close
మామిడిలో ప్రస్తుత చర్యలు

న్యూస్‌టుడే, ఒంటిమిట్ట

పిందెలు రాలకుండా ఉండేందుకు.. పూత, పిందెపై తేనెమంచు పురుగులు, తామర పురుగులు, పక్షి కన్ను తెగులు, పూత తినే గొంగళి పురుగులు ఆశించకుండా రైతులు నివారణ చర్యలు చేపట్టాలి. తోటల్లో చెట్లు.. పూత దశలో ఎక్కువగా ఉండి, పిందె దశలో తక్కువగా ఉంటే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
ఏడాది మామిడికి కాలం కలిసిరాలేదు. వాతావరణంలో పెను మార్పులొచ్చాయి. పగటి, రాత్రి ఉష్ణోగ్రతల్లో తేడా కనిపిస్తోంది. ఈ ప్రభావం ఫలరాజం మామిడిలో పూత, పిందెలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈసారి పూత ఆలస్యంగా వచ్చింది. మామిడిలో ఇప్పుడు చేపట్టాల్సిన చర్యలను సూక్ష్మనీటి సాగు పథకం కడప జిల్లా పథక సంచాలకులు డి.మధుసూదన్‌రెడ్డి (చరవాణి: 79950 87055) సూచించారు.
* ఈసారి బంగినపల్లి (బేనిషాన్‌) లాంటి రకంలో ఇప్పటికీ పూత పూర్తి స్థాయిలో రాలేదు. ఇక వచ్చే అవకాశం కూడా లేదు. ఒకవేళ పూత వచ్చినప్పటికీ కాయలు వృద్ధి చెందే అవకాశం తక్కువే. ఇప్పటికే వచ్చిన పూత నుంచి ఎక్కువ శాతం ఫలదీకరణ జరిగి పిందె పట్టేలా జాగ్రత్తలు తీసుకుంటే పిందెలు కాయలుగా వృద్ధి చెందుతాయి.
* ప్రస్తుతం ఇతర రకాల్లో పూత పూర్తిగా వచ్చి పిందె పట్టింది. ఈ పిందెలు కంది గింజ, బఠాణి, గోళీ పరిమాణంలో ఉన్నాయి. ముఖ్యంగా ఆల్ఫోన్స్‌ (ఖాదర్‌), బెంగళూరు, లాల్‌బహార్‌, చెరకు రసం, రుమాని లాంటి రకాలు ఈ దశలో ఉన్నాయి.
* 10 లీటర్ల నీటికి.. ఇమిడాక్లోప్రిడ్‌ 5 మి.లీ + డైక్లోరోవాస్‌ 8 మి.లీ + థయోఫినేట్‌ మిథైల్‌ 10 గ్రాము + ప్లానోఫిక్స్‌ 2 మి.లీ. కలిపి పిచికారి చేయాలి.
* చెట్లపై పూత రాలడం తగ్గిపోయి తెల్లపూత దశ నుంచి పిందె పట్టిన దశలో కంది గింజ పరిమాణం నుంచి బఠాణి, గోళి సైజులో ఉన్న తోటల్లో 10 లీటర్ల నీటికి ఫాస్ఫామిడాన్‌ 20 మి.లీ లేదా ఎసిఫేట్‌ 12.5 గ్రా. + సాఫ్‌ లేదా కంపానియన్‌ 20 గ్రాములు + ప్లానోఫిక్స్‌ 2 మి.లీ. కలిపి పిచికారి చేయాలి.

నీటి యాజమాన్యం : పిందె పట్టిన తర్వాత బఠాణి నుంచి గోళీ సైజులో ఉన్నప్పటి నుంచి నీరు పారించాలి. కాయలు పెరగడానికి 2 వారాల ముందు వరకు నీటి తడులు ఇవ్వొచ్చు. నీటి వసతి తక్కువగా ఉన్నట్లయితే కనీం పిందెలు గోళీ పరిమాణంలో ఒకసారి, నిమ్మకాయ సైజులో మరో తడి, తర్వాత 30 రోజులకు మూడోసారి నీరు పారించాలి.
* చెట్లపై పడమర వైపు కాయలపై ఎండ తీవ్రతకు ఎండబొబ్బ ఏర్పడి కాయలు తెల్లని మచ్చలతో వంకర తిరుగుతాయి. దీని నివారణకు లీటరు నీటికి సున్నం 20 గ్రాములు చొప్పున కలిపి పిందెలు పెద్ద నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు కాయలపై ఒకసారి పిచికారి చేయాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.