close
వరికి తెర.. ఎలుకకు ఎర!

పంట నష్టాన్ని అరికట్టే కొత్త పద్ధతి!
న్యూస్‌టుడే, ఉండి

పంటలకు చీడపీడలతోనే కాకుండా ఎలుకల వల్ల కూడా అధిక నష్టం సంభవిస్తుంది. ఎలుకల వల్ల ప్రతీ సీజన్‌లో ఎకరానికి కనీసం 3-4 బస్తాల దిగుబడిని రైతులు కోల్పోతున్నారు. విత్తనం చల్లిన దగ్గరి నుంచి పంట విక్రయించే వరకూ ఎలుకల బెడద ఉంటుంది. చిరుపొట్ట దశలో ఎలుకలు ఉధృతంగా దాడి చేసి పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఉండి కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ ఎన్‌.మల్లికార్జునరావు తెలిపారు. ఎలుకల నిర్మూలనకు తెర పద్ధతిలో కలిగే ప్రయోజనాలను వివరించారు.

ఎలుకల నిర్మూలనకు రైతులు ఆచరిస్తున్న పద్ధతులను సైతం అధిగమించే స్థాయికి అవి ఎదుగుతున్నాయి. కొన్నిసార్లు ఎలుకల నియంత్రణ రైతులకు చాలా కష్టమవుతోంది.

* ఎలుకల నిర్మూలన పద్ధతుల్లో నేరుగా పట్టించే విధానం ప్రధానమైనది. ఈ పద్ధతిలో సీజన్‌లో ఎకరానికి రూ.1,200ల వరకూ రైతులు ఖర్చు చేయాల్సి వస్తోంది.
* రెండోది.. గుర్తించిన బొరియల్లో పొగబెట్టి చంపడం.
* మూడో విధానం.. బ్రోమోడయోలిన్‌ ఎరతో సామూహికంగా ఎలుకల నిర్మూలన కార్యక్రమాన్ని అమలు చేయడం.
* నాలుగో పద్ధతి.. జింక్‌ ఫాస్ఫైడ్‌తో నిర్మూలన. ఈ ఎర వినియోగం చాలా ప్రమాదకరమైనది. ఈ మందు తిన్న ఎలుక వెంటనే చనిపోయే ప్రమాదముంది. ఎలుకలు తమ సంతతికి నష్టం వాటిల్లుందని గ్రహిస్తే.. ఆ సీజన్‌ ముగిసే వరకు ఆ మందును ముట్టుకోవని రైతులు గ్రహించాలి.
* అయిదోది.. ‘తెర పద్ధతి’. ఈ విధానంలో.. ఏ రకమైన మందులు వేయకుండానే చేలో ఏర్పాటుచేసిన తెరవైపు ఎలుకలను ఆకర్షించేలా చేసి, సులభంగా వాటిని అరికట్టవచ్చు.


ప్లాస్టిక్‌ షీటుతో తెర..

* తొలుత 2.5 అడుగుల ఎత్తున్న ప్లాస్టిక్‌ షీటు తీసుకోవాలి. అర అడుగు వరకూ దాన్ని చేలో దించాలి.
* పైకి రెండడుగులు ఎత్తున్న షీట్‌కి ఇనుప తీగ, వెదురు బద్దల సహాయంతో (చిత్రంలో చూపిన మాదిరిగా) పైరు చుట్టూ గోడ మాదిరిగా తెర ఏర్పాటు చేయాలి.
* చేనుకు, గట్టుకు మధ్య అడుగు దూరం ఉంచాలి.
* ప్రతీ 15-20 మీటర్లకు, నీటిమట్టం పైభాగంలో తెరకు 10 సెం.మీ. వ్యాసంలో రంధ్రం చేసి, తెర లోపలి భాగంలో తీగ బోను అమర్చాలి.
* గట్టు నుంచి తీగ బోనులున్న ప్రాంతానికి మట్టితో మార్గాన్ని ఏర్పాటు చేయాలి. ఎలుకలు ఎక్కువగా సంచరించే పెద్దగట్లున్న మడిలో ఈ విధానాన్ని అమలు చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. పైరు చిరుపొట్ట దశకు చేరుకునే 15-20 రోజుల ముందే ఇది ఏర్పాటు చేయాలి.
* ఫ్లాస్టిక్‌ షీట్‌ చుట్టూ నీరుండేలా చూడాలి. నీరుంటే.. పట్టు దొరకక తెరకు ఎలుకలు రంధ్రాలు చేయలేవు. నీటిలో ఈదుకుంటూ తెర రంధ్రం (బోను ముఖద్వారం) వద్ద అమర్చిన గట్టు నుంచి తీగ బోనులోకి ప్రవేశించి చిక్కుతాయి.
* తెరకు ముడతలు పడకుండా నిటారుగా ఉంచుకోవాలి. ఒకవేళ తెరకు రంధ్రాలు పడితే వెంటనే సరిచేసుకోవాలి.
* తీగ బుట్టలను గమనిస్తూ.. పడిన ఎలుకలను ఎప్పటికప్పుడు బయటకు తీయాలి. వాటి స్థానే వేరే తీగ బుట్టలు ఉంచాలి.
* రైతుకు అనువైన చోట.. చేలోకి వెళ్లి వచ్చేందుకు ప్రత్యేకంగా దారి ఏర్పాటు చేసుకోవాలి.
* ఈ పద్ధతిని ఆచరిస్తే.. పర్యావరణానికి ఏవిధమైన హాని కలగదు.
* ఈ విధానం అమలుకు ఎకరాకు 250 మీటర్ల పొడవైన ప్లాస్టిక్‌ షీట్‌ అవసరం. దీనికి సుమారు రూ.3 వేలు ఖర్చవుతుంది. భద్రపరిచే విధానాన్ని బట్టి ఈ షీట్లు రెండు, మూడు పంట సీజన్ల వరకూ ఉపయోగపడుతాయి.
* ఒక్కో తీగ బుట్ట ఖరీదు రూ.250. వీటిని నాలుగైదు సంవత్సరాల వరకూ వినియోగించుకోవచ్చు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.