close
ఆముదంలో చీడల అదుపు

న్యూస్‌టుడే, ఒంటిమిట్ట

బీలో నీటివసతి కింద సాగు చేసిన ఆముదంలో వాతావరణ మార్పులు చీడపీడల వ్యాప్తికి అనుకూలంగా ఉన్నందున నివారణ చర్యలు చేపట్టాలని కడప జిల్లా ఊటుకూరు ఏరువాక కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) శాస్త్రవేత్తలు డాక్టర్‌ ఎ.వీరయ్య (సెల్‌ : 99896 23811), సి.ప్రత్యూష, డాక్టర్‌ బి.పద్మోదయ సూచించారు.

కొమ్మ, కాయతొలుచు పురుగు : పంట పూతదశ నుంచి కాయకోసే వరకు దీని ప్రభావం ఉంటుంది. పురుగు తొలిదశలో కొమ్మలు, కాయలపై పత్రహరితాన్ని గోకి తింటుంది. పూతదశలో కొమ్మను తొలుస్తుంది. దీంతో కొమ్మ ఎండిపోతుంది. తర్వాత దశల్లో కాయలోకి చొచ్చుకువెళ్లి కాయలను నష్టపరుస్తుంది. నివారణకు.. లీటరు నీటికి మోనోక్రొటోఫాస్‌ 1.6 మి.లీ. లేదా ఎసిఫేట్‌ 1.5 గ్రా. చొప్పున కలిపి పూత దశలో ఒకసారి, 20 రోజుల తర్వాత మరోసారి పిచికారీ చేయాలి.


పచ్చదోమ : పిల్ల, తల్లి పురుగులు పాలిపోయిన ఆకుపచ్చ రంగులో ఉండి ఆకుల అడుగున పక్కకు నడుస్తూ కనిపిస్తాయి. ఇవి ఆకుల నుంచి రసం పీల్చడం వల్ల ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోతాయి. నివారణకు.. పురుగు మొదటి దశలో లీటరు నీటికి వేపనూనె 5 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉద్ధృతంగా ఉంటే.. లీటరు నీటికి మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ. లేదా డైమిథోయేట్‌ 2 మి.లీ. లేదా ఎసిఫేట్‌ 1.5 గ్రా. చొప్పున కలిపి ఆకుల అడుగు భాగం తడిచేలా పిచికారీ చేయాలి.


తెల్లదోమ : జనవరి నుంచి మార్చి వరకు వీటి ఉద్ధృతి అధికంగా ఉంటుంది. పిల్ల, తల్లి పురుగులు ఆకుల నుంచి రసాన్ని పీల్చడంతో ఆకులు గిడసబారుతాయి. నివారణకు.. తెల్లదోమల గుడ్లు, పురుగులను సాలీల్లు, అక్షింతల పురుగులు తింటాయి. ఇవి చేలో తగినన్ని కనిపిస్తున్నప్పుడు.. వీటికి హాని చేయని వేపనూనె లీటరు నీటికి 5 మి.లీ., కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉద్ధృతి ఎక్కువైతే లీటరు నీటికి మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ. లేదా ప్రొఫినోఫాస్‌ 2 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.


తామర పురుగు : పంట అన్ని దశల్లో ఇది ఆశించి నష్టపరుస్తుంది. ఇది లేతాకులు, పువ్వులను గోకి రసం పీల్చడం వల్ల ఆకులు ముడుచుకుపోతాయి. పువ్వులు ఎండిపోయి కంకిలో కాయలు ఏర్పడవు. పురుగు ఉధృతంగా ఉంటే నివారణకు.. లీటరు నీటికి మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ. లేదా డైమిథోయేట్‌ 2 మి.లీ. లేదా ప్రొఫినోఫాస్‌ 2 మి.లీ. లేదా 10 లీటర్ల నీటికి ఎసిటామిప్రిడ్‌ 2 గ్రా. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.