close
పండ్ల తోటల్లో ప్రస్తుత చర్యలు

వాతావరణంలో వస్తున్న మార్పులు, పగలు, రాత్రి ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాల కారణంగా ఉద్యాన పంటల్లో చీడపీడలు ఆశించే ప్రమాదం ఉంది. ప్రస్తుతం పండ్ల తోటల్లో చేపట్టాల్సిన చర్యలను ఉద్యానశాఖ రాజంపేట సహాయ సంచాలకులు ఎం.రవీంద్రనాథ్‌రెడ్డి (సెల్‌: 79950 86787) సూచించారు.

మామిడి: ప్రస్తుతం పూత, లేత పిందెల దశలో ఉంది. పిందె రాలుడు తగ్గేందుకు.. 9 లీటర్ల నీటికి ప్లానోఫిక్స్‌ 2 మి.లీ. చొప్పున కలిపి చెట్టంతా తడిచేలా పిచికారీ చేయాలి. తామర, తేనెమంచు పురుగుల ఉద్ధృతి అధికమైతే లీటరు నీటికి ఫిప్రోనిల్‌ 2 మి.లీ. లేదా ఎసిఫేట్‌ 1.5 గ్రా. వంతున కలిపి పిచికారీ చేయాలి. ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చిలో అకాల వర్షాలు కురిస్తే.. తెగుళ్లు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. వీటి నివారణకు లీటరు నీటికి.. 3 గ్రా. కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ లేదా కాపర్‌ హైడ్రాక్సైడ్‌ చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
అరటి: గెలలు వేసిన చెట్లకు మట్టిని ఎగదోయాలి. కర్రలు, వెదురు గడలను పాతి ఊతమివ్వాలి. గెలలో హస్తాలు పూర్తిగా విచ్చుకున్న 5, 15వ రోజున లీటరు నీటికి 5 గ్రా. పొటాషియం నైట్రేట్‌ (13:0:45) లేదా సల్ఫేట్‌ ఆఫ్‌ పొటాష్‌ కలిపి ఆకులు, గెలలు తడిచేలా పిచికారీ చేయాలి. అనంతరం గెలలకు 2 శాతం రంధ్రాలున్న తెలుపు రంగు పాలిథీన్‌ సంచులను తొలగాలి.

నిమ్మ: ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో భూమిలో తేమ శాతం తగ్గకుండా చర్యలు చేపట్టాలి. క్రమం తప్పకుండా నీటి తడులివ్వాలి. పంట పూతదశలో ఒకసారి, పిందె గోళిసైజు దశలో ఒక దఫా 9 లీటర్ల నీటికి ప్లానోఫిక్స్‌ 2 మి.లీ. వంతున కలిపి పిచికారీ చేయాలి. కాయ కోతకు రెండు నెలల ముందు ఇదే మోతాదులో మరోదఫా పిచికారీ చేయాలి. రసంపీల్చే పురుగులైన.. నల్లదోమ, ఎగిరే పేను, పొలుసు పురుగుల నివారణకు.. పది లీటర్ల నీటికి ఇమిడాక్లోప్రిడ్‌ 5 మి.లీ. లేదా థయోమిథాక్సామ్‌ 3 గ్రా. లేదా స్పైనోసాడ్‌ 4 మి.లీ. లేదా ఫిప్రోనిల్‌ 20 మి.లీ. లేదా డైమిథోయేట్‌ 20 మి.లీ., + వేపనూనె 5 మి.లీ. కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు చెట్టంతా తడిచేలా పిచికారీ చేయాలి.

జామ: వానకాలంలో వచ్చే పంట (అంబే బహార్‌)ను నియంత్రించి, శీతాకాలంలో దిగుబడి వచ్చేలా చేసేందుకు.. ఫిబ్రవరి నుంచి మే వరకు నీటి తడులను ఆపేయాలి.

సీతాఫలం: మొక్కలు అంటు కట్టేందుకు ఇదే అనువైన సమయం.

ద్రాక్ష: ఈ కాలంలో పక్షుల బెడద నుంచి తోటలను రక్షించేందుకు తోటపై వలను ఏర్పాటు చేయాలి. పంట నాణ్యత పెరిగేందుకు.. పొటాష్‌ ఎరువులు వాడాలి.

సపోటా: కాయతొలిచే పురుగు నివారణకు.. లీటరు నీటికి వేపగింజల కషాయం 50 మి.లీ. లేదా వేపనూనె 5 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి. లేత చిగుర్లు, పూత దశలో లీటరు నీటికి మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ. లేదా ప్రొఫెనోఫాస్‌ 2 మి.లీ. వంతున కలిపి వారం రోజుల వ్యవధిలో మందులను మార్చి పిచికారీ చేయాలి.

పనస: తోటలకు తప్పనిసరిగా తడులివ్వాలి. పూత మొదలై పిందె కట్టే దశలో.. కుళ్లు తెగులు ఆశిస్తే.. నివారణకు లీటరు నీటికి 3 గ్రా. కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ కలిపి పిచికారీ చేయాలి.

- న్యూస్‌టుడే, ఒంటిమిట్ట


దానిమ్మ

బ్యాక్టీరియా మచ్చ తెగులు నివారణకు 10 లీటర్ల నీటికి..  30 గ్రా. కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ + స్ట్రెప్టోసైక్లిన్‌ 1 గ్రాము వంతున  కలిపి పిచికారీ చేయాలి. బ్యాక్టీరియా తెగులు, కాయతొలుచు పురుగులు ఆశించిన కాయలను తొలగించి కాల్చేయాలి.


బొప్పాయి

* నారు పెంచే రైతులు.. రసంపీల్చే పురుగులు ఆశించకుండా 40-60 సైజు ఉన్న నైలాన్‌ మెష్‌నెట్‌ హౌస్‌లో పెంచాలి.
* పంట నాటే 15 రోజుల ముందు తోటచుట్టూ అవిశ, మొక్కజొన్న, జొన్నలను రెండు వరుసలు రక్షణ పంటగా పెంచి తెగుళ్ల వ్యాప్తిని అరికట్టవచ్చు.
* నారు నాటే 3 రోజుల ముందు మొక్కలపై లీటరు నీటికి ఎసిఫేట్‌ 1.5 గ్రా. వంతున కలిపి పిచికారీ చేయాలి.
* తెల్లదోమ, పేనుబంక ఉద్ధృతి నియంత్రణకు పసుపు, నీలి రంగు జిగురు అట్టలను ఎకరానికి 12-15 చొప్పున అమర్చాలి.
* లీటరు నీటికి వేపనూనె 5 మి.లీ. చొప్పున కలిపి 15 రోజుల వ్యవధిలో పురుగుల ఉద్ధృతిని బట్టి పిచికారి చేయాలి.
* రింగ్‌ స్పాట్‌ వైరస్‌ సోకిన మొక్కల్లో దిగుబడి, కాయ   నాణ్యతను పెంచడానికి లీటరు నీటికి.. యూరియా 10 గ్రాము + జింక్‌ సల్ఫేట్‌ ఒకటిన్నర గ్రాములు + బోరాన్‌ ఒక గ్రాము చొప్పున  కలిపి పిచికారీ చేయాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.