, లాభాలు పొందుతున్నారు. నీటిని పొదుపుగా వాడుతున్నారు. ఎకరా పొలంలో ఏడాదికి 3-5 పంటలు పండిస్తున్నారు. పసుపును ప్రధాన పంటగా సాగు చేస్తూ.. మొక్కజొన్న, ఉల్లి, సజ్జలు, సోయా, వేరుశనగ, టమాట, కొత్తిమీర, ఎర్రజొన్నలు, కూరగాయలు, ఆకుకూరలు వంటి ఆరుతడి పంటలను అంతరపంటలుగా సాగు చేస్తున్నారు. పంటమార్పిడి విధానాన్ని అనుసరిస్తున్నారు. రైతుల వద్దకే వ్యాపారులు వచ్చేలా.. గ్రామాల్లో సొంతంగా మార్కెట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఈ రైతులకు రవాణా ఖర్చులు తప్పాయి. దళారుల సమస్య లేదు.

పంటమార్పిడితో అధిక దిగుబడులు
ఒక ఏడాది పసుపు, మొక్కజొన్న, టమాట, సజ్జ, కొత్తిమీర.. ఇలా వివిధ రకాల పంటలను సాగు చేస్తే.. మరో ఏడాది మొక్కజొన్న, వేరుశనగ, ఉల్లి, సజ్జ, ఎర్రజొన్నలు.. ఇలా పంట మార్పిడి క్రమాన్ని పాటిస్తారు. మార్కెట్‌ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఉన్న కొద్ది పొలాన్ని చిన్న చిన్న మడులుగా విభజిస్తారు. అందులో ఆకుకూరలు విత్తుతారు. స్వల్పకాలిక కూరగాయలను సాగుచేస్తారు. ఏదైనా ఒక పంట ధర తగ్గితే.. మరో పంట ద్వారా ఆ నష్టాలను భర్తీ చేసుకుంటున్నారు.

అంతర పంటగా మొక్కజొన్న
పసుపులో అంతరపంటగా మొక్కజొన్నను నాటుతారు. దాదాపు 85 రోజుల్లోనే కండెలు పచ్చిగా ఉన్నప్పుడే.. మొక్కజొన్నను స్థానిక మార్కెట్‌లో విక్రయిస్తారు. 8 నెలల తరువాత పసుపును తవ్వితీస్తారు. అనంతరం సజ్జ లేదా టమాట పండిస్తారు. ఈ పంటలు పూర్తికాగానే ఆకుకూరలు సాగుచేస్తారు. నీరు తక్కువుంటే నువ్వులను సాగుచేస్తారు. ఇలా 3-5 పంటలు పండిస్తారు.
మరుసటి ఏడాది.. ఖరీఫ్‌లో మొక్కజొన్న సాగు చేస్తారు. పంట చేతికొచ్చాక.. భూమిని దున్నకుండానే నీరు పారించి, ఆరిన తర్వాత వేరుశనగ విత్తుతారు లేదా ఉల్లిని నాటుతారు. అంతకుముందే ఉల్లి నారును పలుచగా రెండు నెలలపాటు పెంచుతారు. చిన్నపాయలుగా ఉన్నప్పుడే వేర్లతో సహా జాగ్రత్తగా తీసి, ఆకుభాగం కోసి, చేలోనే వారంపాటు ఆరనిచ్చి తర్వాత ఇళ్లల్లో 2-3 నెలలు విత్తనంగా నిల్వచేస్తారు. మొక్కజొన్న తర్వాత నాటిన ఉల్లి సుమారు 75 రోజుల్లో కోతకొస్తుంది. దీంతో ఒక నెల పంటకాలం రైతులకు ఆదా అవుతుందని రైతులు చెబుతున్నారు. అనంతరం ఎర్రజొన్న సాగు చేస్తారు. నాలుగు నెలల్లో ఈ పంట చేతికి వస్తుంది. ఇతర రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలకు సైతం ఎర్రజొన్నను విత్తనంగా ఎగుమతి చేస్తారు.

విత్తనోత్పత్తి కేంద్రాలు
ఈ ప్రాంతంలో రైతులే విత్తనోత్పత్తి కేంద్రాలు నిర్వహిస్తున్నారు. కొన్ని కంపెనీల పర్యవేక్షణలో ఉన్నాయి. ఇలా ఈ ప్రాంతంలో సుమారు 52 విత్తనోత్పత్తి కేంద్రాలుంటే అందులో అంకాపూర్‌లోనే 28 ఉండడం విశేషం. ఈ కంపెనీల వారు సజ్జ, ఎర్రజొన్న, సోయా, మొక్కజొన్న, వరి, నువ్వులు తదితర పంటల విత్తనాలను పండించడానికి రైతులతో ఒప్పందం చేసుకుంటారు. వారి నుంచి సేకరించిన నాణ్యమైన విత్తనాలను బహుళజాతి కంపెనీలకు సరఫరా చేస్తారు. ఈ రకంగా రైతులు అధికాదాయాన్ని ఆర్జిస్తున్నారు.


తక్కువ నీటితో ఎక్కువ పంటలు

ఉన్న కొద్దిపాటి నీటి వనరులను రైతులు పొదుపుగా వినియోగించుకుంటారు. ఎకరం వరి పొలానికి వినియోగించే నీటితో నాలుగెకరాల్లో వాణిజ్య పంటలను సాగు చేస్తారు. బోర్ల నుంచి వచ్చే నీటిని ట్యాంకుల్లో నిల్వ చేస్తారు. ఈ ట్యాంకుల నిర్మాణానికి సుమారు రూ.4 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. బిందుసేద్యం వంటి నీటి నిర్వహణ పద్ధతులను పాటిస్తున్నారు. రెండేళ్లకోసారి గోదావరి నల్లమట్టి, చెరువు మట్టి, పశువుల పేడ వేసి చేలను పరిపుష్టి చేస్తున్నారు.


పంటల సాగులో మహిళలే కీలకం

ఇక్కడి మహిళలు పొలం పనులను చూస్తుండగా.. పురుషులు మార్కెటింగ్‌ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. సస్యరక్షణలో స్థానిక వ్యవసాయాధికారుల సూచనలు పాటిస్తున్నారు. ఇక్కడి రైతుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ కనిపిస్తుంది.
 


శ్రమతోనే సాధ్యం
- కె.కె.బాజన్న, రైతు, అంకాపూర్‌ (సెల్‌: 98494 46161)

ఆధునిక సేద్యానికి తోడు నిరంతర శ్రమ, పట్టుదల ఇక్కడి రైతులు రాణించడానికి కారణం. ఏటా 3-4 పంటలనేది ఇక్కడ సాధారణ విషయం.

కుటుంబ సహకారంతోనే ముందుకు
- లక్ష్మీ, మహిళ రైతు, కంఠం గ్రామం

వ్యవసాయ పనులను మేమే చూసుకుంటాం. దీంతో కూలీల ఖర్చులు తగ్గుతాయి. ఇంటిల్లిపాది చేస్తేనే వ్యవసాయం గిట్టుబాటవుతుంది. భూమిని ఖాళీగా ఉంచకుండా గట్లపై కూడా ఏదో ఒక ఆకుకూర పండిస్తాం.
సంప్రదాయ పంటలతోనే సత్ఫలితాలు

- మేకల గోవింద్‌, జిల్లా వ్యవసాయాధికారి, నిజామాబాద్‌
ఆహార, వాణిజ్య పంటల సాగులో ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. పండించిన పంటను సొంతంగా మార్కెట్‌ చేసుకుంటున్నారు. ప్రభుత్వ రాయితీలను సద్వినియోగం చేసుకుంటున్నారు. పంటల సాగులో అధికారుల సూచనలు పాటిస్తున్నారు

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.