close
చెరకులో సస్యరక్షణ

న్యూస్‌టుడే, పీలేరు (గ్రామీణం)

చెరకును ఆశించే చీడపీడల నివారణకు సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టకపోతే రస నాణ్యతతో పాటు దిగుబడి పూర్తిగా క్షీణించే ప్రమాదం ఉందని పీలేరు వ్యవసాయ సహాయ అధికారి మజీద్‌ అహ్మద్‌ (చరవాణి: 88866 12511) తెలిపారు.

పీకపురుగు లేదా కాండం తొలిచే పురుగు: ఇది పంట నాటినప్పటి నుంచి నరికే వరకు పైరును ఆశిస్తుంది. వర్షాధార పంటను పీక పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. పైరు తొలిదశలో పీక పురుగుగా, కాండం ఏర్పడిన తర్వాత కాండం తొలుచు పురుగుగా దీన్ని పిలుస్తారు. ఈ పురుగు నివారణకు.. ముచ్చెలను లోతు కాల్వల్లో నాటాలి. నీటితడుల మధ్య తక్కువ వ్యవధి ఉండాలి. మొక్క నాటిన మూడోరోజు, కార్శి తోటల్లో.. కార్శి చేసిన వెంటనే ఎకరాకు 1.25 టన్నుల చొప్పున చెరకు చెత్తను చాళ్లలో పరచాలి. ముచ్చెలు నాటిన 4, 5, 9 వారాల్లో లీటరు నీటికి.. కార్బరిల్‌ 3 గ్రా. లేదా మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ట్రైకోగ్రామా ఖిలోనిస్‌ గుడ్ల పరాన్నజీవులను ఎకరాకు 20 వేల చొప్పున పంట నాటిన నెల రోజుల వ్యవధిలో 4 సార్లు వదలాలి.
దూదేకుల పురుగు: ఇవి ఆకుల అడుగున గుంపులుగా చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు వడలి ఎండుతాయి. పురుగాశించిన చెరకు నుంచి తయారు చేసిన బెల్లం నల్లగా, మెత్తగా ఉండి నిల్వకు పనికిరాదు. నివారణకు లీటరు నీటికి మలాథియాన్‌ 2 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.

వేరు లద్దెపురుగు: ముచ్చెలు నాటే ముందు ఎకరాకు ఫోరేట్‌ (10 శాతం) గుళికలను 8-10 కిలోల చొప్పున వేయాలి. ఎదిగే తోటల్లో పురుగు నివారణకు.. ఎకరాకు ఫోరేట్‌ (10 శాతం) గుళికలను 8 కిలోల చొప్పున మొక్కల మొదళ్ల వద్ద గుంతలు చేసి వేయాలి.
తెల్లపేను (ఊలి ఎఫిడ్‌): తల్లి, పిల్ల పురుగులు ఆకుల అడుగున గుంపులుగా చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకులపై తెలుపు, పసుపు మిళితమైన మచ్చలు ఏర్పడతాయి. క్రమంగా ఆకులు ఎండుతాయి. ఈ పురుగులు విసర్జించిన తియ్యని జిగురు పదార్థంపై నల్లటి శిలీంద్రం పెరుగుతుంది. మబ్బు వాతావరణం, గాలిలో 80-90 శాతం తేమ ఉన్నప్పుడు ఈ పురుగు బాగా వృద్ధి చెందుతుంది.

నివారణ: ఆరోగ్యవంతమైన తోటల నుంచి విత్తనాన్ని సేకరించాలి. ముచ్చెలను నాటే ముందు.. లీటరు నీటికి మలాథియన్‌ 2 మి.లీ. చొప్పున కలిపిన ద్రావణంలో పావుగంట ముంచి నాటాలి. సిఫారసు మేరకు నత్రజని ఎరువులను వాడాలి. పురుగాశించిన ఆకులను తీసి కాల్చేయాలి. లీటరు నీటికి మలాథియాన్‌ 2 మి.లీ లేదా మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ. లేదా ఎసిఫేట్‌ 1 గ్రా. చొప్పున కలిపి తోటపై పిచికారీ చేయాలి.

పొలుసు పురుగు: చెరకు కణుపుల దశ నుంచి పంట నరికే వరకు ఇది ఆశిస్తుంది. నివారణకు విత్తనపు దవ్వను పురుగాశించని తోటల నుంచి సేకరించాలి. ముచ్చెలను లీటరు నీటికి మలాథియాన్‌ 2 మి.లీ. లేదా డైమిథోయేట్‌ 1.7 మి.లీ. కలిపి ద్రావణంలో పావుగంట ముంచి నాటాలి. తోటలో పురుగు వ్యాప్తి నివారణకు ఆకులను రెలిచి (మొవ్వులో కనీసం 8 ఆకులు ఉంచాలి), లీటరు నీటికి డైమిథోయేట్‌ 1.7 మి.లీ. లేదా మలాథియాన్‌ 3 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.

చెదలు: తేలిక నేలల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నివారణకు.. పుట్టలను తవ్వి రాణి ఈగను చంపాలి. ప్రతి పుట్టకు 200 గ్రా. మిథైల్‌ పెరాథియాన్‌ పొడి చల్లి చదును చేయాలి. నాటే ముందు కాల్వల్లో ఎకరాకు 10 కిలోల మిథైల్‌ పెరాథియాన్‌ చల్లాలి.

తెల్లదోమ: ఇవి ఆకుల అడుగున చేరి రసాన్ని పీల్చడం వల్ల పంట ఎదుగుదల తగ్గుతుంది. ఆకులు నారింజ రంగులోకి మారి మొక్కలు గిడసబారతాయి. నీటి ముంపునకు గురైన తోటలు, సిఫారసు మేరకు ఎరువులు వేయని తోటలు, కార్శి తోటల్లో ఇవి అధికంగా ఆశిస్తాయి. నివారణకు లీటరు నీటికి మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ. లేదా డైమిథోయేట్‌ 1.7 మి.లీ. చొప్పున కలిపి 10, 12 రోజుల వ్యవధిలో రెండుసార్లు ఆకులు కింద, పైన తడిచేలా పిచికారీ చేయాలి.

పిండినల్లి: ఆకుల తొడిమలు, చెరకు గడల వద్ద గుంపులుగా చేరి రసాన్ని పీలుస్తాయి. పంట పక్వదశలో వీటి ప్రభావం అధికంగా ఉంటుంది. ఉద్ధృతి ఎక్కువైనప్పుడు మొవ్వు ఎండుతుంది. నివారణకు.. విత్తనపు దవ్వను నాటే ముందు లీటరు నీటికి మలాథియాన్‌ 2 మి.లీ. లేదా డైమిథోయేట్‌ 1.7 మి.లీ చొప్పున కలిపిన ద్రావణంలో పావుగంట ముంచి నాటాలి. పంటపై పురుగుల నివారణకు ఆకులను రెలిచి, బహిర్గతమైన కణుపులపై లీటరు నీటికి మలాథియాన్‌ 2 మి.లీ. లేదా డైమిథోయేట్‌ 1.7 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.