close
నాటుకోళ్ల పెంపకం లాభాల వ్యాపకం!

సేంద్రియ పద్ధతిలో కోళ్ల పెంపకానికి శ్రీకారం
నాటుకోడి గుడ్లు, నిల్వ పచ్చళ్లతో లాభాలు గడిస్తున్న రైతు
నీలం ఫౌండేషన్‌ పేరిట నిరుపేదలకు ఉపాధి  
తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న రవికిరణ్‌
బండారు హరీశ్‌, ఈనాడు జర్నలిజం స్కూల్‌

కొత్త ఆలోచనలకు ప్రణాళికాబద్దమైన ఆచరణ తోడైతే.. ఏ రంగంలోనైనా విజయం వరిస్తుందని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెం గ్రామానికి చెందిన యువరైతు నీలం రవికిరణ్‌ నిరూపిస్తున్నారు. నాటుకోళ్ల పెంపకంపై ఉన్న ఆసక్తిని జీవనోపాధిగా మలచుకున్నారు. నాటుకోళ్లను పెంచి, వాటి గుడ్లను, మాంసాన్ని నిల్వ పచ్చళ్లుగా చేసి విక్రయిస్తూ ఆర్థికంగా ఎదిగి ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎంతో మంది నిరుపేద మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు.

కోళ్ల పెంపకంపై ఆసక్తితోనే..
ఉన్నత విద్య పూర్తిచేసిన రవికిరణ్‌ వ్యవసాయానుబంధ రంగాలపై ఉన్న అభిరుచితో నాటుకోళ్ల పెంపకం చేపట్టారు. 2017లో చెన్నై నుంచి వంద కోడి పిల్లలను తెచ్చి పెంపకం ప్రారంభించారు. మరో 500 పిల్లలను కొనుగోలు చేసి తనకున్న రెండెకరాల విస్తీర్ణంలో 400 గజాల స్థలంలో రూ.5 లక్షల వ్యయంతో ఫారం నిర్మించారు. ప్రస్తుతం ఫారంలో పెరటి, గిరిజ, అడవి, బీవీ-380 రకం నాటుకోళ్లు 4 వేలు వరకు పెంచుతున్నారు. వీటి ద్వారా రోజు దాదాపు 800 గుడ్లు వస్తున్నాయి. ఫారానికి అవసరమైన కోళ్లను సొంతంగా పొదిగించి పెంపకం చేపడుతున్నారు. కోళ్ల పోషణకు హైడ్రోపోనిక్‌ పద్ధతిలో ట్రేలలో పెంచిన మొక్కజొన్న, గోధుమ గడ్డి, ఆకుకూరలను ముక్కలుగా కత్తిరించి అందిస్తున్నారు. అవసరమైన మినరల్స్‌ అందిస్తున్నారు. మొక్కజొన్న, జొన్నలు, రాగులు, మినుములు, నూకలు, తవుడు వంటి వాటిని తక్కువ ధరకు లభించే సమయంలో కొనుగోలు చేసి నిల్వ చేసుకొని దాణాగా అందిస్తున్నారు. కోళ్ల వ్యర్థాలతో ఎరువు తయారు చేసి, తన పొలంలో మామిడి, దానిమ్మ, జామ, నిమ్మ, కొబ్బరి, అరటి వంటి చెట్లకు ఎరువుగా వినియోగిస్తున్నారు. ఉన్న స్థలంలోనే చిన్న నీటికుంటను తవ్వించి చేపల పెంపకం చేపడుతున్నారు. కోళ్లు, చేపల పెంపకంలో గుంటూరు లాంఫామ్‌లోని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తున్నారు.
అనుబంధ రంగాలపైనా దృష్టి సారించాలి
- డాక్టర్‌ కె.రాజకిశోర్‌, కేవీకే సీనియర్‌ శాస్త్రవేత్త, లాంఫాం, గుంటూరు

మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు సాగు విధానాల్లో మార్పు చేసుకోవాలి. సాగుతో పాటు వాటి అనుబంధ రంగాలపై దృష్టి సారిస్తే.. ఒకదానిలో నష్టం వచ్చినా మరోదానిలో వచ్చే ఆదాయంతో నష్టాలను పూడ్చుకోవచ్చు. బ్రాయిలర్‌ కోళ్లతో పోలిస్తే నాటుకోళ్ల పెంపకం ఖర్చు తక్కువే. వ్యాధులు ఎక్కువగా రావు. ప్రస్తుతం మార్కెట్లో నాటుకోళ్లకు మంచి గిరాకీ ఉన్నందున ఆదాయం బాగుంటుంది. ఆసక్తి ఉన్న రైతులకు అవసరమైన సూచనలు, సలహాలు అందిస్తాం.

కేంద్ర ప్రభుత్వ పురస్కారం
రవికిరణ్‌ తన మూడోఏటే తండ్రిని కోల్పోయారు. చిన్నప్పటి నుంచి ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని కుటుంబ సభ్యులు, స్నేహితుల సాయంతో నిలదొక్కుకున్నారు. తన తండ్రి జ్ఞాపకార్థం 2017లో ‘నీలం ఫౌండేషన్‌’ను స్థాపించి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఫౌండేషన్‌ సేవలను ఫేస్‌బుక్‌లో చూసిన కొందరు జర్మనీ దేశీయులు ఇక్కడికి వచ్చి రవికిరణ్‌ అందిస్తున్న సేవలను అభినందించారు. ఈ ఫౌండేషన్‌ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం గతేడాది డిసెంబరులో ‘రాష్ట్ర్రీయ విశిష్ట్‌ సేవా సమ్మాన్‌-2019’ పురస్కారంతో రవికిరణ్‌ను సన్మానించింది.
విభిన్నంగా ఆలోచించాలి
- నీలం రవికిరణ్‌, రైతు (చరవాణి : 98497 71709)

రైతులు కేవలం వ్యవసాయంపైనే కాకుండా అనుబంధ రంగాలైన చేపల పెంపకం, కోళ్లు, పండ్లు, కాయగూరలు, పూల తోటల సాగుపైనా దృష్టి సారించాలి. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. నాటుకోళ్ల ఫారాన్ని పొలంలో ఏర్పాటు చేసుకుంటే.. వచ్చే వ్యర్థాలు పంటలకు ఎరువుగా ఉపయోగపడతాయి. బయటి నుంచి ఎరువులను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. రాబడిని బట్టి ఫారాన్ని విస్తరించుకుంటే మంచి లాభాలు వస్తాయి.
పచ్చళ్ల విక్రయంతో ఉపాధి
ఫారంలో గుడ్లు పెట్టడం ఆగిపోయిన కోళ్లను పచ్చళ్ల తయారీకి వినియోగిస్తున్నారు. ఇందుకోసం నీలంఫుడ్‌ ప్రోడక్ట్స్‌ పేరిట చిన్న పరిశ్రమను స్థాపించారు. ఇందులో దాదాపు 60 మంది మహిళలు, 30 మంది పురుషులకు ఉపాధి కల్పిస్తున్నారు. ఇలా తయారైన ఉత్పత్తులను తెలంగాణ, దిల్లీ, బెంగళూరు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. కిలో నాటుకోడి పచ్చడి రూ.800 చొప్పున విక్రయిస్తున్నారు. ఇటీవల ఇథియోపియా దేశానికి వెయ్యి కిలోల పచ్చడి ఎగుమతి చేశారు. ఫారంలో ఉత్పత్తవుతున్న ఒక్కో గుడ్డును రూ.8-10లకు విక్రయిస్తున్నారు. ఫారం నిర్వహణ, కూలీలు, దాణా వగైరా ఖర్చులు పోను నెలకు రూ.2.50 లక్షల లాభం పొందుతున్నారు.  
* రైతు కృషిని గుర్తించిన కృషి విజ్ఞాన కేంద్రం’ (కేవీకే) శాస్త్రవేత్తలు సేంద్రియ సాగు, లాభసాటి వ్యవసాయంపై జనవరి 3-7 వరకు బెంగళూరులో నిర్వహించిన 107వ అంతర్జాతీయ సైన్సు కాంగ్రెస్‌ సదస్సుకు రవికిరణ్‌ను ఎంపిక చేసి పంపించారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.