close
కొర్రలో సస్యరక్షణ

న్యూస్‌టుడే, అనంతపురం (వ్యవసాయం)

కొర్రలో చీడపీడల నివారణకు చేపట్టాల్సిన చర్యలను అనంతపురం జిల్లా రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) సమన్వయకర్త డాక్టర్‌ జి.నారాయణస్వామి సూచించారు.
* గులాబి రంగు పురుగు : వీటి లార్వాలు తొలచడం వల్ల మొవ్వు చనిపోతుంది. పూత దశలో ఈ పురుగాశిస్తే.. వెన్నులు తెల్ల కంకులుగా మారుతాయి. దీని నివారణకు లీటరు నీటికి 1.6 మి.లీ. మోనోక్రోటోఫాస్‌ కలిపి పిచికారి చేయాలి.
* మిడతలు : ఇవి పైరు మొలకెత్తినప్పటి నుంచి ఆకుల అంచులను కొరికి నష్టం కలిగిస్తాయి. వీటి నివారణకు కార్బరిల్‌ (5 శాతం) పొడి మందు ఎకరాకు 10-12 కిలోల చొప్పున చల్లాలి.
* కాండం తొలుచు పురుగు : ఈ పురుగు కాండాన్ని తొలచడంవల్ల మొక్కలు సరిగా ఎదగక చనిపోతాయి. నివారణకు లీటరు నీటికి 1.6 మి.లీ. మోనోక్రోటోఫాస్‌ కలిపి 20-30 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.
* కత్తెర పురుగు (ఆర్మీవర్మ్‌): వీటి లద్దె పురుగులు మొక్కలు పెరిగే దశలో ఆకులను, వెన్నులను కొరికి తింటాయి. నివారణకు క్లోరిపైరిఫాస్‌ లీటరు నీటిలో 2 మి.లీ. చొప్పున కలిపి పిచికారి చేయాలి.
తెగుళ్లు
* తుప్పు తెగులు : ఆకులకు ఇరువైపులా గోధుమరంగులో చిన్న చిన్న ఉబ్బెత్తు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు ఆకు తొడిమ, కాండం మీద కూడా ఏర్పడుతాయి. వీటి ఉధృతికి ఆకులు ఎండిపోతాయి. నివారణకు లీటరు నీటికి 2.5 గ్రా. మాంకోజెబ్‌ కలిపి తెగులు కనిపించిన వెంటనే పిచికారి చేయాలి.
* అగ్గి తెగులు : ఎదిగిన మొక్కల ఆకులపై నూలు కండె ఆకారంలో మచ్చలు ఏర్పడుతాయి. ఇవి ఆకంతా వ్యాపించి, ఎండి రాలిపోతాయి. కంకి కాడపై మచ్చలు ఏర్పడినప్పుడు కాండం విరిగి, కంకిలో తాలు గింజలు ఏర్పడుతాయి. లీటరు నీటికి కార్బండజిం ఒక గ్రాము లేదా మాంకోజెబ్‌ 2.5 గ్రా. చొప్పున కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.
* వెర్రి కంకి తెగులు : తేమతో కూడిన వాతావరణంలో ఆకుల అడుగున బూజులాంటి శిలీంధ్రం పెరుగుతుంది. దీంతో ఆకులు ఎండి పీలికలుగా కనిపిస్తాయి. మొవ్వులో ఆకులు సరిగా విచ్చుకోవు. మొక్క నుంచి బయటకు వచ్చిన కంకులు ఆకుల్లా మారుతాయి. నివారణకు లీటరు నీటికి 2 గ్రా. చొప్పున మెటలాక్సిల్‌ కలిపి పంటపై పిచికారి చేయాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు