close
ఉల్లి రైతులకు సూచనలు!

న్యూస్‌టుడే, ఎమ్మిగనూరు (వ్యవసాయం)

వేసవి పంటగా ఉల్లి సాగు చేపట్టనున్న రైతులు నారు పెంపకం, నాటేటప్పుడు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను బనవాసిఫారం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) సమన్వయకర్త జి.ప్రసాద్‌బాబు (ఫోన్‌: 74163 84968), సస్యరక్షణ శాస్త్రవేత్త బి.హెచ్‌.చైతన్య (సెల్‌: 80745 22354) సూచించారు.
నారు పెంపకం: నేలను కలియదున్ని 120 సెం.మీ. వెడల్పు, 3 మీటర్ల పొడవు గల ఎత్తు నారుమళ్లను చేయాలి. ఎకరాలో సాగుకు.. 2 నుంచి రెండున్నర కిలోల విత్తనాన్ని 200-250 చ.మీ. విస్తీర్ణంలో పెంచిన నారు సరిపోతుంది. విత్తేముందు కిలో విత్తనానికి 3 గ్రా. కాప్టాన్‌ లేదా థైరమ్‌ కలిపి విత్తనశుద్ధి చేయాలి. నారుమడిలో విత్తనాన్ని పలుచగా వరుసల్లో విత్తాలి. నారుకుళ్లు తెగులు ఆశించకుండా 10 రోజులకోసారి లీటరు నీటికి కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ 3 గ్రా. చొప్పున కలిపి పిచికారీ చేయాలి. నారు పెరుగుదల దశలో రసంపీల్చే పురుగులు ఆశించకుండా కార్బోఫ్యూరాన్‌ 3జి గుళికలను మడిలో చల్లి నీరుపెట్టాలి.  
నేల తయారీ: ఎకరాకు 10 టన్నుల మాగిన పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. ఆఖరు దుక్కిలో ఎకరాకు 2 కిలోల చొప్పున జీవన ఎరువులైన అజోస్పయిరిల్లం, ఫాస్ఫోబ్యాక్టీరియా వేస్తే మంచి దిగుబడి వస్తుంది. గడ్డల నాణ్యత, గాఢత కోసం ఎకరాకు 10 కిలోల చొప్పున సల్ఫర్‌ను నేలలో వేయాలి.
కలుపు నివారణ, అంతరకృషి : నారు నాటేముందు ఎకరాకు 200 లీటర్ల నీటిలో.. ప్లుక్లోరాలిన్‌ (45శాతం) లీటరు లేదా పెండిమిథాలిన్‌ (30 శాతం) లీటరున్నర చొప్పున కలిపిన ద్రావణాన్ని పిచికారీ చేసి, నేలను కలియదున్ని నాటాలి లేదా నారు నాటిన 2-3 రోజుల్లో తేమ ఉన్నప్పుడు ఎకరాకు 200 లీటర్ల నీటిలో ఆక్సీఫ్లోరోఫిన్‌ (23.5 శాతం) 200 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి. నాటిన 30, 45 రోజుల్లో కలుపుతీసి మట్టిని ఎగదోయాలి.


నాటడం

నేలను 2-3 సార్లు దుక్కిచేసి చదును చేయాలి. 30 సెం.మీ. ఎడంతో బోదెలను చేసి, మొక్కలను బోదెకు ఇరువైపులా నాటాలి. నారు నాటేముందు కుళ్లు తెగులు ఆశించకుండా.. 10 లీటర్ల నీటికి.. 10 మి.లీ. మలాథియాన్‌ + 5 గ్రా. కార్బండజిమ్‌ చొప్పున కలిపిన ద్రావణంలో నారును 20 నిమిషాల పాటు ముంచి నాటితే.. పంట తొలిదశలో ఆశించే చీడపీడల నుంచి రక్షణ లభిస్తుంది. 6-7 వారాల వయస్సున్న నారును ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. 


ఎరువులు

నాటేముందు.. ఎకరాకు 70-85 కిలోల యూరియా, 150-200 కిలోల సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌, 20 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ ఎరువులను వేయాలి. నాటిన నెల తర్వాత.. 70-85 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ను మరోసారి వేయాలి. పొటాష్‌ వేయడం ద్వారా గడ్డ ఊరుతుంది. గడ్డ ఊరే దశలో వేరుసెనగ పిండి లేదా ఆముదం పిండి వేసి గొప్పు తవ్వి మట్టిని ఎగదోస్తే మంచి దిగుబడి వస్తుంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.