close
కర్బూజ సాగులో మెలకువలు

న్యూస్‌టుడే, ఎమ్మిగనూరు (వ్యవసాయం)

ర్బూజ సాగుతో స్వల్ప కాలంలో మంచి లాభాలు పొందవచ్చు. ఎరువుల వాడకం, చీడపీడల నివారణపై ప్రత్యేక దృష్టి పెడితే నాణ్యమైన అధిక దిగుబడులు వస్తాయని బనవాసిఫారం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) సమన్వయకర్త జి.ప్రసాద్‌బాబు వివరించారు.

ఎరువులు: విత్తిన 25 రోజుల తరువాత ఎకరానికి 43 కిలోల యూరియా వేయాలి. మొక్క 2, 4 ఆకుల దశలో ఉన్నప్పుడు మొదటిసారి లీటరు నీటికి బోరాన్‌ 3 గ్రా. కలిపి పిచికారి చేయాలి. రెండోసారి విత్తిన 50 రోజుల సమయంలో ఇదే మోతాదులో బోరాన్‌ కలిపి పిచికారి చేయాలి. మొక్కల్లో ఆడ పుష్పాల సంఖ్య పెరిగేందుకు, పిందెలు అధికంగా ఏర్పడేందుకు బోరాన్‌ తోడ్పడుతుంది. విత్తిన 50 రోజుల దశలో బోరాన్‌ను పిచికారి చేస్తే.. కాయ పగులుడు సమస్య రాదు. విత్తిన 10వ రోజు నుంచి ఫెర్టిగేషన్‌ పద్ధతిలో డ్రిప్‌ ద్వారా నీటిలో కరిగే ఎరువులను అందించాలి. దీంతో ఎరువుల వృథా తగ్గుతుంది. మొక్కలకు పోషకాల అందుబాటు పెరుగుతుంది. ఫలితంగా నాణ్యమైన అధిక దిగుబడి వస్తుంది.


సస్యరక్షణ

బూడిద తెగులు: ఇది పొడి వాతావరణంలో ఎక్కువగా వస్తుంది. ఆకులపై తెల్లని బూడిద వంటి శిలీంద్రం పెరుగుతుంది. దీంతో ఆకులు పసుపు రంగుకు మారి వడలిపోతాయి. ఫలితంగా తీగ సాగదు. కాయలు తక్కువగా, చిన్నవిగా ఉంటాయి. నివారణ.. లీటరు నీటికి ట్రైడిమార్ఫ్‌ 1 మి.లీ. లేదా ప్రొపికొనజోల్‌ 1 మి.లీ. లేదా హెక్సాకొనజోల్‌ 2 మి.లీ. కలిపి పిచికారి చేసి నివారించుకోవచ్చు.

బూజు తెగులు: వాతావరణంలో అధిక తేమ, ఒక మాదిరి ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఇది వ్యాపిస్తుంది. దీంతో ఆకులపై పాలిపోయిన ఆకుపచ్చ, పసుపు పచ్చ రంగులతో కూడిన (మొజాయిక్‌ లక్షణాలు) మచ్చలు ఏర్పడతాయి. ఈ తెగులు ముందుగా మధ్య ఆకుల్లో వస్తుంది. క్రమేణా ఇతర ఆకులకు వ్యాప్తి చెందుతుంది. తొలుత ఆకులు, క్రమంగా మొక్కంతా ఎండిపోతుంది.

నివారణ: లీటరు నీటికి మ్యాంకోజెబ్‌ లేదా మెటలాక్సిల్‌ 2 గ్రా. లేదా కాపర్‌ ఆక్సిక్లోరైడ్‌ 3 గ్రా. లేదా సైమాక్సినిల్‌ + మాంకోజెబ్‌ 2 గ్రా. వంతున కలిపి మొక్కలపై పిచికారి చేయాలి.

వెర్రి తెగులు : మొదట లేతాకులపై మొజాయిక్‌ లక్షణాలు కనిపిస్తాయి. ఆకులు కిందకు ముడుచుకొని ఆకారం కోల్పోయి చిన్నగా, గరుకుగా కన్పిస్తాయి. ఆకులు గులాబి పువ్వు మాదిరిగా ఒక్కచోటనే అంటిపెట్టుకొని ఉంటాయి. కాయలు ఆకారం కోల్పోయి బొబ్బలతో కన్పిస్తాయి. ఈ వైరస్‌ను పేనుబంక పురుగులు కలుపు మొక్కల నుంచి వ్యాప్తి చేస్తాయి. పేనుబంక నివారణకు.. లీటరు నీటికి 2 మి.లీ. డైమిథోయేట్‌ కలిపి పిచికారి చేయాలి.

పాముపొడ / ఆకు తొలుచు పురుగు: ఈ పురుగులు ఆకులను సొరంగాలుగా తొలిచి తింటాయి. దీంతో ఆకులపై పాము పొడలాంటి చారలు ఏర్పడుతాయి.

నివారణ: ఈ పురుగు పంట తొలి దశలో ఆశిస్తే.. లీటరు నీటికి ట్రైజోఫాస్‌ 2.5 మి.లీ. చొప్పున కలిపి పిచికారి చేయాలి.


పండు ఈగలు: వీటి లార్వాలు కాయలో గుజ్జుని తిని కలుషితం చేస్తాయి. తల్లి పురుగులు గుడ్లు పెట్టడానికి చేసిన రంధ్రాల ద్వారా రసం కారడం గమనించవచ్చు. పురుగాశించిన కాయలు కుళ్లుతాయి.
నివారణ: కాయలను పండేదాక మొక్కలపై ఉంచకూడదు. ఈగల నివారణకు 10 కిలోల తవుడు + 2 కిలోల బెల్లంను రెండు లీటర్ల నీటిలో కలిపి, 24 గంటలు పులియబెట్టాలి. ఆ మిశ్రమానికి 100 గ్రా. థయోడికార్బ్‌ కలిపి  విషపు ఎరను తయారు చేసి పొలంలో అక్కడక్కడ వెదజల్లాలి.


ఫ్యుజేరియం ఎండు తెగులు: ఇది నేల ద్వారా వ్యాపిస్తుంది. ఈ తెగులు సోకిన మొక్క గోధుమ రంగుకు మారి ఎండుతుంది. మొదలును కోస్తే.. కణజాలం పసుపు, నారింజ లేదా గోధుమ రంగులో కనిపిస్తుంది.
నివారణ: ఎకరాకు 2 కిలోల ట్రైకోడెర్మావిరిడి 50 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి మొక్కల పాదుల వద్ద వేయాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు