close
బిందు సేద్యానికి రాయితీలు!

న్యూస్‌టుడే, ఒంటిమిట్ట

బిందుసేద్య పరికరాల కొనుగోలుకు ప్రభుత్వం ఉద్యానశాఖ ద్వారా అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని కడప జిల్లా సూక్ష్మనీటి సాగు పథకం జిల్లా పథక సంచాలకులు డి.మధుసూదన్‌రెడ్డి (సెల్‌: 79950 87055) సూచించారు.
రాయితీకి అర్హతలు
* రైతుకు సొంత భూమితో పాటు భూ హక్కు పత్రం, పట్టాదారు పాసుపుస్తకం ఉండాలి. సంబంధిత భూమి ఆన్‌లైన్‌లో నమోదై, ఆధార్‌ సంఖ్యతో అనుసంధానమై ఉండాలి. వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్‌ ఉండాలి. బియ్యం కార్డు (రేషన్‌ కార్డు), నివాస ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.  

* వీటన్నింటితోపాటు భూక్షేత్ర పటం జతచేసి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. పారదర్శకత కోసం వేలిముద్ర (బయోమెట్రిక్‌) విధానం తప్పనిసరి చేశారు.
* బిందు పరికరాలను సరఫరా చేసే సంస్థను రైతే ఎంపిక చేసుకోవచ్చు. ఎంపిక చేసుకున్న కంపెనీ ప్రతినిధి క్షేత్ర సర్వే చేసి నీటి వనరులను, భూమిని పరిశీలిస్తారు. అనంతరం జియో ట్యాగింగ్‌ చేసి రాయితీయేతర చెల్లించాల్సిన మొత్తాన్ని రైతు చరవాణికి సంక్షిప్త సందేశం పంపుతారు.
* రైతులు తమ వాటా డబ్బును జిల్లా పథక సంచాలకులు లేదా రాష్ట్ర పథక అధికారి ఖాతాకు చెల్లించాలి. సూక్ష్మనీటి సాగు పథకం అధికారులు జిల్లా కలెక్టర్‌ ద్వారా అనుమతి పొందిన తర్వాత.. మళ్లీ రైతు చరవాణికి సమాచారం పంపుతారు.
* బిందు పరికరాలు, సామాగ్రి రైతుకు అందిన తర్వాత కూడా రైతు చరవాణికి సందేశం వస్తుంది. ప్రభుత్వం మంజూరు చేసిన బిందు పరికరాలు, సామాగ్రి ఆయా సంస్థ నుంచి వచ్చిన వెంటనే ఇండెంట్‌ డెలివరీ చలానాలో నమోదు చేసిన పరికరాలన్నీ వచ్చాయో లేదా సరి చూసుకోవాలి.
* పొలంలో పైపుల ఏర్పాటుకు గాడి తీసుకుంటే కంపెనీ ప్రతినిధులు వచ్చి పరికరాలను అమర్చుతారు. ఇందుకు రైతులు ప్రతినిధులకు పైసా చెల్లించాల్సిన పనిలేదు. నిర్వహణలో సందేహాలుంటే అధికారులు లేదా కంపెనీ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి నివృత్తి చేసుకోవచ్చు.
ఏ పంటలకు: ఉద్యాన పంటల్లో మామిడి, అరటి, బొప్పాయి, బత్తాయి, నిమ్మ, జామ, సపోట, దానిమ్మ, ఉసిరి, అంజూర, కొబ్బరి, ఆయిల్‌పామ్‌ వంటి ఉద్యాన పంటలతో పాటు ఇతర పండ్ల తోటలకు బిందు సేద్య పరికరాలను ఏర్పాటు చేసుకోవచ్చు. అన్ని రకాల కూరగాయలు, పూల తోటలకు వీటిని అమర్చుకోవచ్చు. పసుపు, తమలపాకు, పత్తి, చెరకు, మొక్కజొన్న, వేరుసెనగ, నువ్వు, కంది పైర్లలోనూ ఉపయోగించవచ్చు. మొక్కల సాంద్రత ఆధారంగా పైపులు, లేటరల్స్‌, ఇతర సామగ్రి, పరికరాలను అందిస్తారు.


ఎంత రాయితీ

ఐదెకరాల్లోపు భూమి ఉన్న అన్ని ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం రాయితీ ఇస్తారు. గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు లబ్ధి పొందవచ్చు. ఐదెకరాల్లోపు భూమి ఉన్న ఇతర రైతులకు 90 శాతం రాయితీ వర్తిస్తుంది. రూ.2 లక్షల విలువ చేసే పరికరాలు అందుతాయి.  
* కడప, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో 5-10 ఎకరాల భూమి ఉన్న రైతులందరికీ 90 శాతం రాయితీ వర్తిస్తుంది. రూ.2.80 లక్షలు విలువ చేసే పరికరాలు అందిస్తారు. మిగతా జిల్లాల రైతులకు 75 శాతం రాయితీ వర్తిస్తుంది. 10 ఎకరాలకు పైనున్న ఏ రైతుకైనా 50 శాతం రాయితీ కింద సుమారు రూ.4 లక్షలు విలువ చేసే పరికరాలు ఇస్తారు.  
* ఒకసారి ప్రభుత్వ పరిమితి మేరకు రాయితీ పొందిన రైతులు తిరిగి ఏడేళ్ల వరకు మళ్లీ రాయితీ పొందలేరు.
* రైతు తనకు రావలసి ఉన్న మొత్తం రాయితీని ఒకటి కన్నా ఎక్కువ పంటలకు కూడా వర్తింపజేసుకునే వెసులుబాటు ఉంటుంది.


డ్రిప్‌తో ఉపయోగాలు

* తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలను సాగు చేయవచ్చు. విద్యుత్‌తో పాటు సాగునీటిని పొదుపు చేయవచ్చు.
* పొలమంతా నీరు పారించాల్సిన అవసరం ఉండదు.
* కలుపు సమస్య తక్కువగా ఉంటుంది.
* సాధారణ సాగుపద్ధతితో పోలిస్తే.. దిగుబడి 25 శాతం పెరుగుతుంది.
* ఫెర్టిగేషన్‌ పద్ధతిలో రసాయన ఎరువులను సాగునీటితో పాటే మొక్కలకు అందించవచ్చు. ఈ పద్ధతిలో ఎరువుల వృథాను నివారించవచ్చు. ఎరువుల వాడకం 25-30 శాతం వరకు తగ్గుతుంది.
ః ఈ పద్ధతిలో చౌడు, క్షార నేలల్లోనూ పంటలు విత్తవచ్చు. సాగు ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.