close
వేరుశనగలో సస్యరక్షణ

రబీలో సాగు చేస్తున్న వేరుశనగ పంటను  చీడపీడలు ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. ప్రస్తుత దశలో వాటి నివారణకు  చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలను హాలహర్వి మండల వ్యవసాయాధికారి రూఫస్‌రొనాల్డ్‌ (సెల్‌ : 88866 13955) తెలిపారు.

రసంపీల్చే పురుగులు
* తామర పురుగులు: పంట మొలకెత్తిన 9వ రోజు నుంచి వీటి తల్లి, పిల్ల పురుగులు ఆకులపై పత్రహరితాన్ని గోకి రసాన్ని పీలుస్తాయి. వీటి ఉద్ధృతికి ఆకులు ముడుచుకొని, మొక్కలు గిడసబారుతాయి. ఇవి మొవ్వు, కాండంకుళ్లు,  వైరస్‌ తెగుళ్లను వ్యాప్తిచేసే ప్రమాదం ఉంది. నివారణకు.. లీటరు నీటికి ఫిప్రోనిల్‌ 2 మి.లీ. చొప్పున కలిపి 10-20 రోజుల వ్యవధిలో రెండుసార్లు పైరుపై పిచికారీ చేయాలి.
* పేనుబంక: వీటి తల్లి, పిల్ల పురుగులు గుంపులుగా చేరి చిగుర్లు, లేతాకుల అడుగు భాగం, పూత నుంచి రసాన్ని పీలుస్తాయి. ఇవి పూత దశలో ఆశిస్తే పూత రాలుతుంది. ఈ పురుగులు స్రవించే తేనె వంటి జిగురు పదార్థంపై శిలీంద్రం నల్లని బూజులా ఏర్పడుతుంది. నివారణకు ఎకరాకు 200 లీటర్ల నీటిలో డైమిథోయేట్‌ 400 మి.లీ. + ఇమిడాక్లోప్రిడ్‌ 60 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి. పంటలో చీడపురుగులను అదుపుచేసే అక్షింతల పురుగులు ఎక్కువగా ఉంటే.. క్రిమిసంహారక మందుల వినియోగం తగ్గించాలి. అక్షింతల పురుగులను రైతుమిత్ర పురుగులుగా పిలుస్తారు.
* ఆకుపచ్చ దోమ: వీటి పిల్ల, తల్లి పురుగులు ఆకుల అడుగు నుంచి రసాన్ని పీలుస్తాయి. దీంతో ఆకు పైభాగాన ‘వి’ ఆకారంలో పసుపు పచ్చని మచ్చలు ఏర్పడి క్రమంగా ఆకులన్నీ పసుపు రంగుకు మారుతాయి. నివారణకు డైమిథోయేట్‌ 400 మి.లీ. + ఇమిడాక్లోప్రిడ్‌ 60 మి.లీ. 200 లీటర్లు నీటిలో కలిపి ఎకరాలో పిచికారి చేయాలి.

- న్యూస్‌టుడే, హాలహర్వి


ఆకుముడత

ఇది పంట విత్తిన 15 రోజుల నుంచి ఆశిస్తుంది. ఇవి ఆకులను గూడులా చేసి పత్రహరితాన్ని గోకి తినడం వల్ల ఆకులన్నీ ఎండి, దూరం నుంచి చూస్తే.. కాలినట్లు కనిపిస్తాయి. దీన్ని అగ్గితెగులు అంటారు. నివారణకు ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసి పురుగు ఉద్ధృతిని గమనించాలి. పురుగు ఉద్ధృతంగా ఉంటే.. నివారణకు.. 200 లీటర్ల నీటికి.. మోనోక్రోటోఫాస్‌ 320 మి.లీ. లేదా క్లోరిపైరిఫాస్‌ అర లీటరు లేదా నొవాల్యురాన్‌ 200 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.


* వేరు పురుగు: నేలలో తెల్లటి శరీరం, ఎరుపు రంగు తల కలిగి అర్ధచంద్రాకారంలో ఉన్న పురుగులు మొక్కల వేర్లను కత్తిరిస్తాయి. తేలికపాటి నేలల్లో వీటి ఉద్ధృతి అధికంగా ఉంటుంది. పురుగాశించిన మొక్కలు ఎండి చనిపోతాయి. పీకితే సులువుగా ఊడి వస్తాయి. సాళ్ల వరుసల్లో మొక్కలు గుంపులుగా చనిపోతాయి. పంట దశలో ఈ పురుగుల నివారణ సాధ్యం కాదు. పంట విత్తేముందు చేపట్టే లోతుదుక్కులు, విత్తేటప్పుడు ఫోరేట్‌ (10 శాతం) గుళికలు ఎకరాకు 6 కిలోలు వేయడం, విత్తనశుద్ధి చేసి విత్తడం.. వంటి చర్యలు పురుగు అదుపునకు తోడ్పడతాయి.


* పొగాకు లద్దె పురుగు: వీటి తల్లి పురుగులు లేత గోధుమ రంగులో ఉండి ఆకుపైన, అడుగున నూగుతో కప్పిన గుడ్లు పెడతాయి. ఈ గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు గుంపులుగా ఉండి ఆకుపై పత్రహరితాన్ని గోకి తిని, ఆకులను జల్లెడలా చేస్తాయి. పురుగు పగటివేళ నేలలో దాగి ఉండి, రాత్రిపూట మొక్కలను ఆశించి ఆకులను పూర్తిగా తినేస్తాయి. నివారణకు ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలు పెట్టి మగ రెక్కల పురుగులను ఆకర్షించాలి. పంటలో అక్కడక్కడ ఆముదం, పొద్దుతిరుగుడు మొక్కలను ఎర మొక్కలుగా విత్తాలి. ఎకరానికి 200 లీటర్ల నీటిలో.. క్వినాల్‌ఫాస్‌ 400 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉద్ధృతంగా ఉంటే.. విషపు ఎరలను వినియోగించాలి. వీటి తయారీకి.. 10 కిలోలు తవుడు + 2 కిలోల బెల్లం + 2 లీటర్ల నీరు కలిపి 24 గంటలు పులియబెట్టాలి. ఈ మిశ్రమానికి 100 గ్రా. థయోడికార్బ్‌ కలిపి చిన్న ఉండలుగా చేసి ఎకరంలో సాయంత్రం పూట చల్లాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.