
రబీ వరిని ఆశించి నష్టపరిచే చీడపీడల నివారణకు రైతులు తమకు తోచిన విధంగా మందులు కొనుగోలు చేసి చల్లకూడదు. పురుగులు, తెగుళ్ల ఉనికిని గమనించిన వెంటనే సమీప వ్యవసాయాధికారిని సంప్రదించి, వారి సూచనలను పాటించాలి. దీనివల్ల రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గడమే కాకుండా.. శ్రమ, సమయం ఆదా అవుతాయి. రైతుల అవగాహన కోసం.. వరిలో సమస్యాత్మక చీడపీడల గుర్తింపు, నివారణకు చేపట్టాల్సిన చర్యలపై నిపుణుల సూచనలు..
అగ్గి తెగులు
తెలంగాణలో వరి పండించే అన్ని ప్రాంతాల్లో ఇది ఆశిస్తుంది. గాలిలో తేమ శాతం 80 కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఆకులపై నూలు కండె ఆకారంలో గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. తెగులు తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఈ మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకు మొత్తం ఎండిపోతుంది. దూరం నుండి చూస్తే పైరు పూర్తిగా తగలబడినట్లు కనిపిస్తుంది. ఈ తెగులు సాధారణంగా పొట్ట దశకు ముందు ఆకులపై కనిపిస్తుంది. దీని నివారణకు లీటరు నీటికి.. ప్రొపికొనజోల్ 1 మి.లీ. లేదా హెక్సాకొనజోల్ 2 మి.లీ. చొప్పున కలిపి తెగులు తీవ్రతను బట్టి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పంటపై పిచికారి చేయాలి.
పొట్టకుళ్లు తెగులు
ఈ తెగులు సాధారణంగా పైరు పాలు పోసుకునే దశలో ఆశిస్తుంది. వెన్నును చుట్టుకొని ఉన్న ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. తర్వాత దశలో పొట్ట నుంచి పాక్షికంగా బయటకు వచ్చిన గింజలపై కూడా గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. దీంతో గింజలు నాణ్యత కోల్పోతాయి. కొన్ని సందార్భల్లో గింజలు పొట్టలో ఉండగానే కుళ్లిపోతాయి. దీని నివారణకు.. పైరు పొట్ట దశలో 10 లీటర్ల నీటికి 30 గ్రా. మాంకోజెబ్ లేదా 5 గ్రాముల బినోమిల్ చొప్పున కలిపి 10, 15 రోజులకోసారి పిచికారి చెయ్యాలి.
సుడిదోమ (దోమపోటు)
ఈ దోమలు పంట అన్ని దశలో ఆశిస్తాయి. మొదటి దశలో పిల్ల, పెద్ద పురుగులు మొక్కల మొదళ్ల నుండి రసం పీల్చడం వల్ల పైరు పసుపు రంగుకు మారుతుంది. ఇవి పొట్ట దశలో ఆశిస్తే.. గింజలు తాలుగా మారుతాయి. నివారణకు లీటరు నీటి ¨మోనోక్రొటోఫాస్ 2 మి.లీ. లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. చొప్పున కలిపి పైరుపై పిచికారి చేయాలి.
కంకినల్లి (కంపునల్లి)
ఈ నల్లి సాధారణంగా గింజ పాలు పోసుకునే దశలో ఆశిస్తుంది. వీటి పిల్ల, పెద్ద పురుగులు గింజల నుండి రసం పీల్చడం వల్ల గింజలపై నలుపు లేదా గోధుమరంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ నల్లి సాధారణంగా సాయంత్రం పూట పైరుపై కనబడుతుంది. దీని నివారణకు.. లీటరు నీటికి 2 మి.లీ మలాథియాన్ లేదా క్లోరిపైరిఫాస్ (20 శాతం ఇసి) 2 మి.లీ. చొప్పున కలిపి సాయంత్రం పూట పైరుపై పిచికారి చేయాలి.
మరిన్ని

దేవతార్చన
- మదనపల్లె ఘటన:వెలుగులోకి కొత్త విషయాలు
- 30ఏళ్లకు కలిసిన ముగ్గురు అన్నదమ్ములు
- కనిపెంచిన చేతులే.. కాటేశాయి
- పెళ్లి ముచ్చటపై రష్మి-సుధీర్ ఏమన్నారంటే?
- ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందే: సుప్రీం
- ఎన్నికలను రీషెడ్యూల్ చేసిన ఎస్ఈసీ
- వద్దు నాన్నా.. అంటున్నా వినకుండా..!
- పది మంది భార్యలు.. కోట్ల ఆస్తి.. దారుణ హత్య!
- మళ్లీ జయభేరి మోగిస్తున్నా
- చైతన్య ప్రేమ సందేశం.. నిహారిక కన్నీళ్లు