close
మొక్కజొన్నలో ప్రస్తుత చర్యలు

న్యూస్‌టుడే, ఎమ్మిగనూరు (వ్యవసాయం)

రబీలో సాగు చేసిన మొక్కజొన్నలో ప్రస్తుతం చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను బనవాసిఫారం కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త జి.ప్రసాద్‌బాబు (సెల్‌: 74163 84968) తెలిపారు.
ఎరువులు: పంట 25-30, 45-50 రోజుల దశలో ఎకరానికి 43 కిలోల చొప్పున యూరియా వేయాలి. పంట 60-65 రోజుల దశలో ఎకరానికి 43 కిలోల యూరియాతో పాటు 25 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ వేయాలి.
నీటి యాజమాన్యం: పూత ప్రారంభదశ, పూతదశ, పూత వచ్చిన 15 రోజులకు, గింజ పాలుపోసుకునే దశల్లº నీరివ్వాలి.


పోషక లోపాలు

భాస్వరం: మొక్కల్లో ఎదుగుదల లోపించి సన్నగా ఉంటాయి. ఆకు చివర్లు, ఈనెలు, కాండం ఊదా రంగులోకి మారుతుంది. ఈ లక్షణాలు ముందుగా ముదురాకుల్లో కనిపిస్తాయి. నివారణకు లీటరు నీటికి.. డి.ఎ.పి 20 గ్రా. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.  
పొటాషియం: ఇది ముందుగా ముదురాకుల్లో కనిపిస్తుంది. ఆకు అంచుల నుంచి ఆంగ్ల అక్షరం ‘వి’ ఆకారంలో ఎండుతుంది. నివారణకు లీటరు నీటికి పొటాషియం నైట్రేట్‌ 10 గ్రా. చొప్పున కలిపి పిచికారీ చేయాలి. పై పాటుగా ఎరువులు వేసేటప్పుడు భూమిలో తగినంత తేమ ఉండాలి. ఎరువులు వేసిన అనంతరం సాళ్లలో మట్టి ఎగదోయాలి.
జింక్‌ లోపం: ఆకులు పసుపు రంగులోకి మారుతాయి లేదా లేత పైరు తెల్ల మొగ్గగా.. కనిపిస్తే లీటరు నీటికి 2 గ్రా. జింక్‌ సల్ఫేట్‌ కలిపి పిచికారీ చేయాలి.


చీడపీడలు

కాండం తొలుచు పురుగు: పైరు మొలకెత్తిన 15-20 రోజులకు గులాబిరంగు కాండం తొలుచు పురుగు ఆశిస్తుంది. ఈ పురుగులు తొలిచిన ఆకులపై గుండు సూది వంటి రంధ్రాలు పొడవుగా కనిపిస్తాయి. ఎదిగిన లార్వాలు అంకురాన్ని తినడం వల్ల మొవ్వు ఎండిపోతుంది. నివారణకు ఎకరానికి 3 కిలోల కార్బోప్యురాన్‌ 3జి గుళికలు ఆకు సుడుల్లో వేయాలి.
కత్తెర పురుగు: తొలిదశ లార్వాలు పత్ర హరితాన్ని గోకి తినడం వల్ల ఆకులపై తెల్లటి పొర ఏర్పడుతుంది. 2-3 దశలోని లార్వాలు ఆకు సుడుల్లో చేరి రంధ్రాలు చేసి తినడం వల్ల విచ్చుకున్న ఆకులపై వరుసగా రంధ్రాలు ఏర్పడతాయి. పురుగు సుడుల్లో ఉండి ఆకులను పూర్తిగా కత్తిరిస్తుంది. ఆకుల సుడుల్లో పురుగు విసర్జితాలు పసుపు పచ్చని గుళికల రూపంలో కనిపిస్తాయి. ఎదిగిన లార్వాలు ఆకులను బయట నుంచి లోపలికి తింటూ ఈనెలుగా చేస్తాయి. కంకి పొరలను తొలుస్తూ రంధ్రాలు చేసి లోపలి గింజలను తిని నష్టపరుస్తుంది.
నివారణ: పంట 25, 40 రోజుల దశల్లో ఎకరానికి నాలుగు లింగాకర్షక బుట్టలు అమర్చి పురుగు ఉద్ధృతిని గమనించాలి. పది లీటర్ల నీటికి నొవాల్యురాన్‌ 10 మి.లీ. లేదా స్పయినోశాడ్‌ 3.5 మి.లీ. కలిపి పిచికారీ చేయాలి. ఎకరానికి 4 కిలోల క్లోరాంత్రనిలిప్రోల్‌ 4జి గుళికలను ఆకు సుడుల్లో వేయాలి.
పురుగు ఉద్ధృతిని అరికట్టేందుకు విషపు ఎరల తయారు చేసి వేయాలి. ఇందుకోసం.. 10 కిలోల తవుడు + 2 కిలోల బెల్లం + 2 లీటర్ల నీరు కలిపి 24 గంటలపాటు పులియబెట్టిన తర్వాత 100 గ్రా. థయోడికార్బ్‌ కలిపి చిన్న ఉండలుగా చేసి సాయంత్రం పూట ఆకుల సుడులు, మొవ్వుల్లో వేయాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.